ఖాండవ వనం కథ!!

 

చాలా పురాతన కాలంలో శ్వేతకి అనే రాజు 100 సంవత్సరాలు యాగం చేశాడు. ఆ యాగానికి కొందరు బ్రాహ్మణులు పౌరోహిత్యం వహించారు. ఆ యాగం వంద సంవత్సరాలు జరుగుతుండటం వల్ల  ఆ పొగ భరించలేక అక్కడున్న బ్రాహ్మణులలో కొందరు అక్కడి నుండి వెళ్లిపోయారు. అలా కొందరు వెళ్లిపోగానే అందరూ చేయవలసిన యాగం కొందరు లేకపోవడం వల్ల ఆగిపోయింది.  యాగం ఆగిపోయిందనే చింతతో ఆ శ్వేతకి అనే రాజు శివుని గూర్చి తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు శ్వేతకి ఎదురుగా ప్రత్యక్షమై కారణం తెలుసుకుని  దుర్వాసుడిని పురోహితుడుగా పంపాడు. కొంతకాలం ఆ యాగం సజావుగా జరిగింది. అయితే ఆ తరువాత యాగంలో అన్నేళ్ళు మండిపోతున్న అగ్నికి అజీర్తి చేసింది. అంతే కాదు దాని పలితంగా అగ్నిదేవుడికి ముఖం అంతా  రక్తహీనమై సన్నబడి రుచి తెలియకుండా పోయింది. అయితే అగ్నిదేవుడు బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మ ఎదురుగా రాగానే తన పరిస్థితి చెబుతాడు. బ్రహ్మ ఖాండవ వనంలో దేవతలకు ఎందరో శతృవులు ఉన్నారని వాళ్లని దహించి వేస్తే నీ వ్యాధి నయమై పోతుందని చెబుతాడు. ఆ మాటలు వినగానే అగ్నిదేవుడు  ఖాండవవనానికి చేరుకుంటాడు.

అయితే ఖాండవ వనంలో ఇంద్రుడి స్నేహితుడు తక్షకుడు నివసిస్తున్నాడు. అగ్ని దేవుడు ఖాండవ వనాన్ని దహించబోతుండగా ఇంద్రుడు గమనించి, తన స్నేహితుణ్ణి కాపాడుకోవడానికి వర్షం కురిపిస్తూ, ఖాండవ వనం కాలిపోకుండా అడ్డు పడుతూ ఉంటాడు.  అగ్ని దేవుడు బ్రహ్మ దగ్గరకు వెళ్లి ఖాండవ వనంలో జరిగిన విషయం అంతా  బ్రహ్మకు చెబుతాడు. బ్రహ్మ అగ్నిదేవుడితో  నరనారాయణుల సహాయం తీసుకొమ్మని చెప్తాడు.

కృష్ణార్జునులు వేసవికాలంలో యమునా నదిలో స్నానంచే యడానికి వెళతారు.  అప్పుడు అక్కడికి అగ్నిదేవుడి బ్రాహ్మణుడి రూపంలో వెళ్లి ఖండవ వనంలో జరిగిన విషయాలు చెప్పి తనకు సహాయం చేయమని అడుగుతారు. కృష్ణార్జునులు కూడా అగ్నిదేవుడు ఆడిగినదానికి సరేనని ఒప్పుకుంటారు. ఆ తరువాత అగ్నిదేవుడు కృష్ణార్జునులకు వరుణు దేవుని సహాయంతో తన దగ్గరున్న ఆయుధాలను అన్నిటినీ ఇచ్చాడు. అర్జునుడికి గాంఢీవం, శ్రీకృష్ణుడికి సుదర్శన చక్రం బహూకరించగా వాళ్లిద్దరూ ఖాండవ వనం నుండి ఎవ్వరూ తప్పించుకోకుండా కాపలా కాశారు. 

ఇంద్రుడు ఎప్పటిలాగే ఖాండవ వనం కాలిపోకుండా వర్షం కురిపిస్తాడు. అప్పుడు అర్జునుడు తన దగ్గర ఉన్న బాణాలతో తెరచాపను సృష్టించి, ఆ వర్షం ఖాండవ వనం మీద పడకుండా చేస్తాడు. ఇదంతా చూసిన  తక్షకుని కొడుకు అశ్వ గాయపడి, అక్కడి నుండి  తప్పించుకొని అర్జునునిపై పగబట్టి కర్ణుడిని చేరతాడు. ఐరావతంపై ఇంద్రుడు, కాలుడు, కుబేరుడు, స్కందుడు, అశ్వనీ దేవతలు వచ్చి ఖాండవ వనం కాలిపోకుండా చేయడానికి శ్రీకృష్ణార్జునులతో యుద్ధం చేసినా అందరూ ఓడిపోయి కృష్ణార్జునులే గెలిచారు. 

మయుడు తప్పించుకొని శ్రీకృష్ణుని పాదాలపై పడి తనను చంపకని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు అతనికి  అభయమిచ్చి పాండవుల కోసం ఓ భవంతిని నిర్మించమన్నాడు. 

ఇదంతా ఒక ఎత్తు అయితే ఖాండవ వనం అందులో  జరితార  పక్షి దాని పిల్లలు అయిన పక్షులు మాత్రం రక్షింపబడ్డాయి. అగ్ని ఖాండవ దహనం చేస్తున్నపుడు జరితార నాలుగు పిల్లలు వేదాలలోని మంత్రాలను పఠిస్తూ మమ్మల్ని కాల్చివేయకుండా కాపాడమని వేడుకుంటాడు. అగ్ని దేవుడు వాళ్ళు ఉన్న చెట్టును మాత్రం వదిలిపెట్టి మిగతా ఖాండవ వనాన్ని మొత్తం కాల్చేస్తాడు. తరువాత అగ్నిదేవుడి అనారోగ్యం పోగానే స్వర్గానికి చేరుకుంటాడు.

ఇదీ ఖాండవ వనం వెనుక కథ!!

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories