త్రిపురాసురుల ఆసక్తి కథ!!

 

మయుడు నిర్మించిన అద్భుత భవనం త్రిపురం. తారకాసురుని కుమారులైన కమలాక్షుడు తారకాక్షుడు, విద్యున్మాలి ఈ ముగ్గురిని త్రిపురాసురులని పిలుస్తారు.

కశ్యపుని ఇద్దరు భార్యలు. వారి పేర్లు అదితి, దితి.   అదితికి దేవతలు, దితికి దానవులు(రాక్షసులు) జన్మించారు. అదితి, దితి ఇద్దరూ దక్షప్రజాపతి కుమార్తెలే. వారికి పుట్టిన ఈ దేవతలు మరియు దానవుల మధ్య ఎల్లప్పుడూ యుద్ధాలు జరిగేవి. అమృతం సేవించిన దేవతలదే ఎప్పుడూ గెలుపు అయ్యేది.  సుబ్రహ్మణ్యుడు తారకాసురుణ్ణి వధించడంతో దానవులు మరింత బలహీనులు అయ్యారు. తారకాసురుని కుమారులైన కమలాక్షుడు, తారకాక్షుడు, విద్యున్మాలి ముగ్గురూ బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేస్తారు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అఫుగుతాడు. మాకు అసలు చావు లేకుండా ఉండేలా  వరమిమ్మని అడుగుతారు ముగ్గురు.

అది సాధ్యం కాదు కాబట్టి వేరే అడగమని బ్రహ్మ చెబుతాడు. అయితే మాకు మూడు నగరాలు కావాలి. వెయ్యి సంవత్సరాలకు ఒకసారి మేము ఒకేచోట కలుస్తాము. అప్పుడు ఆ మూడు నగరాలు ఒకేచోట కలవాలి. మేము ముగ్గురం ఒకే బాణంతో చనిపోవాలి(అంటే ముగ్గరు ఒకేసారి ఒకే బాణంతో చనిపోయేలా) అని వరం కోరుకుంటారు. బ్రహ్మ వరమిచ్చి మాయమవుతాడు. తర్వాత వీరు మయుడ్ని పిలిచి ఒకటి బంగారంతో, రెండోది వెండితో, మూడోది ఇనుముతో మూడు నగరాలు నిర్మించమని కోరతారు. ఒకటి స్వర్గంలో, ఒకటి ఆకాశంలో, ఒకటి భూమి మీద వుంటాయి. హిరణ్యకశిపుని సంతతివాడైన బాణుడు ఈ నగరాల పర్యవేక్షణ చూసేవాడు. ఈ మూడు నగరాలను కలిపి త్రిపుర అనేవారు. ఈ మూడు నగరాలలో ఈ ముగ్గురు ఉంటారు కాబట్టే వీరిని త్రిపురాసురులు అని కూడా అంటారు. 

త్రిపురాసురులు ముగ్గురూ ఉన్నా కూడా దానవులు ఎక్కు వగా చనిపోవడం వారి సంఖ్య తగ్గడం వారిని కలచివేసింది. తారకాసురుని కుమారుల్లో ఒకడైన హరి బ్రహ్మను గూర్చి తపస్సు చేయగా అతడు ప్రత్యక్షమయ్యాడు. అతని కోరిక ఏమిటంటే ఒక తొట్టెను నిర్మించి అందులో అమృతాన్ని నింపాలని, అది తాగితే అయిపోతుంది కాబట్టి అందులో మునిగిన వాళ్ళు మళ్ళీ బతకాలని. ఇక చేసేది లేక బ్రహ్మ అలాగే వరం ఇస్తాడు. బ్రహ్మ మాట ప్రకారం మయుడు ఓ తొట్టెను నిర్మించి అందులో అమృతం నింపుతాడు. చనిపోయిన దానవుల్ని దానిలో ముంచితే మళ్ళీ బతుకుతూ ఉంటారు. దానితో శక్తివంతులైన దానవుల ధాటికి దేవతలు భయపడిపోతారు. వాళ్ళు  బ్రహ్మ దగ్గరకు వెళ్లి సలహా అడగగా తనకు సాధ్యం కాదని వారిని శివుని వద్దకు తీసుకువెళ్తాడు.

త్రిపురాసురల గురించి దేవతలు శివుడితో చెప్పగానే శివుడు వారి సంహారానికి ప్రయత్నాలు ప్రారంభించి తపతీనదీ తీరమే సరైన స్థలంగా భావించాడు. నారదుడి ద్వారా అసురుల భార్యలకు దేవతల మంచితనాన్ని చాటి వారిని దేవతలవైపు మరల్చాడు. దేవతల శక్తిలో సగభాగాన్ని తీసుకొని దాన్ని తన త్రిశూలంలో కలుపుకున్నాడు. అక్కడ శివుడు త్రిపురాసుల కలయిక కోసం వెయ్యేళ్లు గడిపాడు. మంద్ర పర్వతాన్ని తన విల్లుగా, వాసుకిని వింటి త్రాడుగా శ్రీమహావిష్ణువును తన అస్త్రంగా చేసుకున్నాడు. అగ్నిని బాణం కొసగా వాయువును బాణం మూలంగా వుంచుకున్నాడు. భూమి రథమైంది. అశ్వనీ దేవతలు రథచక్రాలయ్యారు. బ్రహ్మ రథాన్ని నడిపేవాడయ్యాడు.  ఎప్పుడైతే త్రిపురాసురులు కలుసుకున్నారో అప్పుడు తన త్రిశూలాన్ని విసరగా ఆ మూడు నగరాలు విడిపోయాయి. శివుడు అస్త్రంగా మార్చుకున్న మహావిష్ణువును  సంధించగానే  శ్రీమహావిష్ణువు  ఒకేసారి త్రిపురాసురుల్ని వధించాడు. ఆ వెంటనే  ఆ నగరాలలోని ఆసురులు అందరూ భస్మం అయ్యారు.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories