ఈ వృక్షాలను పూజిస్తే పేదరికం,  దుఃఖం తొలగిపోతాయి..!


ప్రకృతిని దైవంగా భావించే దేశం మనది.  మరీ ముఖ్యంగా హిందూ సనాతన ధర్మంలో చెట్టు, పుట్ట, నీరు, నింగి, నేల.. ఇలా అన్నింటిలో దైవాన్ని చూడాలని చెబుతుంది.  ప్రకృతిలో మొక్కలు ప్రధాన భాగం.  హిందూ మతంలో కొన్ని వృక్షాలను చాలా పవిత్రంగా భావిస్తారు.  ఆ మొక్కలలో దేవతలు నివాసం ఉంటారని చెబుతారు.  ఆ మొక్కలు లేదా వృక్షాలను పూజించడం వల్ల పేదరికం తొలగిపోతుందని,  దుఃఖాలు మాయమవుతాయని కూడా చెబుతారు. ఈ దైవిక వృక్షాలను పూజించడం వల్ల గ్రహ దోషాలు శాంతింపజేస్తాయట,  జీవితంలో  కష్టాలను కూడా తగ్గిస్తాయట. అదృష్టం అనుకూలంగా మారుతుందని నమ్ముతారు. ఈ మొక్కలు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా చేకూర్చుతాయట.  ఆ వృక్షాలు లేదా మొక్కలు ఏవో తెలుసుకుంటే..

తులసి..

తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. తులసిని ప్రతిరోజూ పూజించే ఇంట్లో పేదరికం ప్రవేశించదని గరుడ పురాణం చెబుతోంది. తులసి సానుకూల శక్తిని పెంచుతుందని, తులసి  ప్రదక్షిణ చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

రావిచెట్టు..

రావి చెట్టును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాసంగా భావిస్తారు. భగవద్గీత పదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు స్వయంగా  "వృక్షాలలో  రావి చెట్టును నేనే"  అని పేర్కొన్నాడు. రావి చెట్టును పూజించడం వల్ల పితృ దోషం,  శని వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి.  దుఃఖం, అనారోగ్యం,  మానసిక అశాంతి తొలగిపోతాయి.

మారేడు..

మారేడు చెట్టునే బిల్వ వృక్షం అని అంటారు.  ఇది  శివుడికి చాలా ప్రియమైనది. శివలింగానికి బిళ్వ దళాలు   సమర్పించడం వల్ల అన్ని పాపాలు నశించి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని స్కంద పురాణం పేర్కొంది. బిల్వ దళంలో ఉండే  మూడు ఆకులు త్రిమూర్తులకు ప్రతీకగా పరిగణించబడతాయి.


ఉసిరి..

హిందూ సంప్రదాయంలో ఉసిరి  చెట్టును పూజించడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. పద్మ పురాణంలో ఉసిరి చెట్టును  పూజిస్తే  వెయ్యి ఆవులను దానం చేసినంత పుణ్యప్రదంగా పేర్కొంది. ఉసిరి  చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల అదృష్టం వస్తుందని భావిస్తారు.

అరటి..

అరటి చెట్టు విష్ణువు నివాసంగా,  గురువుకు చిహ్నంగా కూడా నమ్ముతారు. వివాహాలు, యజ్ఞాలు,  ఇతర శుభ సందర్భాలలో అరటి ఆకులు,  కాండాలను ఉపయోగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అరటి మొక్కలను పూజించి సంరక్షించే ఇళ్లలో గొడవలు, పేదరికం,  ఆర్థిక సమస్యలు దూరంగా ఉంటాయని చెబుతారు.

                                  *రూపశ్రీ.


More Enduku-Emiti