దేవాలయంలో ప్రాసాదానికి...దేవుడి మూలవిరాట్టుకు మధ్య సంబంధం ఇదే!
సాధారణంగా దేవాలయాన్ని దర్శించేవారు నేరుగా గర్భగుడి వద్దకు వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుంటూ ఉంటారు. మూలవిరాట్టు దర్శనం అనంతరం ప్రసాదాలు తీసుకుని ఇక వెనుదిరుగుతారు. కానీ దేవుడి ప్రతిమ ఉన్న ప్రాసాదం మొత్తం ఆ భగవంతుడి దేహంతో సమానమని, దానికి తగ్గట్టుగానే ప్రాసాదం నిర్మాణం జరిగి ఉంటుందని శిల్పశాస్త్రం చెబుతోంది. ఈ విషయాలను గమనిస్తే..
గర్భగృహం తు దేవస్య శరీరం ఇతి స్మృతమ్ ప్రతిమ జీవ ఉచ్యతే అంటున్నాయి వేదాలు.
ఉపపీఠమ్ చరణాకారమ్ అధిష్ఠానమ్ జానుమండలమ్ సమాగమ్, కుంభపంజర సంస్థానమ్ నాభి చ ఉదర సమాగమ్ పాదవర్గమ్ కరాకారమ్, ప్రస్థారమ్ బాహు మూలకమ్ తత్ కంఠమ్ గళమిత్యుక్తమ్, శిఖరమ్ ముఖమేవ.. అంటే...
ఆలయంలోని ఉపపీఠం అంటే ప్రతిమకు ఆధారమయ్యే అలంకరణ ప్రాంతం ఆ భగవంతుడి పాదానికి ప్రతీక.
ఆలయ అధిష్ఠానం ఆ దేవదేవుడి ఊరువులకూ, మోకాళ్ళకు ప్రతిరూపం.
ఆలయ పాదవర్గం (గర్భగృహాన్ని ఆవరించిన గోడలు) హస్తాలతో కూడి, తల, కాళ్ళు మినహాయించిన ఆ భగవంతుడి శరీరాన్ని తలపిస్తుంది.
గర్భగృహంలోని పాదవర్గంలో సర్వాలంకార శోభితమైనపూర్ణకుంభం ఆ భగవానుడి ఉదరానికీ, నాభికీ ప్రతీక.
పాదవర్గాన్ని ఆవరించిన ప్రస్తారం (అంతర్భాగమైన గోడల మూలలు) భగవంతుడి బాహువులకు చిహ్నాలు.
ఆలయ శిఖరం కింది భాగం (కంఠం) సాక్షాత్తూ ఆ భగవంతుడి కంఠంతో సమానం.
ఆలయం పైనున్న విమానశిఖరం సంపూర్ణంగా ఆ భగవానుడి ముఖానికీ, శిరస్సుకూ ప్రతీక.
ఈ విధంగా భగవంతుడి దేహంలోని వివిధ భాగాలకు నమూనాగా ఆలయాన్ని భావిస్తూ హిందువులు ఆరాధిస్తూ ఉంటారు. ఈ విషయం ఇప్పట్లో చాలామందికి ఇంత వివరంగా తెలియదు.
అదే విధంగా వేదాలు, వాస్తుశాస్త్రాలు సంపూర్ణ ఆలయ బాహ్యాకృతి నిర్మాణాన్ని కూడా ఆ భగవంతుడి శయన ఆసనంతో పోల్చాయి. మన శిల్పశాస్త్రంలోని కింది పాదం ఇదే భావాన్ని స్పష్టం చేస్తోంది...
గర్భగృహ శిరః ప్రోక్తం అంతరాళం గళం తథా మండపం చ ముఖే బాహుకుసిస్థాన మండపం మహాన్ పాదస్యాంగుళ్య ప్రోక్తః స్థూపయస్థా అంటే...
ఆలయ గర్భగృహం, ఆ భగవంతుడి శీర్షానికి ప్రతీక.
గర్భగృహంలోని 'అంతరాళం' అంటే ముందుభాగం కంఠానికి ప్రతిరూపం.
ముఖమండపం ఛాతీకి ప్రతీక.
మహామండపం మూలవిరాట్టు ఉదరానికి చిహ్నం.
ఆలయం ముందుండే గోపుర మండపం భగవంతుడి పాదానికి ప్రతీక.
గోపురం పైన ఉండే కలశం అంచులు ఆ దేవదేవుడి కాలివేళ్ళకు ప్రతిరూపం.
జ్ఞానోత్తర ఆగమాల ప్రకారం గోపురం, బలిపీఠం, ధ్వజస్తంభం, గర్భగృహంలో శివరూపమైన లింగాకారం, ఆలయ విమాన శిఖరం పైన సన్నని రంధ్రం, వరుసగా భూతాత్మ, అంతరాత్మ, తత్త్వాత్మ, జీవాత్మ, పరమాత్మలకు ప్రతీకలు.
*నిశ్శబ్ద.
