కార్తీకమాసంలో ఆకాశ దీపం ప్రాముఖ్యత తెలుసా...

కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం.  ఈ మాసంలో దేవాలయాలలోనూ, ఇళ్ళలోనూ దీపాలు వెలిగించడం అందరూ చేస్తారు.  అయితే కార్తీక మాసంలో ఆకాశ దీపం గురించి చాలామందికి తెలియదు.  ప్రతి శివాలయంలోనూ ధ్వజ స్తంభం పైన వెలిగించే దీపాన్ని ఆకాశ దీపం అని అంటారు.  ఈ ఆకాశ దీపం కార్తీక మాసం ప్రారంభం నుండి ప్రతి శివాలయంలోనూ కనిపిస్తుంది.  అయితే ఈ దీపం ప్రాముఖ్యత ఏంటి? దీన్ని ఎవరు వెలిగిస్తారు? ఈ దీపాన్ని నమస్కరించుకున్నా,  చూసినా కలిగే ఫలితాలు ఏంటి?  తెలుసుకుంటే..

కార్తీక మాసంలో ప్రతి శివాలయంలోనూ ధ్వజస్తంభం మీద వెలిగించే దీపాన్ని ఆకాశ దీపం అంటారు.  సాధారణంగా పితృపక్షాలు ముగిసిన తర్వాత కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. పితృపక్షాలలో పితృ దేవతలను పూజించడం,  వారికి పిండ ప్రధానం,  తర్పణాలు వదలడం వంటివి చేసి వారిని తృప్తి పరిచి పితృలోకాలకు సాగనంపుతారు. అయితే కార్తీక మాసంలో వెలిగించే ఆకాశ దీపం ఈ పితృదేవతలకు మార్గం చూపుతుందని పురాణాలు,  శాస్త్రాలు చెబుతున్నాయి.

శివాలయంలో ధ్వజ స్తంభం మీద ఆకాశ దీపం వెలిగిస్తారు.  దీన్ని ఒక తాడు సహాయంతో కొన్ని చోట్ల వెలిగిస్తే.. మరికొన్ని శివాలయాల్లో ఏకంగా ధ్వజ స్తంభాన్ని ఎక్కి మరీ ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు.

ఎవరైనా సరే.. ఈ కార్తీక మాసంలో శివాలయానికి  వెళ్లినప్పుడు అక్కడ ధ్వజ స్తంభం మీద వెలిగించిన ఆకాశ దీపాన్ని చూసినా,  దానికి నమస్కరించినా వారి పితృ దేవతలకు మార్గం సుగమం అవుతుందని నమ్మకం.  ఈ విషయాన్ని కార్తీక పురాణం కూడా చెబుతోంది. అంతేకాదు.. ఈ ఆకాశదీపాన్ని చూసినా,  తలచుకున్నా ఎంతో మంచిదట. మనిషిలో ఉండే నెగెటివ్ ఎనర్దీ కూడా తొలగిపోతుందని చెబుతారు.

ఇంటి వద్ద ఆకాశ దీపం..
కొందరు ఆకాశదీపాన్ని ఇంటి వద్ద కూడా వెలిగిస్తారు.  ఇంటి వద్ద ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి దీపాన్ని వేలాడదీస్తుంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో శివాలయ దర్శనం చేసుకోలేని వారు, పట్టణ ప్రాంతాలలో వారికి ఈ పద్దతి వెసులుబాటుగా ఉంటుంది. ఇలా ఇంటి వద్ద ఆకాశ దీపం వెలిగించడం గత కొన్నేళ్ళ నుండి అందుబాటులోకి వచ్చిన సంప్రదాయం. కానీ  శివాలయంలో వెలిగించే ఆకాశ దీపం శాస్త్రీయమైనది,  సంప్రదాయమైనది అంటున్నారు పురాణ పండితులు.

                           *రూపశ్రీ.


More Karthikamasa Vaibhavam