మనసును కదిలించే ఆళ్వారు కథ.. ధనుర్మాసంలో తప్పక తెలుసుకోండి..!

ధనుర్మాసంలో విష్ణుభగవానుడిని ఎన్నో విధాలుగా పూజిస్తారు. చేసుకున్నన్ని సేవలు ఉంటాయి ఆ స్వామికి ఈ మాసంలో. అయితే ఏ పూజ, ఏ ఉపచారం చేయకపోయినా కనీసం ఆళ్వారుల చరిత్రలు తెలుసుకోవడం, పారాయణ చేయడం, వినడం.. వీటిలో ఏదో ఒకటి చేసినా ఎంతో పుణ్యం కలుగుతుందని, భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని చెబుతారు పురాణ పండితులు. వైష్ణవ సంప్రదాయంలో ఉన్న 12మంది ఆళ్వారులలో తిరుమళిసై ఆళ్వార్ చాలా ముఖ్యమైనవారు. ఈయన ఆళ్వారులలో 4వ వారు. విష్ణుమూర్తి సుదర్శన చక్రం అంశతో ఈయన జన్మించారు. ఈయన కలియుగం ప్రారంభం కావడానికి కొన్ని సంవత్సరాల ముందు పుట్టారు. ఈయన జననం, ఈయన జీవితం, ఈయన చరిత్ర తెలిస్తే మనసు కరిగిపోతుంది, హృదయం ద్రవిస్తుంది. భగవంతుని అనుగ్రహంతో పుట్టి ఆయన పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు.. ఆయన చరిత్ర తెలుసుకుంటే..
తిరుమళిసై ఆళ్వారు జననం..
ద్వాపర యుగంలో భార్గవ మహర్షి ఉండేవారు. ఆయన విష్ణుమూర్తి దర్శనం కోసం తపస్సు చేస్తూ ఉండేవారు. ఆయన తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు కనకాంగి అనే అప్సరసను భార్గవ మహర్షి దగ్గరకు పంపిస్తాడు. కనకాంగి తన అందంతో భార్గవ మహర్షి తపస్సును భంగం చేస్తుంది. అంతేకాదు.. ఆయన్ను తన వశం చేసుకుంటుంది. భార్గవ మహర్షి కనకాంగి మాయలో పడిపోతాడు. కొన్నాళ్లు అలా గడిచాక కనకాంగి గర్భవతి అయ్యింది. ఆ విషయం తెలియగానే బార్గవ మహర్షి చాలా బాధపడతాడు. నేను విష్ణుమూర్తి దర్శనం కోసం ఎంతో తపస్సు చేసుకుంటున్నవాడిని, ఇప్పుడు ఇలా చేశాను అని చాలా బాధపడి కనకాంగి గర్భవతి అని తెలిసి కూడా ఆమెను వదిలి వెళ్లిపోతాడు. కనకాంగి ఎమో ఆప్సరస. ఆమెకు భవబందాల పట్ల ఎలాంటి అనురాగం, ఆప్యాయత వంటివి ఉండవు. దాంతో ఆమె తన కడుపులో పెరుగుతున్న బిడ్డను వదిలించుకోవాలని అనుకుంటుంది. అనుకోగానే ఆమె ఇంకా పూర్తీగా ఎదగని శుశువును కని, ఆ బిడ్డను వెదురు పొదల్లో పడేసి వెళ్లిపోతుంది.
కనకాంగి సరిగా ఎదగని శిశువును వెదురు పొదల్లో పడేసి వెళ్లిపోవడంతో ఆ వెదురు పొదల్లో ఉన్న పురుగులు, చీమలు లాంటివి ఆ పసికందును కుడుతూ ఉంటాయి. అవి అలా కుడుతూ ఉంటే పాపం ఆ పసికందు ఏడుస్తూ ఉంటాడు. అలా ఆ పసికందు ఏడుస్తూ ఉంటే ఇక మహావిష్ణువు, అమ్మవారు ఇద్దరూ కలిసి ఆ బిడ్డ దగ్గరకు వస్తారు. వాళ్లిద్దరూ ఆ బిడ్డను అలా ముట్టుకోగానే ఆ బిడ్డ శరీరంలో అవయవాలు అన్నీ సంపూర్ణంగా వచ్చేస్తాయి. అంతేకాదు ఆ బిడ్డ ఏడవడం కూడా మానేస్తాడు. అప్పుడు అమ్మవారు ఆ బిడ్డ చోట చెట్టుకు ఒక కొమ్మకు ఒక తేనె పట్టు ఉండేలా చేస్తుంది. ఆ తేనె పట్టుకు ఒక కన్నం చేస్తుంది. అందులో నుండి తేనె ఒక్కో చుక్క ఆ బిడ్డ నోట్లో సరిగ్గా పడేలా చేస్తుంది. దీంతో ఆ బిడ్డకు ఆకలి అనే బాధ కూడా లేకుండా పోతుంది. లక్ష్మీనారాయణులు తిరిగి వైకుంఠానికి వెళ్లిపోతారు.
