కార్తీక మాసంలో ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి!


కార్తీక మాసం అనేది దేవతారాధన, పుణ్యసాధన, దీపదానం, జపతపాలు, దానధర్మాలు చేసే అత్యంత పవిత్రమైన కాలం.ఈ నెలలో చేసిన ప్రతి దానం సాధారణ దానంకన్నా వెయ్యి రెట్లు ఫలితాన్నిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి.  వివిధ దానాలు  వాటి ఫలితాలు తెలుసుకోవడమే కాకుండా ఏ సమస్యలకు ఏ దానం పరిహారంగా పరిగణించబడుతుందో తెలుసుకుంటే..

కార్తీక మాసంలో చేయవలసిన ముఖ్య దానాలు మరియు వాటి ఫలితాలు
దీపదానం..
సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో దేవాలయం ముందు, తులసి చెట్టు దగ్గర లేదా నదీ తీరంలో నెయ్యి లేదా నువ్వుల నూనె దీపం వెలిగించి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. 
ఫలితం: అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానప్రకాశం వస్తుంది. పాపాలు కరిగిపోతాయి. కుటుంబంలో శాంతి, దీర్ఘాయుష్షు వస్తుంది.

పరిహారం: గృహక్లేశం, అశాంతి, డబ్బు నిలవకపోవడం, నిరుద్యోగం వంటి సమస్యలకు దీపదానం చాలా శ్రేష్ఠం.

నువ్వుల దానం.. 
నల్ల నువ్వులు  పూజ తరువాత బ్రాహ్మణులకు లేదా అవసరమైన వారికి ఇవ్వాలి.

ఫలితం: శనిదోష నివారణ, పితృదోష శాంతి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.

పరిహారం: శనిగ్రహ కష్టాలు, పితృ కర్మ సమస్యలు, రక్త సంబంధిత వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా నువ్వుల దానం చేయాలి.

అన్నదానం..
భక్తులకు, పేదవారికి, ఆశ్రమాల్లో లేదా దేవాలయాల్లో భోజనం పెట్టాలి.
ఫలితం: అన్నదానం అన్నింటికంటే మేటి. ఇది మన పాపాలను తొలగించి పుణ్యాన్ని పెంచుతుంది. పితృదేవతలు సంతోషిస్తారు.

పరిహారం: కుటుంబంలో నిరంతర అనారోగ్యం, పిల్లలు సుఖంగా లేకపోవడం, ధన నష్టం వంటి సమస్యలకు అన్నదానం ఉత్తమ పరిహారం.

వస్త్ర దానం..
 కొత్త లేదా శుభ్రమైన బట్టలను పేదవారికి, భక్తులకు, వృద్ధులకు ఇవ్వాలి.
ఫలితం: శుభఫలితాలు, కీర్తి, ఆత్మశాంతి వస్తాయి.

పరిహారం: గృహ కష్టాలు, ప్రతిష్ట నష్టం, ఆత్మ నిస్పృహ లాంటి భావాల నివారణకు ఇది ఉపయోగపడుతుంది.

నీటి దానం..
కార్తీక మాసంలో యాత్రికులకు, పేదవారికి నీటి కుండలు పెట్టడం లేదా నదీ తీరంలో జలదానం చేయడం.
ఫలితం: శరీర, మనసుకు చల్లదనం. పాప విముక్తి.

పరిహారం: కోపం, అశాంతి, మానసిక అస్థిరత తగ్గుతుంది.

తులసి దానం..
తులసి చెట్టును నాటడం, పూజించడం, దీపం వెలిగించడం.తులసి మొక్కలను దానం చేయడం. 
ఫలితం: వాయు, కఫ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం వస్తుంది.

పరిహారం: దాంపత్య సమస్యలు, గృహ శాంతి లేమి, మానసిక బాధ తగ్గుతుంది.

ప్రత్యేక సమస్యలకు అనుకూలమైన దానాలు..
శని / పితృదోషం..  

నువ్వుల దానం. నల్ల దుస్తులు, ఇనుము దానం చేయాలి. ఇలా చేస్తే దోష నివారణ, శాంతి కలుగుతాయి. 

వివాహంలో ఆటంకం..

దీప దానం, తులసి ఆరాధన, పసుపు దానం చేయాలి. వివాహ యోగం మెరుగవుతుంది. 

ఆరోగ్య సమస్యలు..

నీటి దానం, పండ్ల దానం, నెయ్యి దీపం దానం చేయాలి. శరీర శుద్ది కలిగి దీర్ఘాయుష్షు చేకూరుతుంది. 

కుటుంబ అశాంతి..

దీపదానం, తులసి పూజ. గృహ శాంతి, పరస్పర అవగాహన కలుగుతాయి. 

డబ్బు నిలవకపోవడం..

అన్నదానం, తామరపువ్వులు దానం చేయాలి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. 

పిల్లల సమస్యలు..

పాలు, బట్టలు దానం చేయాలి. పిల్లల రక్షణ, ఆరోగ్యం మెరుగవుతాయి. 

మానసిక బాధ / నిరాశ..

నీటిదానం, దీప దానం చేయాలి. మనశ్శాంతి, అంతరశుద్ధి జరుగుతాయి. 

శ్రేష్ఠమైన దానం విధానం..
దానం చేసే ముందు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. “దానం పుణ్యార్థం, దేవత ప్రీత్యర్థం” అనే సంకల్పంతో ఇవ్వాలి. దానం చేసిన తరువాత కృతజ్ఞతతో ప్రణామం చేయాలి. కార్తీక మాసంలో ప్రతి రోజూ చిన్నదైనా దానం చేయడం,  పాప విమోచన, శాంతి, ఆరోగ్యం, లక్ష్మీ కటాక్షం కలిగిస్తుంది.

                      *రూపశ్రీ.


More Karthikamasa Vaibhavam