వెయ్యి స్తంభాల గుడి

Thousand Pillar Temple

 

వరంగల్ జిల్లా, హనుమకొండలో ఉన్న వెయ్యి స్తంభాల గుడి మన రాష్ట్రంలోనే కాదు, మొత్తం దేశంలోనే ప్రసిద్ధి పొందింది. ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే మహా ఉద్వేగానికి లోనవుతాం. సోపానాల (మెట్లు) దగ్గరి నుండి గోడల వరకూ దేన్ని చూసినా ప్రాణం లేచివస్తుంది. కుడ్యాలమీద తీర్చిదిద్దిన శిల్పాలు దివ్యలోకంలో అడుగుపెట్టిన భావన కలిగిస్తాయి.ఇది చాలా పురాతనమైన గుడి. దీన్ని 12 వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రమదేవుడు నిర్మించాడు. కాకతీయులు, అనంతర రాజులు ఈ ఆలయానికి వచ్చి నమస్కరించుకుని సేద తీరేవారని చెప్పే కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

పేరులోనే స్పష్టమౌతున్నట్లు ఇది వేయి స్తంభాలతో నిర్మితమైన దేవాలయం. అయితే, వేయి స్తంభాలను గణించడం కష్టమైన పనే. కొన్ని విడిగా, ప్రత్యేకంగా కనిపించినప్పటికీ కొన్ని కలిసిపోయి ఉంటాయి. ఆలయ వేదిక వద్ద కొన్ని సుస్పష్టంగా కనిపిస్తాయి. ఈ గుడి వేయి స్తంభాలతో నిర్మితం కావడం మాత్రమే కాదు.. ఇక్కడ మరో విశిష్టత ఉంది. ఈ స్థంబాలపై నాణాలతో కానీ ఏదైనా లోహంతో కానీ తాకించినట్లయితే సప్తస్వరాలు, లయబద్ధమైన మధుర సంగీతం వినిపిస్తుంది.

వేయి స్తంభాల దేవాలయం మీటరు ఎత్తయిన అధిష్టానంపై ఉంది. త్రికూటాలయాలు పాతిక మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఎక్కడ చూసినా అందాలోలికే శిల్పాలు కొలువై ఉంటాయి. దక్షిణాన ఎత్తయిన ద్వారశాల, వేయి స్తంభాల మండపంలో ఎత్తయిన పీఠంమీద నందీశ్వరుడు కాకతీయుల శిల్ప కళకు ప్రతీకలుగా నిలిచాయి.

వేయి స్తంభాల గుడి త్రికూటాత్మకంగా ఉంటుంది. ఒక కూటంలో శివుడు, ఇంకో కూటంలో విష్ణుమూర్తి, మరో కూటంలో సూర్యభగవానుడు కొలువై ఉంటారు. ఎత్తయిన వేదికమీద మధ్యలో నృత్య గాన మందిరం ఉంది. పూర్వం ఈ నృత్య మందిరం గాయనీగాయకుల పాటలతో, నర్తకీమణుల నృత్యాలతో అలరారేదని చెప్పే ఆధారాలు ఉన్నాయి.

వేయి స్తంభాల దేవాలయ సముదాయాన్ని క్రీ.శ. 1163లో కాకతీయ రాజు ఒకటవ రుద్రదేవుడు నిర్మించాడని చెప్పే శాసనం ఉంది.

వేయి స్తంభాల గుడి, ప్రాచీన వైభవాన్ని, అద్భుత శిల్ప సౌందర్యాన్ని చాటుతూ ఈనాటికీ చారిత్రక దర్పాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ శిథిలావస్థకు చేరుకుంటోంది. ఈ త్రికూటాత్మక ఆలయంలో దురదృష్ట వశాత్తూ సూర్యభగవానుడి విగ్రహం ప్రస్తుతం లేదు. ఇలాంటి ప్రాచీన దేవాలయాలను, అపురూపమైన శిల్ప సంపదను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంమీద, మనమీద కూడా ఉంది.


More Punya Kshetralu