ఆ పసిబిడ్డ లక్ష్మీనారాయణుల స్పర్శతో ఎంతో పరవశించి పోతూ ఉంటాడు. అప్పుడే అటువైపు వచ్చిన వెదురు పని చేసుకునేవారు ఆ బిడ్డను చూసి బిడ్డ ఎంత బాగున్నాడో అని సంతోషంతో ఆ బిడ్డను తీసుకెళ్తారు. ఆ బిడ్డను వారే పెంచుకుంటూ ఉంటారు. కానీ ఆ బిడ్డ పాలు తాగడ, ఏమీ తినడు, అస్సలు ఏడుపు కూడా ఉండదు. కానీ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాడు. ఆ వింత తెలిసి ఆ పిల్లాడిని చూడటానికి అందరూ వచ్చేవారు. ఒకసారి ఒక వృద్ద జంట అటువైపు గ్రామం గుండా వెళ్తూ ఆ పిల్లాడిని చూడటానికి అక్కడికి వెళ్తారు. వారు పెరుమాళుకు నైవేద్యంగా పెట్టిన పాలను ఆ పిల్లవాడికి ఇస్తారు. అలా ఇవ్వగానే ఆ బిడ్డ పాలను గటాగటా తాగేస్తాడు. దాంతో ఆ జంట అక్కడే ఆ పిల్లాడి దగ్గరే ఉండిపోయి రోజూ ఆ బిడ్డకు నైవేద్యం పెట్టిన పాలను ఇస్తుండేవారు. ఒకరోజు ఆ పిల్లాడు ఆ ముసలి జంటతో మీరిద్దరూ నాకు చేసిన సేవకు చాలా సంతోషించాను. మీకేం కావాలో చెప్పండి అని అడుగుతాడు. అలా అనగానే.. మాకు ఒక బిడ్డను కనాలని ఆశ.. ముసలివాళ్లం అయిపోయాం ఇప్పుడు మా కోరిక నెరవేరదు అని చెబుతారు.
కానీ తిరుమళిసై ఆళ్వార్ విష్ణుమూర్తి మీద ఒక పాశురం పాడగానే ఆ ముసలివారు యవ్వనవంతులు అయిపోతారు. అలా ఆ జంటకు కనికన్నన్ అనే కుమారుడు పుడతాడు. ఆ తరువాత వారిద్దరూ మళ్లీ ముసలివాళ్లై మరణిస్తారు. కనికన్నన్ ఎప్పుడూ తిరుమళిసై ఆళ్వార్ వెంట తిరుగుతూ ఉండేవారు. వారిద్దరు కలిసి భక్తిప్రచారం చేస్తూ కాంచీపురం చేరుకుంటారు. అక్కడ ఒక ముసలావిడ తిరుమళిసై ఆళ్వారుకు సేవలు చేస్తుండేది. ఒకసారి ఆమెతో తిరుమళిసై ఆళ్వారు.. అవ్వా నీ సేవకు మాకు ఆనందం కలిగింది. నీకేం కావాలో అడుగు అని అంటాడు.
అయ్యా.. నాకు తిరిగి యవ్వనంగా మారిపోవాలని కోరిక. ఈ జన్మలో నేను ఏ సంతోషం అనుభవించలేదు, పెళ్లి లేదు, తండ్రిలేడు, పిల్లలు లేరు.. అందుకే నాకు తిరిగి యవ్వనంగా మారి అవన్నీ అనుభవించాలని ఉంది అని అడుగుతాడు. అప్పుడు తిరుమళిసై ఆళ్వారు విష్ణుమూర్తిని కీర్తిస్తూ ఒక పాశురం పాడతాడు. అలా పాడగానే ఆమె యవ్వనవంతురాలిగా మారిపోతుంది. ఆమె అందాన్ని చూసిన పల్లవ రాజు ఆమెను మోహించి వివాహం చేసుకుంటాడు. వారిద్దరూ ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ కాలం గడుస్తూ ఉంటే పల్లవరాజు ముసలివాడు అవుతున్నా ఆమె మాత్రం యవ్వనవతిగానే ఉంటుంది. నీ యవ్వనం రహస్యం ఏంటని అతను ఆమెను అడుగుతాడు. ఆమె నిజం చెప్పేస్తుంది. అయితే నేను వెంటనే అతన్ని పిలిచి పాశురం పాడించుకుంటాను, నేను కూడా యవ్వనవంతుడిని అవుతాను అని చెబుతాడు. ఆయన గొప్ప మహానుభావుడు, అంతటి మహానుభావుడిని ఇక్కడికి పిలిపించుకోవం సరికాదు.. ఆయన శిష్యుడు ఉన్నాడు. గురువుకు తెలిసినవి అన్ని అతనికి కూడా తెలుసు. అందుకే శిష్యుడిని పిలిపించుకోండి అని చెబుతుంది ఆమె. దాంతో కనికన్నన్ ను పిలిపిస్తారు.
