కష్టాలు తీరాలంటే సంకష్టహర చతుర్థి రోజున తప్పకుండా ఇలా చేయండి..

 

 

శ్రీ గణేశాయ నమః
శ్రీ గురుభ్యో నమః

సంకష్ట హర చతుర్థి. ప్రతి నెలా వచ్చే మన గణపతి పండుగ. ఎంత చెట్టుకు అంత గాలి అని మన పెద్దలు చెపుతూ ఉంటారు. కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికీ ఉంటాయి.డబ్బు ఉన్నవారు, లేని వారు, స్త్రీలు, వృద్దులు, పసిపిల్లలు. ఇలా ఏదీ ఉండదు. ఎవరి స్థాయికి తగినట్టు వారికి ఎదో ఒక ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది నుంచి, లేదా ఆ కష్టం నుంచి బయటపడడానికి మన శక్తి యుక్తులు సరిపోనప్పుడు పైన ఉన్న, లేదా మన మనస్సులోనే ఉండి మనకు కనపడని భగవంతుని సాయం అవసరం అయినప్పుడు పూజ చేయడం,వ్రతం చేయడము, నోము చేయడము వంటివి చేస్తూ ఉంటాము. తద్వారా ఆ భగవంతుని కృప మనకు లభిస్తుందన్న మానసిక సంతోషము తోటి మనము మన సమస్యల నుంచి సులభముగా బయటపడే మార్గములను వెతుక్కోగలుగుతాము.

అలా ప్రతి నెలా కూడా ఇలాంటి కష్టములు పోగొట్టుకోవడము కొరకు, మానసిక సంతోషము కొరకు, ఆ విఘ్నాధిపతిని పూజించడానికి అవకాశం కల్పించే రోజు ఈ సంకష్ట హర చతుర్థి. ఎప్పటిలాగానే ఈ రోజు పూజ చేసుకోవాలని అనుకున్న వారు లేదా సంకష్ట చతుర్థి వ్రతం చేసుకోవాలని అనుకున్న వారు సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేవడము, స్నానము చేయడము, పూజకు అవసరము అయిన సామాగ్రిని చక్కగా సమకూర్చుకోవడము ఇలాంటివి అన్నీ మనకు తెలిసిన నియమాలే. ఆ తరువాత గణపతిని యధా విధిగా పూజించి, ఉండ్రాళ్ళు, కుడుములు నైవేద్యముగా పెట్టి, సాయంత్రము వరకు ఉపవసించి,ఆ తరువాత వీలయితే దేవాలయమునకు వెళ్లి ఆ ఆదిపూజ్యుని మనసారా తలచుకుని వ్రతం పూర్తి చేయడము అనేది మనం ఎప్పుడు వింటున్నదే. చిన్నపిల్లలు స్కూల్ లో ఎదో నేర్చుకుని ఇంటికి వచ్చి ఆచరిస్తారా అంటే పసి పిల్లలు కాబట్టి వాళ్లకు తెలియదు. మరి మనం కూడా అలాగేనా. పూజ చేసి నా బాధ తీరిపోయింది అని మర్చిపోతామా లేక మనం పూజిస్తున్న గణాధ్యక్షుని నుంచి ఏమైనా నేర్చుకుంటామా? అని ఆలోచించాలి కదా. నేర్చుకుని ఆచరిస్తే నిజంగా ఆ పార్వతీ తనయుని కృపకు పాత్రులమవుతామా అనేది ఒక కథ ద్వారా తెలుసుకుందాము. ఈ కథ మన ఒక తరము ముందు వరకు పిల్లలకు చెపుతూ ఉండేవారు.


ఒకసారి వినాయకుడు కైలాసములో పసివాడుగా ఉన్నప్పుడు పార్వతీ దేవికి చెప్పి బయట వనంలోకి ఆడుకోవడానికి వెళ్ళాడట. ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటే చిన్న పిల్లి పిల్ల కనిపించింది. దానిని పట్టుకోవాలని, దానితో ఆడుకోవాలని బాల గణేశునికి ఎంతో మనసయింది అట. పట్టుకుందామని చూస్తుంటే దొరకకుండా పారిపోతోంది ఆ చిన్న పిల్లి పిల్ల. ఎంతో ప్రయత్నించాడు, కానీ దొరకలేదు. చూడడానికి కాస్త బొద్దుగా,ముద్దుగా ఉంటాడు కదా ఈ గణపతి. అటు పరిగెత్తి, ఇటు పరిగెత్తి కాస్త ఆయాసం వచ్చింది. పసివాడు అవ్వడం తో కోపం కూడా వచ్చింది.ఉడుకుమోత్తనం వచ్చింది. మొత్తానికి కస్టపడి ఆ పిల్లి పిల్లను పట్టుకుని కోపంతో దాని మొహం మీద గీరాడు. రక్తపు చారికలు వచ్చేసాయి. మ్యావ్ అంటూ బాధపడుతూ చేతిలో నుంచి జారి వెళ్ళిపోయింది ఆ పిల్లి పిల్ల. సంతోషముగా వెనక్కు తిరిగి వచ్చాడు గణేశుడు. 


