మాసశివరాత్రికి ఏం చేయాలి!

ప్రతి మాసంలోనూ, శుక్లపక్షంలో… త్రయోదశితో పాటు వచ్చే చతుర్దశి తిథిని మాసశివరాత్రిగా పేర్కొంటారు. అలా నెలకి ఓసారి వచ్చే శివరాత్రిని మాసశివరాత్రి అని పిలుస్తారు. ఈ రోజు శివుడికి మహా ప్రీతికరం. అందుకని ఆయనని కొలుచుకునేందుకు, అనుగ్రహం దక్కించుకునేందుకు ఈ రోజు మహా విశిష్టం! 

పౌర్ణమి, అమావాస్యలు రెండూ కూడా చంద్రుని ప్రభావాన్ని చూపే రోజులు. పౌర్ణమి సమయంలో సూర్యునితో పోటీపడుతున్నట్టుగా ఉండే జాబిలి, అమావాస్య నాటికి క్షీణచంద్రునిగా మారిపోయి చీకటిలో కలిసిపోయి ఉంటాడు. ఈ సమయంలో మన మనసు కూడా స్తబ్దుగా, నిస్తేజంగా ఉంటుందనీ… నిరాశతో నిండిపోతుందనీ చెబుతారు. ఇలాంటి సమయంలో జప, దాన, ఉపవాసాలతో నిష్టగా శివుని ఆరాధిస్తే మనసు జాగృతం అవుతుందని పెద్దల హితవు. ఇంతకీ ఈ రోజు శివుని ఎలా ఆరాధించాలి! 

శివుడు అభిషేక ప్రియుడు. క్షీరసాగరమథనంలో పరమేశ్వరుడు గరళాన్ని దిగమించి, ఈ ప్రపంచాన్ని కాపాడాడు. అయితే ఆ గరళం వల్ల నిరంతరం తన శరీరం సెగలు కక్కుతూ ఉంటుందట. అందుకనే శివుని తల మీద చల్లని చంద్రుడు, గంగమ్మ తల్లి కొలువు తీరి ఉంటారు. అయినా కూడా తాపం చల్లారని ఆ శంకరునికి నిత్యం అభిషేకిస్తూ ఉంటే, ఆయనకు ఉపశమనం లభిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది భక్తుల కోసమే! ఆదిమధ్యంత రహితుడు, ప్రళయకారుడైన పరమేశ్వరునికి ఊరట అందించడానికి మానవులెంతటివారు. కానీ… తనని భక్తి సేవించుకునే మార్గాన్ని సూచించడం కోసమే ఈ సూచన చేసి ఉంటారు. 

పరమేశ్వరునికి బిల్వదళాలు కూడా మహాప్రీతికరం అని చెబుతారు. మాసశివరాత్రి రోజున ప్రదోషకాలంలో ఆ స్వామిని అభిషేకిస్తూ, బిల్వదళాలతో పూజిస్తూ… రుద్రం, బిల్వాష్టకం, శివపంచాక్షరి స్తోత్రం, మహామృత్యుంజయ మంత్రం లాంటివి పఠించాలి. ఇక శివాలయానికి వెళ్లే వీలు ఉంటే, స్వామిని దర్వించుకుని వీలైతే అభిషేకంలో పాల్గొనాలి. 

పరమేశ్వరునికి ఉపవాసం, జాగరణ అంటే కూడా మహాప్రీతి. అందుకని ఈ రోజు ఉదయమంతా ఉపవాసం ఉండి, సాయంవేళ పరమేశ్వరుని పూజించి... రాత్రివేళ జాగరణ చేయాలి. జాగరణ అంటే కాలక్షేపం చేస్తూ మెలకువగా ఉండటం కాదు! భగవన్నామస్మరణతో మనసుని జాగృతం చేసుకోవడం! ఈ శివరాత్రులన్నింటిలోకీ మాఘమాసంలో వచ్చే చతుర్దశి తిథికి మరింత ప్రాముఖ్యత ఉంటుంది. అందుకనే ఆ రోజును మహాశివరాత్రిగా పేర్కొంటారు. 

ఒకవేళ మాఘమాసంలోని శివరాత్రి నాడు శివుని అర్చించుకోవడం కుదరకపోయినా…. మాసశివరాత్రిని నిష్టగా జరుపుకుంటే తప్పకుండా భోళాశంకరుని అనుగ్రహం లభిస్తుంది. మొత్తంగా మాసశివరాత్రి నాడు ఏదో ఒక రీతిన శివుని అర్చించుకోడం ఫలదాయకం. కనీసం పంచాక్షరి, మహామృత్యుంజయ మంత్రం లాంటివి స్మరణ చేసినా మంచిదే! 

- మణి


More Maha Shivaratri