తలకిందులుగా దర్శనమిచ్చే శివుడికి ఘనమైన శివరాత్రి

 


శివుని రూపాలు ఒక్కొక్క ఆలయంలో ఒక్కో విధంగా ఉంటాయి. ఎక్కువగా లింగాకారంలో దర్శనమిచ్చే శివుడు ఒక ఆలయంలో మాత్రం తలకిందులుగా అంటే శీర్శాసనంలో దర్సనమిస్తాడు. అది ఎక్కడో కాదండి మన తెలుగు జిల్లాలోనే ఉంది. ఇలాంటి శివలింగాన్ని దర్శించుకోవాలంటే మనం భీమవరానికి దగ్గరలో ఉన్న ఎనమదురుకు వెళ్ళాల్సిందే. ఇక్కడి శివలింగం ఆకృతి తలకిందులుగా శీర్షాసనం వేసిన శివుని రూపంలా దర్శనమిస్తుంది. అంతే  కాదు పక్కనే పార్వతీదేవి ఒడిలో మూడు ఏళ్ళ పసివాడైన సుబ్రహ్మన్యుడిని పట్టుకుని కూర్చుని ఉంటుంది. ఈ శక్తీస్వర ఆలయం ద్వారక ఆలయం కన్నా పురాతనమైనదని చెప్తారు.

మహాకవి కాళిదాసు ఇక్కడ శక్తిని కొలిచాడని కుమారసంభవంలో ఉంది. ఈ ఆలయంలో ఉన్న ఇంకో  ప్రత్యేకత ఇక్కడి శక్తి గుండం. ఎంతో పవిత్రమైన ఈ గుండంలో నీటితోనే స్వామి వారికి నైవేద్యాలు తయారుచేస్తారట. స్వామి వారికీ ఈ గుండంలో నీరంటే ఎంతో ప్రీతి అని చెప్పటానికి నిదర్శనంగా ఒక కథ ప్రాచుర్యం పొందింది. ఒకసారి గుండం చుట్టూ ప్రాకారం నిర్మించటానికి గుండంలో నీరంతా తోడేసారట,ఆ సమయంలో పక్కనున్న వేరే చెరువు నుంచి నీళ్ళు తెచ్చి నైవేద్యం తయారు చేద్దామంటే ఎంత సేపటికి అన్నం ఉడకలేదట. అప్పుడు మళ్ళి శక్తి గుండంలోనే చిన్న గొయ్యి తీసి నీరు ఊరాకా ఆ నీటితో అన్నం వండితే వెంటనే ఉడికిందట. అప్పటి నుంచి నేటి వరకు స్వామివారికి ప్రసాదాలు తయారుచేయటానికి ఈ గుండంలో నీటినే వాడుతున్నారని చెపుతున్నారు ఇక్కడి అర్చకులు.    

ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. శివరాత్రి నాడు ఇక్కడ కళ్యాణమహోత్సవం నిర్వహిస్తారు. అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఎంతో వైవిధ్యంగా ఉండే ఇలాంటి దేవాలయాలని తప్పక దర్శించాలని అనిపిస్తోంది కదూ. మరిక ఆలస్యం దేనికి ఈ ఆలయాన్ని దర్శించి శివుని కృపాకటాక్షాలకి పాత్రులుకండి.

..కళ్యాణి


More Shiva