పార్వతీ దేవి అటు వైపుకు తిరిగి కూర్చుని ఉంది. గణేశుడు అమ్మ ఆకలి వేస్తోంది అంటే అక్కడ పెట్టాను నాన్న వెళ్లి తిను ఉండ్రాళ్ళు అంది అమ్మవారు. కానీ గణేశుడి వైపుకు చూడలేదు అమ్మ. ఎటు వైపుకు వెళితే అటువైపు కనిపించకుండా మొఖం తిప్పుకుంటోంది ఆ తల్లి. గణేశుడికి బాధ వేసింది.  అమ్మా,ఏమి చేశాను నేను. ఎందుకిలా తల తిప్పుకుంటున్నావు అని అడిగాడు. అడిగితే ఏమీ లేదు నాన్న నువ్వు వెళ్ళు అంది ఆ తల్లి. అలా కాదు నిజం చెప్పు.ఏమైంది? అంటూ బలవంతముగా పార్వతీ దేవి ఎదురుగా వెళ్లి నిలుచున్నాడు చిన్ని గజాననుడు. తల్లి బుగ్గల మీద రక్తపు చారికలు కనిపించాయి. వెంటనే ఆవేశం వచ్చింది ఆ పార్వతి తనయునికి.  ఎవరమ్మా ఇలా చేసింది?. నిన్ను గాయపరిచేంత దుర్మార్గులు ఎవరు? చెప్పు. వెంటనే వెళ్లి వాళ్ళను కొట్టి వస్తాను అని అన్నాడు. వేరే వాళ్ళైతే నువ్వు కొట్టి వస్తావు. చేసింది నువ్వే కదా అన్నది ఆ తల్లి. అదేంటమ్మా , నేను నిన్ను గాయపరచడం ఏమిటి అని ఆశ్చర్య పోయాడు బాల గణేశుడు. పార్వతీ దేవి నవ్వి పిచ్చి తండ్రి, నీ ఎదురుగా కనిపిస్తున్న నేనే నీకు అమ్మను అనుకుంటున్నావా? నేను ప్రపంచములో చీమ మొదలు ప్రతి దానికీ తల్లిని కదా. నువ్వు ఇందాక ఏమి చేసి వచ్చావు? ఒకసారి గుర్తు తెచ్చుకో అని అడిగింది ఆ సర్వ మంగళా దేవి. వెంటనే అర్ధం అయింది బాల గణేశునికి. వెంటనే కన్నీళ్లతో గబగబా పరిగెడుతూ వనంలోకి వెళ్ళిపోయాడు. వనము మొత్తము తిరుగుతూ పిల్లి పిల్ల కోసం వెతికాడు. 


ఒక చెట్టు పొదలో మూలన కూర్చుని బాధగా అరుస్తోంది ఆ చిన్ని పిల్లి పిల్ల. మొఖం మీద గణేశ చేసిన గాయం తాలూకు రక్తపు చారికలు. వెంటనే దాన్ని దగ్గరకు తీసుకుని, గాయాలకు మందు పూసి, దానికి తినడానికి పెట్టి,అప్పుడు వదిలి పెట్టి ఇంటికి వచ్చాడు గణేశ. ఇంటికి వచ్చేసరికి మొహం మీద గాయాలు అన్నీ మానిపోయి చల్లగా నవ్వుతు ఎదురు వచ్చింది అతని తల్లి పార్వతీ దేవి. చూడగానే కరుచుకుపోయాడు గణేశ. ఎక్కిళ్ళు పడుతూ అమ్మా, పొరపాటు చేసాను మన్నించు అంటుంటే, అప్పుడు ఆ తల్లి ఏమని చెప్పిందో విని ప్రతి ఒక్కరు కూడా విని, తెలుసుకుని ఆచరించాల్సింది. నాన్న, ప్రతి ఒక్క జీవిలో కూడా భగవంతుడు ఉంటాడు. నీవు నీ తల్లిని చూడగలిగితే ఎవరినీ బాధించలేవు. ఇది ప్రతి ఒక్కరు జీవితములో ఆచరించవలసింది. అనవసరముగా ఎవరినీ నొప్పించడం, శారీరికంగా, మానసికముగా హింసించకూడదు.  


హింసించి పూజ చేసాను, వ్రతము చేసాను అంటే ఫలితము ఉండదు. అందరితో మంచిగా ఉంటూ ఉంటే, అనుకోకుండానే, తెలియకుండానే మనకు మంచి జరుగుతుంది అని ఆ తల్లి బాల గణేశునికి చెప్పింది అని మన పెద్ద తరము లో వాళ్ళు చెపుతూ ఉండేవారు.  నలుగురితో మంచిగా ఉండడము, వీలైనంత సాయం చేస్తూ కలిసి పోవడము అనేవి మంచి లక్షణాలుగా ఆ పార్వతి  తనయుడికి తల్లి పసివయసులో బోధించింది. ఈ కథ నిజమా కాదా అనే మీమాంస పక్కన పెడితే ఈ కథలో ఉన్న మంచి నీతిని మనమంతా అలవరచుకుని, ప్రతి నెలా వచ్చే ఈ సంకష్ట హర చతుర్థికి ఆ గణేశునికి పూజ చేయడముతో పాటు మన జీవన విధానములో ఇలాంటి మంచి మార్పు తెచ్చుకుంటూ ఉంటే, అది ఒక అలవాటుగా మారితే మనలో మంచి సంస్కారములు ఎక్కువ అయ్యే కొద్దీ ఇంకా ఇంకా దగ్గరగా అవుతాము. ఆ గణేశుని పరిపూర్ణ కృపకు పాత్రులము అవుతాము కనుక అలా ఆచరించి తరిద్దాము. 

https://www.youtube.com/watch?v=mdrykYqupj8

 


More Vinayakudu