బ్రహ్మ చర్య దీక్ష

 


            ఉపనయన సంస్కారం మానవుని ద్విజన్ముని గా చేస్తుంది. దానికి కారణం బుద్ధిని ప్రచోదన చేసి, మనిషిని మనీషిగా చేసే గాయత్రీ మంత్రోపదేశం. సప్త వ్యాహృతులతో గాయత్రీ మంత్రాన్ని ఉపాసన చేస్తే మేథాసంపత్తి వృద్ధి అవుతుంది. (ఉపనయన సంస్కారంలో గురువు మేథో జననం చేయటం గమనార్హం.)  విద్యార్జనకు మేథా సంపత్తి అవసరం. జ్ఞానం అన్నింటికన్న గొప్ప శక్తి. శక్తి ప్రసారం జరిగినప్పుడు శరీరం తట్టుకో గలగాలి. దానికోసం ఉపనయనం అయిన బాలునికి ఎన్నో నియమాలు విధించ బడినాయి. వాటి వల్ల శరీరం, మనస్సు బలోపేతం అవుతాయి. ఈ నియమ స్వీకారాన్ని బ్రహ్మ చర్య దీక్ష అని, వటువుని బ్రహ్మచారి అని  అంటారు. బ్రహ్మము అంటే జ్ఞానము. బ్రహ్మ చారి అంటే బ్రహ్మమునందు అంటే జ్ఞానమునందు చరించువాడు అని అర్థం. మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే చదువుకొనే వాడు. ప్రాచీన కాలంలో అన్ని విద్యలను, శాస్త్రాలను వేదమనే అనే వారు. వేదమనే పదానికి తెలుసుకోదగినది, తెలుసుకోవలసినది అని అర్థం. మానవుడు నేర్వ దగిన ప్రతిదీ వేదమే.  సుమారుగా విద్యాభ్యాసం పూర్తి కావటానికి పన్నెండు సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు కూడా దరిదాపుల్లో అంతే గదా.


               గురుకుల వాసంలో గురువు చదువు మాత్రమే కాదు బుద్ధి కూడా గరపే వారు. అందుకే ఆనాడు విద్యావంతులందరు బుద్ధిమంతులు కూడా.  విద్యని  గురువు నోటితో చెప్పేవాడు. ప్రవర్తన గురువుని చూసి శిష్యులు నేర్చుకొనే వారు.  నిరంతరం గురువుగారి సమీపంలోనే ఉంటూ ఎప్పుడేం చెపుతారా? అని శ్రద్ధగా వినటానికి సిద్ధంగా ఉండేవారు. దానిని శుశ్రూష అనే వారు. తరువాతి కాలంలో శుశ్రూష అంటే గురువు గారికి సేవ చెయ్యటం అనే అర్థం వచ్చింది. ఎప్పుడూ గురువుగారి సాన్నిధ్యంలో ఉన్నారు కనుక ఏదైనా సేవ చేసే వారు. తమ ఇంటిలో అమ్మ నాన్నలకి మాత్రం అంత చెయ్యరా?   

 


               బ్రహ్మచర్యం మానవుడి జీవితంలోని నాలుగాశ్రమాలలో మొదటిది. “బ్రహ్మణి చరతీతి బ్రాహ్మచారీ, తస్య భావః బ్రహ్మచర్యం ” అని వ్యుత్పత్త్యర్థం. బ్రహ్మమునందు చరించే వాడు బ్రహ్మచారి. అతడి ధర్మం బ్రహ్మచర్యం. బ్రహ్మ మంటే వేదము, జ్ఞానము. బ్రహ్మము నందు చరించట మంటే నిరంతరం జ్ఞాన సముపార్జనలోనే, వేదాధ్యయనంలోనే  సమయాన్ని గడపటం. దానికి ఇంద్రియ నిగ్రహం అవసరం. మనసు ఇతర వ్యామోహాల వైపుకి మళ్ళ కూడదు కదా. బ్రహ్మ స్వరూపమైన వేదాధ్యయనం వల్ల బ్రహ్మచారి మనస్సు పవిత్రమై, విశుద్ధమై ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. అది బ్రహ్మచర్యానికి ప్రాణ శక్తి నిస్తుంది. దీనివల్ల భౌతిక వికారాలకు లోనూ కాకుండా ఉండ గలుగుతాడు బ్రహ్మచారి. అప్పటి వరకు బాల్య చాపల్యంతో మనస్సు చంచలంగా ఉంటుంది. ఇక బాహ్యమైన ఆకర్షణలకు లోబడే వయసు రాబోతోంది. ఈ సమయం లో దానిని అదుపులో ఉంచక పోతే తరువాత అది చెప్పిన మాట వినదు. 

 

ఇప్పుడు విద్యాభ్యాసం సాగదు. కనుక ఆ మనస్సు కుదురుగా ఉంటేనే గురువు చేసిన బోధ వంట పడుతుంది. కనుకనే బ్రహ్మచారికి తదనుగుణమైన నియమాలను ఏర్పరచటం జరిగింది. ఆ నియమాలను పాటిస్తాడు కనుక కొన్ని విషయాలలో మినహాయింపులు కూడా ఇవ్వ బడినాయి. తినే ఆహారంలో కొంత భాగం మనసుగా తయారవుతుంది కనుక సత్త్వ గుణాన్ని పెంపోందించే ఆహారమే బ్రహ్మచారి తీసుకోవలసి ఉంటుంది.  ఉప్పు, కారము, ఘాటు లేని ఆహారం నిర్దేశించ బడింది.  బ్రహ్మచర్య దీక్షలో ఉన్నప్పుడే యవ్వనం అంకురించటం మొదలవుతుంది. యవ్వనంలో కలిగే ప్రలోభాలకు లొంగకుండా ఉండాలంటే మనోనిగ్రహం కావాలి. దానికి రజోగుణ, తమోగుణాలని ప్రకోపింప చేయని సాత్త్వికాహారం తప్పనిసరి.  రజోగుణాన్ని ఉద్దీపింప చేసే తాంబూల సేవనం చేయ కూడదు.

