పరిగెడుతున్న మనసును పట్టి కూర్చోబెట్టేది ధ్యానం

చాలామంది ధాన్యం చేయాలని అనుకుంటారు. కానీ అలా ధ్యానంలో కూర్చోగానే ఇలా లేచిపోతుంటారు. సహజంగా 5 నిమిషాలు కూడా స్థిరంగా కూర్చునేవారు ఉండరు ఎక్కువ. ఇదంతా ఎందుకు అంటే నిలకడలేమి. కానీ ధ్యానం చేయాలి, జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి మానసిక ప్రశాంతతకు, బుద్ధి వికాసానికి. కానీ ఎట్లా ఈ మనసు కుదురుగా ఉండకుంటే ఏమి చేసేది?? ఆ మనసును నిలకడగా ఉంచుకుంటే సరికదా!! అది ఎలా అంటే గీతలో కృష్ణపరమాత్ముడు ఇలా చెబుతాడు.

యతో యతో నిశ్చరతి మనశ్చఞ్చలమస్థిరమ్|
తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్|| 

అస్థిరమైన, చంచలమైన మనస్సు ఎక్కడెక్కడకు పోతుందో అక్కడక్కడనుండి ఆ మనసును లాగుకొని వచ్చి ఆత్మ యొక్క అధీనంలో ఉంచవలెను.

మనసు చంచలమైనది. అది ఒక చోట నిలువదు. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ధ్యానంలో కూర్చున్న మరుక్షణం ప్రపంచంలో ఉన్న అన్ని పనికిమాలిన, వ్యర్థ ఆలోచనలు అన్నీ మనకే వస్తాయి. మరి ఎలాగ? నా గతి ఇంతేనా! నేను ధ్యానం చేయలేనా! నేను భగవంతుని మీద మనసు నిలుపలేనా! బాగుపడలేనా! అని చాలా మంది వాపోతుంటారు. వారి ప్రశ్నలకు ఈ శ్లోకంలో సమాధానం చెబుతాడు పరమాత్మ. చంచలంగా ఉండటం, నిలకడలేకపోవడం, అటు ఇటు తిరగడం మనస్సు యొక్క సహజ గుణం. దానికి మనం ఏమీ చేయలేము. నీళ్లు ఒలికితే పారిపోతాయి. పారడం నీటి యొక్క సహజ గుణం. గ్లాసులోనో, కుండలోనో, పాత్రలోనో, నదులకు ఆనకట్టలు కట్టి నీటిని పారి పోకుండా నిలువరిస్తాము. అలాగే మనసును నిలువరించడానికి కూడా మార్గాలు ఉన్నాయి.

మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు పారిపోతే, మనకు చిక్కకుండా అటు ఇటు తిరుగుతుంటే, చంచలంగా ఉంటే ఏమి చేయాలి?? 

చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే మన ఇంట్లో ఒక 3 ఏళ్ల పసివాడు ఉన్నాడు అనుకుందాము. వాడు చాలా అల్లరివాడు. వాడికి అన్నం తినిపించాలంటే తల్లి పెద్ద కసరత్తు చేయాలి. తల్లి ఎంత చెప్పినా మాట వినడు. అటు ఇటు తిరుగుతుంటాడు. ఇటు పోతే అటు, అటు పోతే ఇటు పరుగెడుతుంటాడు. తల్లి చేతికి చిక్కడు. చిక్కినట్టే చిక్కి, పారిపోతుంటాడు. అటువంటి అల్లరి వాడిని తల్లి పట్టుకొని చంకలో ఇరికించుకొని, మంచి మాటలు చెబుతూ చందమామను చూపిస్తూ, బుజ్జగిస్తూ, అన్నం తినిపిస్తుంది. ఇదే మాదిరి ఎప్పుడెప్పుడైతే మన మనసు మన మాట వినకుండా ప్రాపంచిక విషయాల వంక, విషయవాంఛల వంక, కోరికల వెంట పరుగెడుతూ ఉంటుందో, అప్పుడప్పుడు, మనసును మంచి మాటలతో లాలించి బుజ్జగించి, పట్టుకొని తీసుకొని వచ్చి ఆత్మలో కూర్చోపెట్టాలి.

