బోలికొండ రంగనాథుడు (Bolikonda Ranganatha)

 

రాయలసీమలోని సుప్రసిద్ధ దేవాలయాలలో బోలికొండ రంగనాథ క్షేత్రం ఒకటి. శేషతల్పంపై శయన ముద్రలో, నయనమనోహరంగా దర్శనమిచ్చే దివ్యమంగళ స్వరూపుడు శ్రీరంగనాథస్వామి. ఏడుకొండల వేంకటరమణుని వలే, అత్యంత మహిమాన్వితమైన స్వామిని వేలాదిమంది భక్తులు దర్శించుకుని, భక్తిభావంతో తాదాత్మ్యం చెందుతుంటారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం నుంచి గుత్తి పట్టణానికి వెళ్ళే ప్రధాన రహదారిలో గుత్తి పట్టణానికి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ‘తొండపాడు’ గ్రామం ఉంది. ఆ గ్రామ ప్రధాన రహదారి ప్రక్కనే ఆలయం దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి ఎదురుగావున్న దారిగుండా సుమారు ఒక కిలోమీటరు దూరం కొండ ఎక్కి వెళ్తే కొండపైన “బోలికొండ రంగనాథస్వామి’’ ఆలయం వుంది.

మహర్షుల కోరిక మేర వెలసిన స్వామి

స్వామివారు కొలువై వున్న కొండకు “శ్వేతగిరి అని పేరు. తెల్లటిరాళ్ళు ఉన్నటువంటి కొండ కనుక దీనికి ‘శ్వేతగిరి’ అనే పేరు ఏర్పడిందని చెప్తారు. ఆ కొండకే ‘బోలికొండ’ అని పేరు. కొండపైన తెల్లటి పొడలు వచ్చినట్లుగా (బొల్లి) ఉండడం మూలంగా ఆ కొండకు “బోలికొండ’’ అనే పేరు ఏర్పడిందని కూడా ప్రచారంలో ఉంది. బోలికొండ మీద కొలువైవున్న రంగనాథస్వామి కనుక “బోలికొండ రంగనాథస్వామి’’ అనే పేరు ఈ స్వామికి వచ్చినట్లు కథనం. దీన్ని పల్లికొండ అని కూడా పిలుస్తారు.

శ్రీ మహావిష్ణువు ఒకసారి భూలోక విహారం చేస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నాడట. ఈ ప్రాంతంలోని అరణ్యంలో సంచరించి, ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తూ ఆ కొండపైన ఒకచోట విశ్రమించారు. అయితే ఈ ప్రాంతంలోని అడవులలో, అప్పటికే ఋషులు ఆశ్రమాలను ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. శ్రీ మహావిష్ణువు విశ్రమించిన విషయాన్ని గమనించిన మహర్షులందరూ స్వామిని సమీపించి నమస్కరించి భక్తితో స్వామి వారిని కొలిచారు. మహర్షుల భక్తిని, దీక్షను మెచ్చుకున్న శ్రీమావిష్ణువు ఏదైనా వరం కోరుకోమన్నాడు.

అందుకు – “స్వామి! అద్భుతమైన ఈ కొండపైన కొలువుదీరి, తమ ముందు ప్రశాంతంగా తపస్సు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. అంతేకాకుండా, ఈ భూలోకంలో ప్రజలు జనన మరణ సంసార చక్రంలో ఇరుక్కుని అనేక బాధలు పడుతున్నారు. వారికి దగ్గరగా ఈ కొండపై మీరు అవతరిస్తే మిమ్ములను దర్శించుకుని పూజలు చేసి ముక్తిని పొందుతారు. కాబట్టి ప్రజలకు దగ్గరగా ఈ కొండపై అవతరించాలన్నదే మా కోరిక’’ అని మహర్షులు శ్రీ మహావిష్ణువును కోరారు. మహర్షుల కోరికను అంగీకరించిన శ్రీ మహావిష్ణువు బాలికొండపైన శ్రీరంగనాథస్వామిగా కొలువు దీరినట్లు స్థలపురాణం వల్ల తెలుస్తుంది. ఈ స్వామిని భక్తులు బాలికొండ రంగస్వామి, రంగనాయకులు అని కూడా పిలుస్తూ ఉంటారు.

