దుర్గమ్మ సన్నిధిలో వరలక్ష్మీ వ్రతం.. అపూర్వ అవకాశం వదులుకోకండి..!

శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలతో ఇళ్ళు దేవాలయాలుగా మారిపోయే మాసం. ఈ మాసంలో ప్రతి ఇంటి ముందు రంగుల ముగ్గులు, ఇల్లంతా ధూపాలు, దేవుడి గదిలో దీపాలు, వ్రతాలు, నైవేద్యాలు.. ఓహ్ సాక్షాత్తూ ఆ దేవతలు ఇంట్లో కొలువై ఉన్నారన్నట్టు ఉపచారాలు చేస్తూ ఉంటారు మహిళలు. జూలై 25తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమైంది. శ్రావణమాసంలో ఎక్కువ హడావిడి జరిగేది వరలక్ష్మీ వ్రతం కోసమే.. అయితే ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం చేసుకునే మహిళలకు సాక్షాత్తూ ఆ దుర్గమ్మ అపురూపమైన వరాన్ని ముందు పెట్టింది. ఇంద్రకీలాద్రి పై వెలిసిన దుర్గమ్మ సన్నిధిలో వరలక్ష్మీ వ్రతం చేసుకునే సువర్ణావకాశం అందుబాటులోకి వచ్చింది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
శ్రావణ మాసంలో ఇంద్రకీలాద్రి పై వెలిసిన దుర్గమ్మ ఆలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం నుండి ఉదయం 11 గంటల నుండి కుంకుమ అర్చనల నిర్వహణ ప్రారంభించారు. అదేవిధంగా ఆరష్టు 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు కొత్తగా నిర్మించిన యాగశాలలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ పవిత్రోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్టు కూడా ఆలయ అధికారులు తెలిపారు.
ఆగష్టు 8వ తేదీ శ్రావణ మాసంలో 3వ శనివారం అవుతుంది. ఈ రోజున దుర్గమ్మ గుడిలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా దుర్గమ్మను వరలక్ష్మీ దేవిగా అలంకరిస్తున్నారు. ఆ తరువాత చివరి శుక్రవారం అయిన ఆగష్టు 22వ తేదీ సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తున్నారు. ఈ వ్రతానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తీగా ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఆగష్టు 22వ తేదీ ఉదయం 10గంటల నుండి 11.30 నిమిషాల వరకు వ్రతం జరుగుతుంది. అయితే ఈ వరలక్ష్మీ వ్రతం వేడుకలో పాల్గొనాలని అనుకునే మహిళలు ముందుగా దేవస్థానానికి అప్లై చేసుకోవాలని సూచించారు. మరింకెందుకు ఆలస్యం.. ఆ దుర్గమ్మ సన్నిధిలో వ్రతం చేసుకుని అనుగ్రహానికి పాత్రులు కండి.



