సంకష్ట హర చతుర్థి... కష్టాల నుండి బయటపడాలంటే చేయవలసిన వ్రతం...
 

శ్రీ  గణేశాయ నమః
శ్రీ గురుభ్యో నమః

సంకష్ట హర చతుర్థి, ।ప్రతి నెలా వచ్చే మన గణపతి పండుగ.  కష్టాల పాలు అయి ఉన్నవారు ఆ గజాననుని ప్రార్థించి, పూజించి తమ తమ కష్టాలను తొలగించమని వేసుకునే రోజు. వినాయక చవితికి చేసినట్లుగానే గరికతో పూజించి, ఉండ్రాళ్ళు నైవేద్యము పెట్టి, తమ కష్టం తీర్చమని ఆ ఆదిపూజ్యుని వేడుకుంటారు. అన్ని పూజల లానే ఉదయాన్నే సూర్యోదయం అవ్వకమునుపే లేచి అభ్యంగన స్నానం చేయడం, పూజ చేసుకోవడం వంటివి ఈ పూజకు కూడా మాములే. ఇది అందరకు తెలిసిందే. అయితే ఈ సంకష్ట చతుర్థికి ఆ పార్వతి సుతుని నుంచి మనము ఏమి నేర్చుకుని జీవితములో ఆచరిస్తే ఆ స్వామి అనుగ్రహానికి నిజంగా అర్హత పొందుతాము అనే దాని గురించి ఆలోచిద్దాము.

స్వామి జననమే గౌరీ తనయుడిగా అయింది. ముద్దులు మూట కట్టే చిన్నారి బాలుడు తల్లి మాటకు విలువ ఇచ్చి ముందు ద్వారపాలకుడయ్యాడు. తండ్రి తెలియక శిక్షించినా, ఏనుగు ముఖము ఇచ్చినా కోపగించలేదు.

తల్లి తండ్రులకు ప్రియ పుత్రుడై పుత్రానందం కల్గించాడు. శంకరాత్మజుడని వినుతికెక్కాడు.  ఆ తరువాత తన తమ్ముడైన షణ్ముఖినితో పోటీ వచ్చినప్పుడు కూడా ఇలాంటి పోటీ ఏమిటి అని అనక ముల్లోకాలలోని నదులలో స్నానం చేసి ముందుగా తిరిగి రమ్మన్న షరతులోని అంతరార్ధం గ్రహించి సకల జగత్తులకే తల్లి తండ్రులైన తన తల్లి తండ్రులకు " జగతః పితరౌ వన్డే పార్వతీ పరమేశ్వరౌ"  అంటూ ప్రదక్షిణం చేసి గణాధ్యక్షుడయ్యాడు.

అందుకే ఏ శుభకార్యం ప్రారంభించినా..

"తుండమును ఏక దంతమును 
తోరపు బొజ్జయు వామ హస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును
మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున 
కోరిన విద్యలకెల్ల ఒజ్జయై ఉండెడి
పార్వతీ తనయా! ఓయీ గణాధిప
నీకు మ్రోక్కెదన్ "

అంటూ పసి పిల్లలకు సైతం నేర్పించి, ఆ గణనాధునికి నమస్సులిడి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకునేవారు. ఈ రోజు మనము   మనసారా ఆ గణనాధుని సేవించి తరిద్దాము... స్వస్తి

https://www.youtube.com/watch?v=WXvupbDcIt8


More Vinayakudu