బృహత్కథ వెనుక ఆసక్తి కథనం!!

 

మన హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఒకటి కర్మను అనుసరించి, మరియు కారణం ఉండే జరుగుతాయి అంటారు. అది నిజమేనని అనిపిస్తుంది. సాహిత్యం మొదట మొదలయ్యింది సంస్కృత బాషతోనే. ఆ సంస్కృత సాహిత్యం వెలిగేందుకు కారణమైన  రచయితలలో గుణాఢ్యుడు ఒకరు. ఈయన రచించిన బృహత్కథ  గురించి తెలియని సాహిత్యాభిలాషులు బహుశా తక్కువేనని చెప్పాలి. పురాణాలు, సంప్రదాయాలతోనే సాహిత్యం మొదలైందని కూడా చెప్పవచ్చు. అలాంటి సంస్కృత భాషకు వన్నె తెచ్చి, సంస్కృతాన్ని వెలిగించిన బృహత్కథకు మూలం  గుణాఢ్యుడు అని తెలుసు కానీ, ఈ గుణాఢ్యుడి వృత్తాంతం, బృహత్కథ రూపుదిద్దుకున్న విధానం చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది.

గుణాఢ్యుడు బృహత్కథను మొదట  పైశాచిక భాషలో వ్రాయగా క్షేమేంద్రుడు దీన్ని బృహత్కథా  మంజరి పేరుతో సంస్కృతంలోకి అనువదించాడు. అంటే మొదట బృహత్కథ అనేది పైశాచిక భాషలో రూపుదిద్దుకుంది. తరువాత క్షేమేంద్రుడు అనువదించిన బృహత్కథా మంజరిని  సోమదేవుడు విపులంగా కథాసరిత్సాగరం పేరుతో అనువదించాడు. ఇదీ బృహత్కథ పరిణామ క్రమం. 

అయితే బృహత్కథను రచించిన గుణాఢ్యుడికి సంబంధించి ఒక ఆసక్తికర కథ ప్రాచుర్యంలో ఉంది.

 శివుని దగ్గర గణాలు ఉండేవారు. అలా ఉన్న గణాలకు శివుడు కొందరిని నాయకులుగా నియమించేవాడు. ఆ నాయకులకు అందరికి శివుడు నాయకుడిగా ఉండేవాడు. అయితే  ఓ గణానికి అధిపతి అయిన పుష్పదంతునికి  మాల్యవాణుడు  అనే స్నేహితుడు ఉండేవాడు. ఇతనే పార్వతిదేవి  శాపంవల్ల గుణాఢ్యుడిగా జన్మించాడు. విషయంలోకి వెళ్తే …… ఒకసారి పార్వతి, శివుడు ఇద్దరూ ఏకాంతంగా ఉన్నపుడు పార్వతీదేవి శివుడితో  ఇంతకుముందు ఎప్పుడూ నేను వినని కథ  ఒకటి చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు శివుడు పార్వతీదేవికి ఒక కథ చెబుతూ ఉంటాడు. అయితే అదే సమయంలో శివుడి దగ్గర ఓ గణానికి అధిపతి అయిన పుష్పదంతుడు, తన స్నేహితుడు అయిన మాల్యవాణుడితో కలసి శివుడికి, పార్వతికి కనబడకుండా దాక్కుని, కథ మొత్తం వింటాడు. అలా  తెలియ కుండా విన్న పుష్పదంతుడు కథ మొత్తం అయిపోయాక అక్కడి నుండి మెల్లగా వెళ్ళిపోయి తన భార్య జయకు చెబుతాడు. అయితే ఆ కథను పుష్పదంతుడు దొంగగా విన్నట్టు ఆమెకు తెలియకపోవడం వల్ల "కొత్త కథను పార్వతీ దేవికి చెబితే ఎంతో సంతోషిస్తుంది" అనుకుంటూ పార్వతీ దేవి దగ్గరకు వెళ్లి కథ అమొత్తం చెబుతుంది. 

కథను వినగానే పార్వతీదేవి ఆశ్చర్యపోతుంది. "నా భర్త నాకు మాత్రమే చెప్పిన కథ, అందులోనూ ఇంతవరకు ఎవరూ వినని కథ ఈ జయకు ఎలా తెలిసింది??" అనుకుంటుంది పార్వతి. అదే విషయాన్ని శివుడితో అడుగుతుంది. అప్పుడు శివుడు ఏమి జరిగిందో తెలుసుకునేందుకు తన దివ్యదృస్థి ఉపయోగిస్తాడు. పుష్పదంతుడు, అతని స్నేహితుడు తను పార్వతీదేవికి కథ చెబుతున్నప్పుడు వినడం, ఆ తరువాత పుష్పదంతుడు తన భార్యకు అదే కథ చెప్పడం అంతా తెలుసుకుంటాడు శివుడు. తరువాత పుష్పదంతుడిని పిలిచి వివరణ కోరతాడు. అప్పుడు పుష్పదంతుడు తన మిత్రుడు మాల్యవాణుడితో శివపార్వతుల దగ్గరకు వచ్చి తను ఎలా ఆ కథను విన్నది చెప్తాడు. అది వినగానే పార్వతికి కోపం వస్తుంది. మీరిద్దరూ భూమి మీద జన్మించి ఈ కథను ప్రజలకు తెలియజేయండి అని శపిస్తుంది. 

పుష్పదంతుడు కణభూతికి ఆ కథలను చెప్పి శాపవిమోచనం పొందుతాడు.  అయితే భూమిమీద గుణాఢ్యుడిగా జన్మించిన మాల్యవాణుడు కణభూతి నుండి ఆ కథలను విని వాటిని పైశాచిక భాషలో గ్రంథస్థం చేస్తాడు. అలా గ్రంథస్తం చేసిన తరువాత  గుణాఢ్యుడు కూడా శాపవిమోచనం పొందాడు. ఆ కథే బృహత్కథ. 

అదే పరిణామ క్రమం చెందుతూ కథాసరిత్సాగరముగా ప్రస్తుతం అందరికి అందుబాటులో ఉంది.

ఇదీ బృహత్కథ వెనుక జరిగిన వృత్తాంతం, గుణాఢ్యుడి గతం.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories