శ్రావణ శుక్రవారం రోజు.. అమ్మవారి ముందు ఇలా  చేస్తే చాలు.. ప్రసన్నురాలు అవుతుంది..

 

శ్రావణ మాసంలో ప్రతి వారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.  అందులో శ్రావణ శుక్రవారం అంటే ఇక ఆ అమ్మవారి పూజలు ఆకాశాన్నంటుతాయి. సాధారణంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు.  ఈ వ్రతం అందరికీ ఉండదు. కొందరికి మాత్రమే ఉంటుంది.  వరలక్ష్మీ వ్రతం లేనివారు అమ్మవారిని సాధారణంగా పూజించుకోవచ్చు. అలాగే దాంతోపాటూ కొన్ని చేయడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం కూడా పొందవచ్చు. ఇంతకీ అమ్మవారి అనుగ్రహం కోసం ఏం చేయాలి? తెలుసుకుంటే..

షోడశోపచార పూజ..

శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకోలేని వారు అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవచ్చు.  ఇందులో 16 ఉపచారాలు ఉంటాయి.  ఈ 16 ఉపచారాలు చేయడం ద్వారా అమ్మవారు సంతోషిస్తుంది. ఈ షోడశోపచార పూజలో ఆవాహనం, ఆసనం,  పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం,  యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం,  దీపం, నైవేద్యం, తాంబూలం,  నమస్కారం, ప్రదక్షిణం మొదలైనవి ఉంటాయి.

పంచోపచార పూజ..

షోడశోపచార పూజ చేయలేని వారు పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు. ఇందులో 5 ఉపచారాలు ఉంటాయి. ఇందులో గంధం,  ధూపం, దీపం,  పూలు, నైవేద్యం ఉంటాయి. ఇది చాలాచాలా సులువుగా చేసుకునేది. దీన్ని నిత్య పూజలో భాగంగా చేస్తారు.

క్షీరాన్నం..

అమ్మవారికి క్షీరాన్నం అంటే చాలా ఇష్టం.  క్షీరాన్నం అంటే పాల అన్నం. అయితే చాలామంది ఏం చేస్తారు.. అన్నం వండి ఆ తరువాత కొంచెం అన్నంలో కాసిన్ని పాలు, పంచదార వేసి కలిపి నైవేద్యం పెడుతుంటారు. కానీ ఇది తప్పు.  క్షీరాన్నం అంటే.. సుమారు ఒక అరలీటర్ పాలలో కాసిన్ని అంటే కేవలం గుప్పెడు కంటే తక్కువ బియ్యం వేసి బాగా ఉడికించాలి.  అది బాగా ఉడికిన తరువాత అందులో కాసింత పంచదార, కొద్దిగా ఏలకుల పొడి వేసి,  కాస్త ఆవు నెయ్యి వేసి అమ్మవారికి నివేదించాలి. ఇది అమ్మవారికి చాలా ఇష్టం. ఇవన్నీ లేకపోయినా కనీసం ఆవుపాలలో అన్నం వండి అమ్మవారికి నివేదించినా అమ్మకు ఇష్టమే..

పానకం..

అమ్మవారికి పానకం అంటే ఎంతో ఇష్టం.   ఒక బెల్లం ఉండను దంచి పొడి చేసి ఒక గ్లాసు నీటిలో వేయాలి. ఇందులోనే ఒక యాలకును కూడా దంచి వేయాలి.  దీన్ని అమ్మవారి ముందు నైవేద్యంగా ఉంచాలి. ఎంతో తృప్తి పడుతుంది.

కుంకుమార్చన..

అన్నింటికంటే శక్తివంతమైన ప్రక్రియ ఇది.  వ్రతం చేసుకోలేని వారు.. అమ్మవారి ముందు పైన చెప్పుకున్న ఏదో ఒక నైవేద్యం ఉంచి.. లలిత సహస్రనామం పఠిస్తూ అమ్మవారి చిన్న విగ్రహానికి కుంకుమ అర్చన చేసుకోవాలి.  ఒకవేళ విగ్రహం లేకపోతే అమ్మవారి పటం ముందు ఒక తమలపాకు ఉంచి అందులో కుంకుమ వేస్తూ అమ్మవారిని అర్చన చేసుకోవాలి. తరువాత ఈ కుంకుమను భద్రపరుచుకుని రోజూ అమ్మను తలుచుకుంటూ ఆ కుంకుమ నుదుటన ధరించాలి.  ఇలా చేస్తే సౌభాగ్యం పదికాలాలు ఉంటుంది.

                          *రూపశ్రీ


More Sravana Masam - Varalakshmi Vratam