ముగ్గురు ఆళ్వార్ల ముచ్చటైన సంఘటన.. ధనుర్మాసంలో ఖచ్చితంగా తెలుసుకోవాలి..!

వైష్ణవ సంప్రదాయంలో 12మంది ఆళ్వార్లు ఉన్నారు. వారిలో పోయిగై ఆళ్వారు మొదటివారు. విష్ణు భక్తిని కవిత్వంగా మార్చిన తొలి మహాభక్తుడు ఈయన. ఈయన క్రీ.శ 6వ శతాబ్దానికి చెందిన వారు. కాంచీపురం సమీపంలోని వరదరాజ స్వామి ఆలయానికి దగ్గరలో యదోక్తకారి ఆలయం అని ఉంది. ఆ ఆలయానికి దగ్గర ఈయన జన్మించారు. ఈయన జననం చాలా విచిత్రం. ఈయన పుష్కరిణిలో తామర పువ్వు మీద జన్మించారని పురాణ కథ చెబుతుంది. అందుకే ఈయనకు పోయిగై అనే పేరు వచ్చిందని చెబుతారు. పోయిగై అంటే చెరువు లేదా నీటిగుంట అని అర్థం. ఆ భగవంతుని కృప భూమిపై ఇలా పుష్పంలో ఆవిర్భవించిందని ఈయన గురించి చెబుతారు.
ముగ్గురు ఆళ్వార్ల ముచ్చట కథ..
పోయిగై ఆళ్వార్ జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం ఒకటుంది. దానినే త్రయ ఆళ్వార్ల మహా సంఘటన అని చెప్పుకుంటూ ఉంటారు. పోయిగై ఆళ్వార్ మాత్రమే కాకుండా రెండవ ఆళ్వార్ ఉన్నారు.ఆయన పేరు పూదత్తాళ్వారు. ఈయన మహావిష్ణువు ఆయుధం అయిన గద అయిన కౌమోదకి అంశతో జన్మించారు. ఈయన జాజిపువ్వుల పొదలో జన్మించారు. ఇక మూడవ ఆళ్వారు పేరు పేయాళ్వారు. ఈయన మహావిష్ణువు ఆయుధం ఖడ్గం నందక ఖడ్గం అంశతో జన్మించారు. ఈయన బావిలో దొరికారట. వీరు ముగ్గురూ మూడు వేరు వేరు ప్రదేశాలలో జన్మించారు. వీరి ముగ్గురికి సంబంధించి అద్బుతమైన కథ ఉంది.
ఒక రాత్రి తిరుకోవలూరు లో పోయిగై ఆళ్వార్ నడుస్తూ వెళ్తున్నాడట. అప్పుడు ఉన్నట్టుండి వర్షం మొదలైందట. వర్షంలో తడవకుండా ఉండటం కోసం దగ్గరలో ఉన్న చిన్న గుడిసె బయట ఉన్న అరుగు మీదకు వెళ్లి అక్కడ పడుకున్నాడట. ఇంతలోనే పూదత్త ఆళ్వారు వర్షంలో తడుస్తూ అక్కడికి వచ్చి పోయిగై ఆళ్వారుతో వర్షంలో తడుస్తున్నాను నాకు కాస్త ఆశ్రయం ఇస్తారా అని అడిగాడట. వెంటనే పోయిగై ఆళ్వారు.. ఇక్కడ ఒక్క మనిషి మాత్రమే పడుకోవడానికి కుదురుతుంది. కానీ కూర్చొంటే ఇద్దరు కూర్చోవచ్చు. కాబట్టి లోపలికి రండి అని పిలిచాడట. దీంతో వారిద్దరూ ఆ గుడిసె బయట కూర్చుని భగవంతుడిని స్మరించుకుంటూ ఉన్నారు. ఇంతలోనే పేయాళ్వారు కూడా అక్కడికి వర్షంలో తడుస్తూ వచ్చాడు. నాకు కాస్త ఆశ్రయం ఇవ్వగలరా అని అడిగాడు. తప్పకుండా రండి, ఇక్కడ కూర్చొంటే ఇద్దరు కూర్చోవచ్చు. కానీ నిలబడితే ముగ్గురు నిలబడుకోవచ్చు అని చెప్పారట. దీంతో ముగ్గురు ఆళ్వార్లు వర్షంలో నిలబడుకుని భగవంతుని స్మరించుకుంటు ఉండిపోయారట.
వారు ముగ్గురు అలా నిలబడుకుని ఉంటే.. అక్కడికి ఒక వ్యక్తి వచ్చి.. బయట బాగా వర్షం పడుతోంది, లోపలికి రావచ్చా అని అడిగాడట. దాంతో ఆ ముగ్గురు ఒక్క క్షణం ఆగండి అని చెప్పి ముగ్గురు ఒకేసారి బయటకు వచ్చారట బయట ఉన్న వ్యక్తిని లోపలికి పంపడానికి. వారు అలా రాగానే వారి ఎదురుగా ఎంతో తేజస్సుతో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యాడట. అలా అవ్వగానే వారు అదంతా ఆ మహావిష్ణువు లీల అని అర్థం చేసుకుని, విష్ణువు దర్శనం అయినందుకు ఎంతో పొంగిపోయారట. ముగ్గురు కలిసి స్వామిని 300పాశురాలతో స్తుతించారట. ఆ తరువాత వారు ముగ్గురూ స్వామిలోనే ఐక్యం అయిపోయారట. నిస్వార్థమైన గుణం ఉంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా తన అనుగ్రహాన్ని ఇస్తాడని వీరి కథ చెబుతుంది. ధనుర్మాసంలో వీరిని తలచుకోవడం ఎంతో పుణ్యప్రదం.
*రూపశ్రీ.


