పంచవటిలో రాముడిని మనసులో ప్రతిష్టించుకోవడం ఎలా?

ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తిని అయినా పాతాళానికి తోసేయగలిగినది కామం. శారీరక కోరికల మోహంలో చిక్కిపోతే ఆ కామం మనిషిని కాల్చివేస్తుంది. 

రామాయణంలోకి చూస్తే శ్రీరామలక్ష్మణులు మోహితురాలైన శూర్పణఖను ఎదుర్కోవలసి వచ్చింది. శూర్పణఖ రూపంలో కామం వారిని చుట్టుముట్టింది. కానీ రాముడు యుక్తితో, సున్నిత వచనాలతో శూర్పణఖ (కామం) దారిని మళ్ళించాడు. ఇక లక్ష్మణుడు తన దగ్గరకు వెళ్ళిన ఆ కామాసురి మాయలో పడకుండా, ధైర్యంతో శూర్పణఖను శిక్షించాడు.

కామానికి అవరోధం కలిగితే ఆ కామం వికృత రూపం దాల్చి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. 'కామాత్ క్రోధోభి జాయతే'

కోరిక తీరక పరాభవం పొందిన శూర్పణఖ తన సోదరుడైన ఖరుడి దగ్గరకు వెళ్ళి తన వ్యధను వెళ్ళబుచ్చింది. శూర్పణఖకు జరిగిన పరాభవానికి ప్రతీకార భావమే ఖరునిలో క్రోధాగ్నిని జ్వలింపజేసింది. క్రోధం వల్ల మనిషి యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం కోల్పోతాడు. క్రోధంతో బుద్ధిని కోల్పోయిన ఖరుడు, శ్రీరాముని చేతిలో వినాశనం చెందాడు.

కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ఠంతి తస్కరాః | జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత |

“కామ క్రోధ లోభాలనే దొంగలు మనలో ఉన్న జ్ఞాన రత్నాలను అపహరించడానికి పొంచి ఉన్నారు. కాబట్టి సాధకులు సదా అప్రమత్తతతో మెలగాలి" అని శ్రీశంకరాచార్యులు హెచ్చరిస్తున్నారు. 

'ప్రమాదతః ప్రచ్యుత కేలి కందుకః
సోపాన పంక్తా పతితో యథా తథా' 

 ఈ ఆధునిక యుగంలో సాధకుల్ని కామవికారాలకు గురిచేసే ఆకర్షణలు అనంతం. "సాధకుడు వాటి బారి నుండి రక్షించుకొని మనస్సును అధీనంలో ఉంచుకోకపోతే ప్రమాదవశాత్తూ చేయిజారి మెట్లపై పడిన బంతిలా అధోగతి పాలవుతాడు".

పంచవటిలో సీతారాముల కోసం పర్ణశాలను నిర్మించాలనుకున్నప్పుడు లక్ష్మణుడు ముందుగా చెట్లూ చేమలతో నిండిన ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి, నివాస యోగ్యమైన ఓ సుందర పర్ణశాలను నిర్మించాడు. లక్ష్మణుడు భక్తి శ్రద్ధలతో నిర్మించిన ఆ పర్ణశాలలో శ్రీరాముడు సీతా సమేతంగా నివసించాడు.

అయితే.. అందరూ తెలుసుకోవలసిన విషయమేమిటంటే.. మన మనస్సే ఒక పర్ణశాల భగవంతుడు మన హృదయ మందిరంలో నివసించాలంటే కామక్రోధాలను పారద్రోలి హృదయాన్ని పవిత్రంగా ఉంచాలి. పరిశుద్ధమైన మనసులో భగవంతుడు ప్రతిష్ఠితమై ఉంటాడు.

మన దేహం(పంచవటి)లో పరమాత్ముణ్ణి (రాముణ్ణి) ప్రతిష్ఠించాలంటే మనస్సు (పర్ణశాల)ను పవిత్రంగా ఉంచాలి. 'అరణ్యవాసం'లో అసురులను శ్రీరామలక్ష్మణులు వధించినట్లు మన 'ఆధ్యాత్మికవాసం'లో ఎదురయ్యే కామక్రోధాది అసురులను వివేక వైరాగ్యాలతో వధించాలి. అప్పుడే మనం పంచవటిలో పరమాత్ముణ్ణి నిత్యం దర్శించుకోగలం.

                                     ◆నిశ్శబ్ద.


More Subhashitaalu