నవంబర్ 15 కార్తీక మాస ఏకాదశి.. దీని ప్రాముఖ్యత తెలుసా!

ప్రతి మాసంలో రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్ష ఏకాదశి, రెండవది కృష్ట పక్ష ఏకాదశి. ఏకాదశి తిథి విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. ఏకాదశి రోజున విష్ణువును పూజించడం వలన తెలిసి లేదా తెలియకుండా చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది. అయితే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా ముఖ్యమైనదని, చాలా ప్రాముఖ్యత కలిగి ఉందని అంటున్నారు పురాణ పండితులు. వాస్తవానికి కార్తీక ఏకాదశినే ప్రముఖమైన ఏకాదశిగా జరుపుకోవాల్సిందని, కానీ చాలామంది తొలి ఏకాదశి పేరిట వేరే మాసంలో జరుపుకుంటారని పేర్కొన్నారు. ఇకపోతే ఈ కార్తీక మాసంలో ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశి అని అంటారు. అసలు ఉత్పత్తి ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి? దీని వెనుక ఉన్న కథనం ఏంటి? తెలుసుకుంటే..
నవంబర్ నెల 15వ తేదీన కార్తీక మాసంలో ఉత్పత్తి ఏకాదశి తిథి వచ్చింది. ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది. అన్ని ఏకాదశి తిథులలోకి ఎంతో ముఖ్యమైనది. కార్తీక మాస ఏకాదశి నాడు మహావిష్ణువు శరీరం నుండి ఏకాదశి అనే దేవత జన్మించిందట. అందుకే ఈ రోజును అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.
పురాణ కథనం..
మహావిష్ణువు అలసిపోయి శేషతల్పం పై అలా పడుకుని ఉన్నప్పుడు ఒక రాక్షసుడు ఆయన మీదకు దండెత్తి వచ్చాడట. ఆ సమయంలో మహావిష్ణువు శరీరం నుండి ఏకాదశి అనే ఒక దేవతా స్వరూపం బయటకు వచ్చి ఆ రాక్షసుడిని సంహరించిందట. అందుకే కార్తీక ఏకాదశినే ప్రముఖమైన ఏకాదశి తిథిగా జరుపుకోవాల్సిందని పండితుల మాట. ఏకాదశి జన్మించిన ఈ తిథి రోజు ఉపవాసం ఉండటం, విష్ణువు ఆరాధన, తులసితో పూజ మొదలైనవి చేయడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఉత్పత్తి ఏకాదశి రోజు మహా విష్ణువుకు ఎంతో ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం కూడా విష్ణువు అనుగ్రహాన్ని ఇస్తుంది.
రాశి ప్రకారం విష్ణువుకు నైవేద్యం..
మేష రాశిలో జన్మించిన వారు విష్ణువుకు ఎర్రటి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలట. ఇది చాలా శుభప్రదంగా భావిస్తారు.
వృషభ రాశి వారు తెల్లటి తీపి పదార్థాన్ని సమర్పించాలి. ఇది శాంతిని, ఆనందాన్ని ఇస్తుందట.
మిథున రాశి వారు పెసరపప్పు పాయసం నైవేద్యం పెడితే గ్రహ దోషాలు తగ్గుతాయట.
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు కొబ్బెరతో చేసిన తీపి పదార్థాలు నైవేద్యం పెడితే మంచిదట.
సింహరాశి వారు విష్ణువుకు పసుపు రంగు వస్తువులను సమర్పించి తరువాత వాటిని ఇతరులకు దానం చేయాలట. అలాగే అరటిపండ్లను సమర్పించాలట.
కన్య రాశి వారు విష్ణువుకు వివిధ రకాల తీపి పదార్థాలను సమర్పిస్తే శుభాన్ని తెస్తుందట.
తులారాశి వారు పంచామృతాలను సమర్పిస్తే విష్ణువు త్వరగా సంతృప్తి చెందుతాడట.
వృశ్చిక రాశి వారు బెల్లం నైవేద్యం పెడితే వ్యాపారంలో లాభాన్ని, సంబంధాలలో సంతోషాన్ని తెస్తుందట.
ధనుస్సు రాశి వారు శనగపిండి లడ్డులను నైవేద్యంగా పెట్టాలట.
మకర రాశి వారు నువ్వులను నైవేద్యంగా సమర్పించాలట. దీనివల్ల వివాహ అడ్డంకులు తొలగిపోతాయట.
కుంభ రాశి వారు ఎరుపు రంగు నైవేద్యం పెట్టవచ్చట.
మీన రాశి వారు పాయసం నైవేద్యంగా పెట్టాలట.
పైన పేర్కొన్న నైవేద్యాలను సమర్పించి, విష్ణువును ఆరాధిస్తే.. విష్ణువు అనుగ్రహం లభిస్తుందని అంటారు.
*రూపశ్రీ.



