శివరాత్రి విశేషాలు...

 

అమవాస్య ముందురోజైన కృష్ణపక్ష చతుర్దశి అంటేనే శివునికి మాహా ప్రీతికరమైన రోజు. అందుకే ప్రతి మాసంలోనూ వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మాసశివరాత్రి అని పిలుచుకుంటారు. ఆ రోజున శివుని భక్తితో కొలుచుకుంటారు. ఏడాది పొడవునా వచ్చే శివరాత్రులలో మాఘమాసంలో వచ్చేది మహిమాన్వితమైనది కాబట్టి, దీన్ని మహాశివరాత్రి అంటూ ఓ పెద్ద పండుగలా భావిస్తారు. పండుగ అన్న మాట వినగానే మనకు పిండివంటనే గుర్తుకువస్తాయి. కానీ శివరాత్రి మాత్రం శరీరానికి కాదు, మనసుకే పండుగ! ఉపవాసజాగరణలతో శివసాయుజ్యానికై తపించే వేడుక! అలాంటి శివరాత్రితో ముడిపడి ఉన్న కొన్ని అంశాలు... వాటి వెనుక ఉన్న విశేషాలు...

చతుర్దశి విశేషం!

పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న పక్షాన్ని కృష్ణపక్షం అంటాం. ఈ తిథులలో ఒకో రోజూ గడిచేకొద్దీ చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు. అందుకే ఆయనను క్షీణ చంద్రుడు అని కూడా పిలుస్తారు. జ్యోతిషశాస్త్ర ప్రకారం చంద్రుడు మనఃకారకుడు. అమావాస్య నాటికి, ఆయన మనసుని నిస్తేజంగా మార్చేస్తాడని ఒక నమ్మకం. తద్వారా మనుషుల ఆలోచనా తీరు, వారిలోని ఉత్సాహం మందగిస్తాయట. ఇలాంటి సమయంలో భగవంతుని మీద మనసుని లగ్నం చేయడం వల్ల రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి- నిస్తేజంగా ఉన్న మనసు భగవన్నామంతో ఉత్తేజితం అవుతుంది. రెండు- ఎటువంటి కష్టం వచ్చినా, వాటిని ఆ భగవంతుని మీద భారం వేసే నమ్మకం కలుగుతుంది. మర్నాడు నిస్సత్తువగా గడవాల్సిన అమావాస్య కూడా ఉత్సాహంగా సాగిపోతుంది.

మాఘ శివరాత్రే ఎందుకు!

శివరాత్రినాటికి చలి, శివశివా అని వెళ్లిపోతుందంటారు పెద్దలు. రథసప్తమినాటికి మొదలయ్యే సూర్యకిరణాల తీక్షణత మరుసటి వారంనాటి శివరాత్రికి వేడినందుకుంటాయి. అంటే శివరాత్రినాటికి చలి, వేడి ఒకేస్థాయిలో ఉంటాయన్నమాట. ఎండాకాలం ఉపవాసం ఉండటం కష్టం. చలికాలం జాగరణ చేయడం కష్టం. ఈ రెండూ ఇష్టంగా చేసేందుకు వాతావరణం కూడా కాస్తా అనుకూలించాలి కదా! అలాంటి సమశీతోష్ణ స్థితి ఉండేది మహాశివరాత్రినాడే!

 

ఉపవాసం, జాగరణ

శరీరానికి ఎప్పటికప్పుడు ఆహారం అందిస్తున్నంతసేపూ అది సుఖంగా ఉంటుంది. సుఖపడే శరీరం మనసుని కూడా జోకొడుతుంది. కానీ ఒక్కరోజున కనుక శరీరాన్ని ఎండపెడితే, నేనంటూ ఒకదాన్ని ఉన్నానంటూ అది మనకి గుర్తుచేస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటూ మనసు విచారణ సాగిస్తుంది. ఉపవాసజాగరణలతో శరీరం, మనసు రెండూ మెలకువతో ఉంటాయి. మనసావాచా శివుని ధ్యానించేందుకు ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుంది!

బిల్వ పత్రం

శివరాత్రినాడు శివుని బిల్వపత్రంతో పూజించాలని చెబుతారు. మూడుకొసలుగా చీలి, చూడగానే త్రినేత్రుని గుర్తుకుతెచ్చే బిల్వం (మారేడు) మన దేశంలోనే పుట్టిన ఒక ఔషధి వృక్షం. బిల్వవృక్షం ఎదిగేందుకు ఎలాంటి ప్రత్యేక వాతావరణం అవసరం లేదు. కోసిన తరువాత కూడా సుదీర్ఘకాలం నిల్వ ఉండే ఈ దళాలు, ఆరోగ్యపరంగా దివ్యౌషధాలు. అందుకే బిల్వ పత్రానికి ‘మృత్యు వంచనము’ అన్న పేరు కూడా ఉంది. సుదీర్ఘకాలంపాటు శివలింగం చెంతనే ఉన్నా ఈ పత్రాలు చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేస్తాయే కానీ, గాలిని కలుషితం గావించవు. మరి శివుని బిల్వ పత్రాలతో కాకుండా మరే పత్రాలతో పూజించగలం!

 

అభిషేకం

విగ్రహాన్ని స్పర్శించడం ద్వారా భగవంతుని పూజించుకునే గొప్ప మార్గం... అభిషేకం! అందునా శివుని అభిషేక ప్రియుడు అంటారు. పళ్లు, పూలు ఏవీ దొరక్కపోయినా కాసిని బిల్వపత్రాలతో పూజించి, లింగానికి అభిషేకం చేస్తే తృప్తి పడిపోతాడు భోళాశంకరుడు. శివలింగం గుడిలో ఉంటే నిరంతరం పైనున్న ధారాపాత్ర నుంచి నీటి ధార పడుతూ ఉండాల్సిందే! అభిషేకం అంటేనే ప్రక్షాళన చేయడం అన్న అర్థం వస్తుంది. శరీరాన్ని ఎలాగైతే నీటితో శుద్ధి చేసుకుంటామో, మనసుకి అంటిన మలినాన్ని తొలగించేందుకు సూచనగా సాగే ఆచారమే అభిషేకం!


More Shiva