కొండపైన గల ఆలయంలో వెలసిన శ్రీరంగనాథస్వామి వారి రూపం స్పష్టంగా కనిపించదు. శ్రీరంగనాథుడు పుట్టుశిలగా వెలసినట్లు చెప్తారు. ఈ బోలికొండ రంగనాథస్వామిని పూర్వం మహర్షులు సేవించి తరించినట్లు కథనం.

మాణిక్య రంగనాథస్వామి

ఈ స్వామివారికి ప్రతిరూపాన్ని చేయించి గ్రామములో ఆలయాన్ని నిర్మింపజేసి, ప్రతిష్టించి నిత్య ఆరాధనలు చేస్తున్నారు. ఆలయం ప్రధాన గోపురం భక్తులను, యాత్రికులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ఎత్తైన ప్రధాన గోపురం దాటుకుని వెళ్తే, విశాలమైన ప్రాంగణంలో ఆలయం దర్శమిస్తుంది.

దక్షిణాభిముఖంగా వున్న ఈ ఆలయం ముఖమండపం, గర్భాలయాలను కలిగివుంది. ప్రధాన గర్భాలయంలో శ్రీరంగనాథస్వామి శేషతల్పంపై శయనించి, భక్తులపై తన చల్లని చూపులను ప్రసరింపజేస్తూ దర్శనమిస్తాడు. స్వామివారి చరణముల వద్ద శ్రీదేవి, భూదేవి కూర్చుని వుంటారు. స్వామివారి నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడిని, స్వామివారి ముందు వైపునగల ఉత్సవ విగ్రహాలను దర్శించుకొనవచ్చు. ఈ రంగనాథస్వామికి “మాణిక్య రంగనాథస్వామి’’ అని పేరు. పవిత్రమైన హృదయాలతో ఈ స్వామిని సేవిస్తే కోరికలన్నీ తీరుతాయని ఈ ప్రాంత భక్తుల నమ్మకం. ఈ ప్రాంతవాసులు తమ సంతానానికి ఈ స్వామివారి పేరును పెట్టడమే కాకుండా, ఏ శుభకార్యమైనా ఈ స్వామి సన్నిధిలో నిర్వహించుకుంటూ ఉండడం, శ్రీరంగనాథస్వామి వారు భక్తుల పట్ల చూపిస్తున్న కరుణా కటాక్షాల వల్లనే అని స్థానికులు గొప్పగా చెప్పుకుంటారు. భక్తితో ఈ స్వామిని సేవిస్తే పాపాలు నివారించబడి అనంతమైన పుణ్యాలు సిద్ధిస్తాయని, పునర్జన్మ నుండి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

చారిత్రకంగా పరిశీలిస్తే విజయనగర సామ్రాజ్యానికి ఈ ప్రాంతానికి విడదీయరాని సంబంధం ఉంది. ఈ ప్రాంతాన్ని “పెన్నబడిసీమ’’ అని విజయనగర కాలంలో పిలిచేవారట. ఇక్కడికి దగ్గరలో ఉన్న గుత్తికోట విజయనగర చక్రవర్తుల ఆధీనంలో ఉండేది. వీటన్నింటినీ బట్టి విజయనగర చక్రవర్తుల, విజయనగర పాలకుల ఉద్యోగులు, సామంతులుగా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పెమ్మసాని వంశం వారు, ఈ ఆలయాభివృద్ధికి విశేషంగా కృషి చేయడంతోపాటు ఈ స్వామిని సేవించి తరించినట్లు ఆధారాలవల్ల తెలుస్తోంది.

ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి?

‘తాడిపత్రి – గుత్తి’ ప్రధాన రహదారిలో వున్న తొండపాడు వద్ద బస్సులు ఆగుతాయి.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు అటు గుత్తిలో కానీ, ఇటు తాడిపత్రిలో గానీ దిగి “తొండపాడు’’కు చేరుకొనవచ్చు. చెన్నై – ముంబాయి రైలు మార్గంలోని “జక్కల చెరువు’’ రైల్వేస్టేషన్ తొండపాడుకు సమీపంలోని రైల్వేస్టేషన్. అయితే ఈ స్టేషన్ లో కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్ళు మాత్రమే ఆగుతాయి. కనుక గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్ లో దిగి బస్సు ద్వారా తొండపాడుకు చేరుకొనవచ్చు.

తొండపాడులో శయనముద్రలో వెలసిన శ్రీ పల్లికొండ రంగనాథస్వామివారిని దర్శించి భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు.


More Punya Kshetralu