తాంత్రికుల‌కు ఇష్టమైన గ‌ణ‌ప‌తి

     గ‌ణ‌ప‌తులు ఎంద‌రంటే కొంద‌రు ఎనిమిదిమంద‌నీ, మ‌రికొంద‌రు తొమ్మిదిమంద‌నీ ఇంకొంద‌ర‌రు 16మంద‌నీ చెబుతారు. సంప్రదాయ‌బ‌ద్ధంగా వ‌స్తున్న వివ‌రాల ప్రకారం మొత్తంగా 32మంది గ‌ణ‌ప‌తులు ఉన్నారు. వారిలో 16 పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటాయి. ఈ 16మంది గ‌ణ‌ప‌తుల‌లో 11వ‌దైన `హేరంబ గ‌ణ‌ప‌తి`కి ఒక ప్రత్యేక‌త ఉంది. ఆ విశేషాలు...

    ఐదు త‌ల‌ల‌తోనూ, ప‌ది చేతుల‌తోనూ ఉండే ఈ హేరంబ గ‌ణ‌ప‌తిని నేపాల్ దేశంలో విస్తృతంగా పూజిస్తారు. `హేరంబం` అన్న పేరుకి దీన‌జ‌న‌ర‌క్షకుడు అన్న అర్థం ఉంది. త‌న త‌ల్లి పార్వతీదేవికి వాహ‌న‌మైన సింహమే ఈ హేరంబ గ‌ణ‌ప‌తికి కూడా వాహ‌నం. ఎప్పుడూ ఉండే ఎలుక బ‌దులు సింహాన్ని వాహ‌నంగా గ్రహించ‌డమంటే భ‌క్తుల స్థితికి అనుగుణంగా వీర‌త్వాన్నీ, రాజ‌స‌త్వాన్నీ ప్రద‌ర్శించ‌డ‌మే! ఇక భ‌క్తుల కోసం ఎంత‌టి యుద్ధానికైనా సిద్ధమ‌న్నట్లుగా చేతుల‌లో పాశం, దంతం, గొడ్డలి, అంకుశం, క‌త్తి, ముద్గరం అనే ఆయుధాల‌ని ధ‌రించి ఉంటాడు. హేరంబ గ‌ణ‌ప‌తి ఇంత‌టి ఉగ్రరూపంలో ఉంటాడు కాబ‌ట్టే కొంద‌రు తాంత్రికులు `హేరంబ గ‌ణ‌ప‌తి`నే ఆరాధిస్తారు.

`అభయ వరదహస్త పాశదంతాక్షమాల
సృణి పరశు రధానో ముద్గరం మోదకాపీ
ఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రం
గణపతి రతిగౌరః పాతు హేరంబ నామా`

అంటూ స్తుతించే ప్రార్థన‌తో హేరంబ గ‌ణ‌ప‌తిని కొలుస్తారు. ముఖ్యంగా ప్రయాణ స‌మ‌యాల‌లో ఎటువంటి ఆప‌దా క‌లుగ‌కుండా ఉండేందుకు ఈ గ‌ణ‌ప‌తిని త‌లుచుకుంటారు. ఇంత ప్రత్యేక‌మైన హేరంబ గ‌ణ‌ప‌తి కాశీవంటి కొద్దిపాటి క్షేత్రాల‌లో మాత్రమే కొలువై ఉన్నాడు.

- నిర్జర‌.


More Vinayakudu