కష్టాలను తొలగించే సంకష్ట చతుర్థి వ్రతం ఎలా చెయ్యాలి? దీని ఫలితాలేంటంటే..!


గణేషుడు ప్రతి శుభకార్యంలో తొలి పూజ అందుకుంటాడు. ప్రతి ఒక్కరూ ఓ కార్యం తలపెట్టినా ఆ కార్యంలో అన్ని సమస్యలను, ఇబ్బందులను తొలగించేవాడని ఈయనను విష్నేషుడు అని కూడా అంటారు. గణేషుడి కరుణ పొందడానికి, కష్టాలను అధిగమించడానికి గణేషుడికి ఎంతో భక్తిశ్రద్దలతో పూజించడం చాలా మంచిది. వినాయక చవితి తరువాత గణేషుడికి ప్రాధాన్యత ఉన్న దినం సంకష్ట చతుర్థి. ఈ రోజున ఉపవాసం ఉండటం, వ్రతం చేయడం, దానం చేయడం మొదలైన పనులు చేస్తే వినాయకుడు చాలా సంతోషిస్తాడు. అయితే ఇది ఎలా చేయాలో.. ఎలా చేస్తే వినాయకుడు తృప్తి చెందుతాడో తెలుసుకుంటే..

సంకష్ట చతుర్థి పూజ లేదా వ్రతాన్ని సాధారణంగా పెళ్లైన మహిళలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మహిళల పిల్లలు, భర్తక్షేమంగా ఉండటం,కుటుంబ సమస్యలు తొలగిపోవడం వంటివి జరుగుతాయని నమ్మకం. చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల పనులలో విజయం సాధించడం, కీర్తి పెరగడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా సంకట చతుర్థి రోజున చంద్రుడికి అర్థ్యం ఇస్తే జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుంది.

సాంయంత్రం సమయంలో చెక్క పీట వేసి దానిమీద పసుపు లేదా ఎరుపు  రంగు వస్త్రాన్ని పరచి ఈశాన్య మూల మట్టితో చేసిన వినాయకుడిని, లేదా చిత్రపటాన్ని ఉంచాలి.  తరువాత పండ్లు, పూలు, అక్షింతలు, నైవేద్యం  మొదలైనవి శక్తి కొద్దీ సమర్పించి పూజించాలి. కుడుములు, మోదకాలు,  నువ్వుల లడ్డూలు మొదలైనవి బెల్లంతో తయారుచేసి స్వామి వారికి నైవైద్యం పెట్టాలి. హారతి ఇచ్చి  సంకష్ట చతుర్థి వ్రత కథ వినాలి.

చంద్రుడిని ప్రసన్నం చేసుకోవడం ఇలా..

పిల్లలు పుట్టడానికి, సంపద, రక్షణ కోసం చంద్రుడిని పూజిస్తారు. చంద్ర స్థానం బలంగా ఉంటే భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా ఉండవు.  అందుకే చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం చాలా ముఖ్యం. ఒక చెంబులో లేదా కుండలో నీరు తీసుకుని అందులో ఎర్ర చందనం, పువ్వులు, అక్షింతలు మొదలైనవి వేయాలి.  ఆ తరువాత  మంత్రం పఠిస్తూ చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి.

'గగనార్ణవమాణిక్య చంద్ర దాక్షాయణిపాతే. 'గృహణార్ఘ్యం మయా దత్తం గణేశప్రతిరూపక'.

ఈ మంత్రం చదువుతూ చంద్రునికి అర్ఘ్యం ఇస్తే కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.

ఏం దానం చెయ్యాలి..

మత్స్య పురాణం ప్రకారం నువ్వులు విష్ణువు చెమట  నుండి ఉద్బవించాయట. లక్ష్మీ దేవి నుండి చెరకు ఉద్భవించిందట . అందుకే నువ్వులు,  చెరకు రసం నుండి తయారైన బెల్లాన్ని దానం చేయడం మంచిదని అంటున్నారు. ఉపవాసం ఉన్నవారికి వీలైతే అన్నదానం, ఉప్పు దానం, బెల్లం దానం, బంగారు దానం, నువ్వుల దానం, వస్త్రదానం,  రత్న దానం, వెండి దానం, చక్కెర దానం ఇలా పది  దానాలు చేయడం చాలా గొప్ప ఫలితాలు ఇస్తుందట. ఇలా చేయడం వల్ల  దుఃఖం, దారిద్ర్యం, రుణం, వ్యాధి,  అవమానాల  నుండి విముక్తి పొందుతారట. ఆవులకు, ఏనుగులకు బెల్లం తినిపిస్తే అకాల మరణ భయం ఉండదట. ఇక ఈరోజు  విద్యార్థులు  'ఓం గం గణపతియే నమః' అని 108 సార్లు జపించడం వల్ల వారిలో  తెలివితేటలు పెరిగి ఉన్నత చదువుల దిశగా వారు నడుస్తారని అంటారు.  అలాగే 'ఓం ఏక దంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్' అనే విఘ్నేశ్వర గాయత్రి మంత్రాన్ని  జపించడం వల్ల  జీవితంలోని అన్ని కష్టాలు,  అడ్డంకులు తొలగిపోతాయని కూడా నమ్ముతారు.

                                       *నిశ్శబ్ద.


More Vinayakudu