 


             వేదాధ్యయనం చేసే బాలునికి చాలా శక్తి కావలసి ఉంటుంది, అది ఎదిగే వయసు కనుక ఉపవాసాదులు చేయ నక్కర లేదని చెప్ప బడింది.   


              ఉపనయన సమయంలో పంచ శిఖలనుంచి శిరో ముండనం చేయించిన తరువాత స్నాతక సమయం వరకు జుట్టు కత్తిరించటం ఉండదు. అలంకరించుకోవటం ఉండదు. దృష్టి విజ్ఞాన సముపార్జన మీద మాత్రమే కేంద్రీక రించాలి.  అద్దంలో చూసుకోవటం నిషేధం. తనలో కలుగుతున్న శారీరకమైన మార్పులను అద్దంలో చూసుకుంటే దృష్టి దానిమీదే నిలబడుతుంది. అద్దం కనబడితే ఎంత పని వత్తిడిలో ఉన్నా కాసేపు ఆగి తన ప్రతిబింబాన్ని చూసి మరీ కదలటం మానవ సహజం. అది లక్ష్యాన్నుండి మనిషిని దూరం చేస్తుంది.


              నిత్యాగ్నిహోత్ర విధి నేర్పిన గురువుకి అభివాదం చేస్తూ “ఇష్టము వచ్చినట్లు తిరుగుట, మాటాడుట, తినుట ఇక నుండి చేయను. పగలెప్పుడు నిద్ర పోను. భిక్షాటనము చేసి భుజిస్తాను. గురువుకి ఆధీనుడుగా ఉంటాను.” అని వాగ్దానం చేస్తాడు.

 


            ఆశీర్వచన సమయంలో ఈ నియమా లనన్నింటిని తన శిష్యుడు అవలంబించ బోతున్నాడని గురువు ప్రకటిస్తాడు. ఆ మంత్రానికి అర్థం ఇలా ఉంటుంది. “ ఈ వటువు ఉపనయనమైన కాలమునుండి శుభమైన పద్ధతిలో శుచిగా ఆచమనము, స్నానము, బొట్టు పెట్టుకొనుట, సంధ్యా వందనము, గాయత్రీ జపము, అగ్ని హోత్రము ఆచరించుచు, తల్లి తండ్రులను సోదరులను, మేనమామలను, గురువులను, బ్రాహ్మణులను పూజించుచు, నిష్ఠ గలవాడై, నడుమునకు మేఖల, చేతి యందు దండము ధరించి, భిక్షాటనము నియమముగ జీవించుచు నిరంతరము మనుస్మృతి మొదలగు ధర్మ శాస్త్రముల యందు చెప్పబడిన సమస్త బ్రహ్మచర్య ధర్మములను అనుష్ఠిమ్చి గొప్పవాడగుగాక యని పెద్దలైన తమరు అనుగ్రహింతురు గాక!”  ఇది బ్రహ్మచారి పాటించ వలసిన విధులను తెలియ చేస్తుంది.


                సామాన్యంగా లోకంలో బ్రహ్మచారి అంటే అవివాహితుడు అనే అనుకుంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో చదువు పూర్తి అయినాక మాత్రమే వివాహం చేసుకునే వారు. గురువు విద్యాబోధన పూర్తి అయిన తరువాత స్నాతకోత్సవమ్ జరిపి వివాహానికి అర్హుడని చెప్పాలి.  


              బ్రహ్మ చారి అని తెలియ చేయటానికి ప్రత్యేక మైన వేష ధారణ కూడా చెప్పబడింది. చూడగానే ఇతడు విద్యార్థి అని తెలియ చేయటానికి ఈ నాడు ఉన్న ‘యూనిఫారం’ వలె. గూడ కట్టు, చేతిలో దండం, నడుముకి పటకా, ఎడమ భుజం మీద నుండి కుడి చేతి క్రిందకు ముడి పెట్ట బడిన ఉత్తరీయం ముఖ్య మైన లక్షణాలు. ఈ ఉత్తరీయాన్ని యజ్ఞోపవీతం అంటారు. ఇది యజ్ఞార్థ కర్మకు ఉపయోగ పడే దీక్షా చిహ్నం. యజ్ఞార్థ కర్మ అంటే తన కొరకు కాక లోక హితం కోసం చేసే పని అని అర్థం. అంటే, విద్యాభ్యాస సమయంలోనే సమాజ సేవను కూడా అలవాటు చేసే వారు.


            ఈ రోజుల్లో ఉపనయన సమయంలో మాత్రమే మౌంజీ ధారణం, అజిన ధారణం, పాలాశ దండ ధారణం కనపడుతున్నాయి.

 

 

 

Dr Anantha Lakshmi

 


More Enduku-Emiti