ఆహ్వానం లేకపోయినా సరే.. ఈ 5 ప్రదేశాలకు వెళ్లడానికి వెనుకాడకూడదు..!

భారతీయ సంప్రదాయంలో ఒకరి ఇంటికి లేదా ఏదైనా కార్యక్రమానికి ఆహ్వానం లేకుండా ఎప్పుడూ వెళ్లకూడదని తరచుగా చెబుతూ ఉంటారు.. ఇది ఒకరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. అయితే ఆహ్వానం లేకుండా వెళ్ళవలసిన కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలకు ఎవరు ఆహ్వానించినా, ఆహ్వానించకపోయినా.. తప్పని సరిగా వెళ్లాలని చెబుతున్నాయి శాస్త్రాలు, పురాణాలు. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక, సామాజిక శ్రేయస్సుకు దోహదం చేస్తుందట. పైగా జీవితానికి కొత్త దిశను చూపుతుందని చెబుతారు. ఆ ప్రదేశాలు, సందర్భాలు ఏమిటో తెలుసుకుంటే..
దేవాలయం..
ఎవరైనా దేవాలయాన్ని లేదా తీర్థయాత్ర స్థలాన్ని సందర్శించడానికి ఆహ్వానం కోసం చూడాల్సిన పని లేదు. ఎవరికి వారు దేవాలయ లేదా తీర్థయాత్ర కార్యక్రమంలో స్వయంగా పాల్గొనాలి. సంకోచం లేకుండా సత్సంగం, లేదా ఆచార విధులు నిర్వర్తించే చోటుకు హాజరు కావాలని అంటుున్నారు. ఇది పుణ్యం పొందడానికి దారితీస్తుందట.
గురువు ఇంటికి..
గురువు ఇంటికి వెళ్ళడానికి వెనుకాడకూడదు . గురువు అంటే దేవుని స్వరూపం. శాస్త్రాల ప్రకారం, గురువు ఇంటికి వెళ్ళడానికి వెనుకాడకూడదు. గురువు ఆశీర్వాదాలు జీవితాన్ని నడిపిస్తాయి. ఆయన నుండి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. ఇది జీవితంలో సానుకూలతను నింపుతుంది.
తల్లిదండ్రుల ఇంటికి..
ఇంటి నుండి లేదా తల్లిదండ్రుల నుండి దూరంగా నివసిస్తుంటే, తండ్రి ఇంటికి వెళ్లడానికి ఎప్పుడూ వెనుకాడకూడదు. ఒక తండ్రి తన పిల్లల కోసం ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. గ్రంథాల ప్రకారం.. తండ్రి ఇంటికి వెళ్లడానికి ఎలాంటి ఆహ్వానాలు, పిలుపులు అవసరం లేదు.
స్నేహితుడి ఇంటికి..
సన్నిహిత స్నేహితులు చాలా అనుబంధం కలిగి ఉంటారు. అలాంటి వారి ఇంటికి వెళ్ళడానికి ఎప్పుడూ వెనుకాడకూడదు, ఆహ్వానం కోసం వేచి ఉండకూడదు. ముఖ్యంగా స్నేహితుడు ఇబ్బందుల్లో ఉంటే, అడగకుండానే వారికి సహాయానికి వెళ్ళాలి. స్నేహంలో, ప్రేమ, అధికారం చాలా ముఖ్యమైనవి.
ఇబ్బందుల్లో ఉన్న వారి దగ్గరకు..
ఎవరైనా అనారోగ్యంతో, విచారంగా లేదా పెద్ద ఇబ్బందుల్లో ఉంటే పిలవకుండానే వారి ఇంటికి వెళ్లి సహాయం చెయ్యాలి. ఇలా సేవ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. దైవ కృప కలుగుతుంది. మానవత్వం నిలబడుతుంది.
*రూపశ్రీ.


