ప్రమాణాలు ఎలా ఉండాలి??


ఈ ప్రపంచంలో మనిషి ఒకానొక దశలో చేసే పని అన్వేషణ. అది తనను తాను అన్వేషించుకోవడం.తనలో ఉన్న ఆత్మస్వరూపం కోసం అన్వేషణ సాగించడం ఆ ప్రయాణంలో దేవుడిని, సిద్ధాంతాలను, ఎంతో మంది చెప్పిన విషయాలను తెలుసుకుంటూ, పోల్చుకుంటూ, పరిశోధించుకుంటూ, ప్రశ్నించుకుంటూ వెళ్తాడు. 

అలాంటి  సత్యాన్వేషణలో  శాస్త్రాలు కూడా బోలెడు ఉన్నాయి. ఎందరో ఆధ్యాత్మిక గురువులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. అది ఏ శాస్త్రానికి సంబంధించినదైనా ప్రమాణాలు పునాదిరాళ్ళలాంటివి. వేదాంతం ముఖ్యంగా ప్రమాణాలను ఆధారంగా చేసుకునే సిద్ధాంతాలను ప్రతిపాదించింది. ప్రమాణాలు అనేకం. అయితే అందులో ప్రత్యక్షం, అనుమానం, శబ్దం అనే మూడూ ముఖ్యం. ఈ మూడింటిని కాక కొన్ని ఇతర ప్రమాణాలను కూడా అద్వైతం ఆయా సందర్భాలలో అంగీకరించింది. 

శబ్ద ప్రమాణం అంటే వేద ప్రమాణం అన్నమాట, వేదం పరమాత్మ నిర్గుణుడు, నిరాకారుడు, త్రికాల అబాధితుడు జనన మరణాలకు అతీతంగా అన్ని కాలాలలోనూ ఉండేవాడు అని చెబుతుంది. అందుచేత బ్రహ్మం సత్యం. సత్యం అంటే నిజమైనది. మన కంటికి కనిపించే విశ్వం మాత్రం సృష్టి, స్థితి లయలకు లోనై అశాశ్వతంగా ఉండేది అని వేదం చెబుతుంది. అందుచేత విశ్వం అసత్యం. ఇలా శంకరులు వేద ప్రమాణానికి ప్రథమ స్థానం ఇచ్చారు. ప్రత్యక్ష ప్రమాణానికి రెండవ స్థానాన్ని ఇచ్చారు. దీనికారణంగా విశ్వం వ్యావహారిక సత్యమని, పరమాత్మ పారమార్ధిక సత్యమని అన్నారు.

అయితే రామానుజులు ప్రత్యక్ష, అనుమాన, శబ్దప్రమాణాలను ఒప్పుకున్నా, ప్రత్యక్ష ప్రమాణానికి పెద్దపీట వేశారు. ప్రత్యక్షంగా కనిపించేదాన్ని ఏదో శాస్త్ర వాక్యం ఆధారంగా దాన్ని మిథ్యగా నిరాకరించడం రామానుజులు ఒప్పుకోరు. ఆయన ప్రత్యక్షంగా కనిపించేదానికి విరుద్ధంగా శాస్త్రానికి అర్థం చెప్పకూడదంటారు. అయితే యజ్ఞం చేస్తే హవ్యాన్ని దేవతలకు అగ్నిదేవుడు అందిస్తాడు అని వేదం చెబుతుంది. పితృకార్యం చేసినప్పుడు పిండ ప్రదానం చేస్తే అది పితృదేవతలకు చేరుతుందని, దానికోసం వారు వేచి ఉంటారని వేదం చెబుతుంది. వాటిని ప్రత్యక్షంగా మనం చూడలేము. అందుచేత ఏది మనకు ప్రత్యక్షంగా కనిపించదో దాని విషయంలో మాత్రమే శాస్త్రం ప్రమాణం. అలా నమ్మనివాళ్ళు నాస్తికులు అని విశిష్టాద్వైత సిద్ధాంతం. అంటే ఇక్కడ ఎదురుగా కనబడుతున్నా, అందులో వాస్తవం ఏమిటో తెలుస్తున్నా దాన్ని కొట్టిపడేసేవాళ్ళు, దాన్ని సమర్థించని వాళ్ళు, వాస్తవాన్ని అంగీకరించకుండా కొన్ని మూర్ఖత్వపు నమ్మకాలలో ఉన్నవాళ్లు చాలామంది ఉంటారు. అలాంటి వాటిని రామానుజులు ఒప్పుకోరు. ఆయనకు ప్రత్యక్షంగా ఒక విషయంలో వాస్తవం తెలుస్తూ ఉంటే దానికి శాస్త్రాన్ని, వేదాన్ని ముడిపెట్టి మాట్లాడరు. 

మరి వేదశాస్త్రాలలో కొందరు దేవతలకు అనేక దివ్యమంగళ రూపాలు కూడా ఆపాదించి ఉపాసనలను ఉపదేశించబడ్డాయి. మరి ఈ రూపాలన్నీ మనకు ప్రత్యక్షంగా కనిపించడం లేదు గనుక ఆ ఉపాసనలన్నీ వ్యర్థం అంటే ఎలా? అందుచేత రామానుజులు ప్రత్యక్షంగా కనిపించేది నమ్మండి, మన జ్ఞానేంద్రియ వ్యవస్థకి అందని వాటిమీద శబ్ద ప్రమాణాన్ని అంగీకరించండి అని ఉపదేశించారు. దీని పర్యవసానమే ప్రపంచం సత్యం అనే సిద్ధాంతం. ఇక అనుమాన ప్రమాణం ఆయా సందర్భాలలో అంగీకార యోగ్యమే.

జ్ఞానేంద్రియ వ్యవస్థకు కనిపించేది వాస్తవంగా కళ్ళ ముందు జరిగేది. రామానుజులు ఇలాంటి వాటికి వేరే ఏ నమ్మకాలను, సిద్ధాంతాలను, వేదాలను ఆపాదించరు. ఎందుకంటే కళ్లెదుటే నిజమేంటో తెలుస్తోంది కాబట్టి. కళ్లెదురుగా ఎలాంటి సాక్ష్యమూ లేనప్పుడూ నిరూపించడానికి కూడా కారణం లేనప్పుడే వేదాలలో ఉన్నవాటిని పరిగణలోకి తీసుకోవాలి.

నిజానికి ఇది ఇప్పటి తరానికి ఎంతో ఉత్తమమైనది. ఇప్పటి తరానికి ప్రతి విషయానికి కారణం కావాలి, ఒక విషయం వెనుక ఉన్న నిజానిజాలు, అవి కూడా ఆమోదయోగ్యమైనవిగా మూడంగా లేకుండా ఉండాలి. ఇలాంటి రామానుజుల సమర్థింపులో అందరికీ దొరుకుతాయి. ఆ ప్రమాణాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి.

◆ వెంకటేష్ పువ్వాడ
 


More Enduku-Emiti