పుణ్యక్షేత్రాలు

పాల్వంచ , పెద్దమ్మ గుడి

(Peddamma Temple, Palwancha)

 

ఖమ్మం జిల్లాలో పాల్వంచ నుండి భద్రాచలానికి వెళ్ళే దారిలో ఉంది పెద్దమ్మ గుడి. ఖమ్మం జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో ఇదొకటి. పాల్వంచకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.

పూర్వం పాల్వంచ పరిసర ప్రాంతాల్లో దట్టమైన అడవులు ఉండేవి. జనసమ్మర్దం ఎక్కువై, అడవులను నరికేశారు. ఊళ్ళు వ్యాపించాయి. ఇప్పటికీ అటవీ ప్రాంత ప్రభావం కనిపిస్తుంటుంది.

పాల్వంచ పెద్దమ్మ గుడికి సంబంధించిన స్థల పురాణం గురించి చెప్పుకోవాలంటే-

పూర్వం ఇదంతా అరణ్యంగా ఉన్న రోజుల్లో ఒక పెద్ద పులి తిరుగుతుండేది. అది ఒక చింతచెట్టు నీడలో విశ్రమించేది. ఈ దారిలోంచి నడిచి వెళ్ళే బాటసారులు రోజూ పడుకున్న పులిని చూసుకుంటూ వెళ్ళేవారు. ఆ పులి ఎన్నడూ ఏ ఒక్కరికీ హాని చేయలేదు. దాంతో ఆ పులి క్రూర జంతువుగా గాక దైవ స్వరూపంగా కనిపించేది.

చింతచెట్టు కింది పులిని చూడగా చూడగా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు దానిమీద భక్తి భావన పెరిగింది. పులి అమ్మవారి వాహనం కనుక అమ్మవారే అక్కడ కోలువైనట్లు భావించారు. అమ్మ చల్లని చూపు తమపై పడిందని సంతోషించి, ఆ పరిసర గ్రామాల్లోని ప్రజలు అక్కడ అమ్మవారిని ప్రతిష్టించారు.

పెద్దమ్మ దేవాలయం నిర్మించడంతో అందరూ వచ్చి భక్తిగా ఆరాధించ సాగారు. ఎవరికీ తోచిన నైవేద్యం వారు సమర్పించేవారు. ముఖ్యంగా కాళీమాత రక్తాన్ని చూస్తే శాంతిస్తుందని, తమను అనుగ్రహిస్తుందని నమ్మి జంతుబలి ఇవ్వడం మొదలుపెట్టారు.

మొదట్లో పెద్దమ్మ గుడి చాలా చిన్నగా ఉండేది. క్షుద్ర దేవతగా పూజలు అందుకునేది. క్రమంగా ఆ చుట్టుపక్కల ఊళ్ళు విస్తరించాయి. సమీపంలో ఉన్నవారే కాకుండా ఎక్కడెక్కడి నుండో భక్తులు రావడం మొదలైంది. ఎనభయ్యో దశకంలో గుడి రూపురేఖలు మారాయి. ఆకృతికి తోడు అందం ఇనుమడించింది. పెద్దమ్మ గుడికి ప్రాచుర్యంతో బాటు ప్రాభవం పెరిగింది.

పెద్దమ్మకు భక్తిశ్రద్ధలతో నివేదనలు సమర్పిస్తారు. మొక్కుతారు, ముడుపులు చెల్లిస్తారు. గుడి మహా శక్తివంతమైంది. పెద్దమ్మ భక్తుల మొర ఆలకిస్తుందని, అనుకున్న పనులు సవ్యంగా నెరవేరుతాయని, అన్నింటా విజయం సమకూరుతుందని, పిల్లలు లేనివారికి పిల్లలు పుడతారని స్థానికులు చెప్తారు.

పెద్దమ్మ గుడి ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఆదివారంనాడు వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతుంది.


More Punya Kshetralu