నువ్వు పాశురం పాడు.. నేను తిరిగి యవ్వనవంతుడిగా మారాలి అని ఆజ్ఞ జారీ చేస్తాడు. కానీ నేను కేవలం ఆ భగవంతుడి కోసమే పాడతాను అని కనికన్నన్ చెబుతాడు. వెంటనే పల్లవ రాజుకు కోపం వచ్చి నా కోసం పాడనప్పుడు నువ్వు ఈ రాజ్యంలో ఉండకు, వెళ్లిపో ఇక్కడి నుండి అని రాజ్య భహిష్కరణ చేస్తాడు. అతను వెళ్లి గురువుతో జరిగింది చెప్పి నేను వెళ్లిపోతున్నాను గురువుగారు అని అంటే.. నేను కూడా వస్తాను నాయనా పదా వెళ్లిపోదాం అని వారిద్దరూ కలిసి అక్కడినుండి వెళ్లే ముందు గుడిలో విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి స్వామి ఇక మేము వెళ్లిపోతున్నాం అని చెప్పి బయలుదేరతాడు. అప్పుడే విష్ణుమూర్తి పైకి లేచి.. మీరు వెళ్లిపోతుంటే నేను మాత్రం ఇక్కడెందుకయ్యా నేను మీతో వస్తాను అని తన ఆదిశేషుడిని చాపలాగా చుట్టి చంకలో పెట్టుకుని గురుశిష్యుల వెనకాల బయలుదేరాడు. వారు అలా వెళ్లగానే.. విష్ణుమూర్తి ఆలయంలో ఉన్న పరివార దేవతలు కూడా అక్కడి నుండి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లిపోయారట. దీంతో కాంచీపురం మొత్తం బోసిపోయి స్మశానంలా మారిపోయిందట.
ఇందంతా తెలిసిన పల్లవ రాజు తన తప్పు గ్రహించి తిరిగి గురు శిష్యులను ఆహ్వానించాడు. అలా వారు మళ్లీ తిరిగి రావడంతో విష్ణుమూర్తి కూడా ఆలయానికి తిరిగి వచ్చారట. ఇదంతా నిజంగా జరిగిన సంఘటల అని చెబుతారు. దీనికి నిదర్శనంగానే.. తన భక్తుడి కోసం తాను చేసిన పని చరిత్రలో గుర్తుండిపోవాలని విష్ణుమూర్తి తిరిగి వచ్చినప్పుడు వ్యతిరేక దిశలో పడుకున్నాడని చెబుతారు. నిజంగా తన భక్తులు తనను సేవిస్తే.. తనను ఆరాధిస్తే.. వాళ్లు పిలిచినప్పుడు నేను పలుకుతాను అనే విషయాన్ని చెప్పడానికే స్వామి వ్యతిరేక దిశలో పడుకున్నాడని చెబుతారు. ఇకపోతే సాక్షాత్తు ఆ సుదర్శన చక్రం అంశతో పుట్టినా చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డారు తిరుమళిసై ఆళ్వారు.. అంతేకాదు.. ఆయన భగవంతుని అనుగ్రహంతో పుట్టనా.. వెదురు బుట్టలు తయారుచేసే వారి ఇంట్లో పెరగడంతో ఆయన శూద్ర కులస్తుడు అని ఎంతో మంది ఎన్నో అవమానాలు చేశారు ఆయనకు. ఇలాంటివి ఆయన తన జీవితంలో ఎన్నో ఎదుర్కున్నారని పురాణ పండితులు చెబుతారు. ధనుర్మాసంలో ఈయన చరిత్ర తెలుసుకోవడమే ఎంతో పుణ్యం. సాక్షాత్తూ ఆ నారాయణుడి అనుగ్రహం పొందడానికి ఇదొక గొప్ప మార్గం. అందుకే భగవంతుడిని కోరికల కోసం కాకుండా భక్తితో ముక్తి కోసం ప్రార్థించాలి.
*రూపశ్రీ.