ఇది ఒకసారి చేస్తే కుదిరే పని కాదు. అందుకే యతో యతో అంటే ఎప్పుడెప్పుడైతే మనసు బయటకు పరుగెడుతుందో, తతః తతః అంటే అప్పుడప్పుడు ఆ మనసును లాక్కొచ్చి ఆత్మలో లీనం చేయాలి అని అర్థం. ఎందుకంటే మనసు అతి చంచల మైనది. ఒక చోట నిలకడగా ఉండదు. అది అందరూ ఒప్పుకుంటారు. ధ్యానంలో కూర్చున్న తరువాత, మనసును నెమ్మదిగాపట్టుకొని వచ్చి ఒక చోట కూర్చోపెట్టినా, మరలాఅది అటో ఇటో పారిపోతుంది. అనవసరవిషయాల మీదికి మళ్లుతుంది. లాలించి బుజ్జగించి మరలా తీసుకొని వస్తే, ఏదో సందుచూసుకొని పారిపోతుంది.

అజ్ఞాని అయినవాడు ఆ మనసు ఎటు బోతే దాని వెంట పరుగెడుతుంటాడు. మనసు ఎలా చెబితే అలా ఆడుతుంటాడు. తనలోని విచక్షణా బుద్ధిని ఉపయోగించడు. దీనికి ఒకటే మార్గం. అనవసర విషయాల మీదికి మనసును లగ్నం చేయక పోవడం. అప్పుడు కొన్ని విషయాల మీదనే మనసు లగ్నం అవుతుంది. వాటి నుండి మనసును మళ్లించడం తేలిక. రెండవ మార్గం ఏమిటంటే బయట ప్రపంచంలోని వస్తువుల సంగమంతో దొరికే సుఖం తాత్కాలికము అనే భావన కలగాలి. అప్పుడు తాత్కాలికంగా వైరాగ్యం కలిగే అవకాశం ఉంది. అప్పుడు మనసును తేలిగ్గా మరల్చవచ్చు. వివేక వంతుడు మనసును ఆత్మయందు లగ్నం చేసి అమితమైన ఆనందాన్ని శాంతిని పొందవచ్చు.

ఆత్మన్యేవ వశం నయేత్ అన్నారు. అంటే మనసు ఆత్మ వశంలో ఉండాలి. ఏదో సందు చూచుకొని పారిపోకూడదు. మనం ధ్యానం చేసేటప్పుడు మనసు మన అధీనంలో ఉండదు. కళ్లు మూసుకోగానే అనవసరమైన విషయాలన్నీ ఆలోచిస్తుంది. ఎక్కడెక్కడి విషయాలో గుర్తుకు వస్తాయి. అంటే ఇంద్రియములను కట్టి పడేసినా మనసు మాత్రం దాని ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పరుగెడుతుంటుంది. స్థిరంగా ఉండదు. చంచలంగా ఉంటుంది అని భగవానుడే చెబుతున్నాడు. ఇది సర్వసాధారణం. అంతమాత్రం చేత నాకు ధ్యానం కుదరదు అని నిరుత్సాహపడకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. పారిపోతున్న మనసును పట్టుకొచ్చి ధ్యానంలో నిలపాలి. మరలా పారిపోతుంది. అది దాని లక్షణం. అధైర్యపడకుండా మరలా దానిని లాక్కొచ్చి కూర్చోపెట్టాలి. దానికి కావాల్సింది ప్రాపంచిక విషయముల మీద ఎక్కువగా సంగమం లేకపోవడం. వాటి గురించిన అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకపోవడం. అనవసరమైన ఆలోచనలు లేని మనసు మనం చెప్పినట్టు వింటుంది. మన అధీనంలో ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా నిరంతర సాధనతోనే సాధ్యం అవుతుంది.

కాబట్టి మనసును ఆధీనంలో ఉంచుకోవాలంటే పైన చెప్పినట్టు చేయాలి.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories