భగవద్గీత సారం ఇదే!


“నిర్వైస్సర్వభూతేషు” అంటే సాటి మానవుల పట్ల, సాటి జంతువులు, పక్షుల పట్ల భూతదయ కలిగి ఉండాలి. ఈ వాక్యంలో ఇతరుల పట్ల ద్వేషభావం ఉండకూడదు అని అంటున్నారు. అంటే రాగద్వేషములను పూర్తిగా వదిలిపెట్టాలి. అటు రాగం వైపు కాకుండా, ఇటు ద్వేషం వైపు కాకుండా మధ్యలో ఉండాలి అని అర్థం. దీనినే పరిణతి చెందిన బుద్ధి అని కానీ, వైరాగ్యం అని కానీ అనవచ్చు. వైరాగ్యం అంటే కేవలం రాగము లేకపోవడమే కాదు. ద్వేషం కూడా లేని స్థితి. రాగద్వేషాలకు మధ్య ఉన్న స్థితి.

భాగవతము దశమస్కంధములో ఒక అమూల్యమైన పద్యం ఉంది. "నితాంత అపార భూతదయయును తాపస మందార నాకు దయసేయగదే" అని రాసాడు పోతన. అటువంటి అంతము లేని, అపారమైన భూతదయ ప్రతివారూ కలిగి ఉండాలి. జీవ హింసను మానాలి. ఇతరులను శారీరకంగా గానీ మానసికంగా గానీ హింసపెట్టకూడదు. సాటి జంతువులను వేట పేరుతో హింసించడం, ఆహారం కోసం చంపకూడదు. చాలామంది దేవతలకు ప్రీతిగా జంతుబలులు ఇవ్వడం మనకు తెలుసు. సాటి ప్రాణిని హింసిస్తే ఏ దేవుడు, ఏ దేవతా  సంతోషించడు. ఒక పక్క హింసను పాటిస్తూ, మరొక పక్క వేదాధ్యయనము, పూజలు, ఆరాధనలు చేసినందు వలన ప్రయోజనం లేదు. అందుకే యజ్ఞయాగాదులలో జంతు హింసను నిషేధించారు. దాని వలననే బౌద్ధము జైనము ఎక్కువగా పామర జనులలో ప్రాచుర్యము పొందాయి.

య: సః మామ్ ఏతి అంటే ఎవరైతే అటువంటి భక్తి వైరాగ్యము కలిగి ఉంటాడో, అటువంటి వాడు, నన్ను పొందుతాడు అంటాడు భగవంతుడు. కాబట్టి విశ్వరూప సందర్శనము కావాలి, భగవంతుని గురించి తెలుసుకోవాలి, భగవద్దర్శనం కావాలి అంటే పైన చెప్పబడిన లక్షణములు కల ఏకాగ్రమైన భక్తి వైరాగ్యము కలిగి ఉండాలి. దీన్ని సరిగా అర్ధం చేసుకొని ఆచరిస్తే చాలు, పరమాత్మ సాక్షాత్కారం సులభమౌతుంది అని మనం అందరం తెలుసుకోవాలి. 

భగవద్గీతలో మొట్ట మొదట అర్జునుడికి విషాదము కలిగింది. తరువాత కృష్ణుడిని గురువుగా చేసుకొని తత్వము ఉపదేశించమని అడిగాడు. కృష్ణుడు సాంఖ్యయోగము, జ్ఞానము విజ్ఞానయోగము, కర్మయోగము, కర్మసన్యాసము, ఆత్మసంయమనము మొదలగు యోగములు బోధించాడు. అర్జునుడికి ఏమీ అర్థం కాలేదు. నీ విభూతులు ఏవి అని అడిగాడు. పరమాత్మ ముఖ్యమైన తన విభూతులు చెప్పిన తరువాత అవి ఎలా ఉంటాయో.. చూపించమని అడిగాడు. కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించాడు. అర్జునుడికి మాటల వలన అర్థం కానిది చూస్తే అర్థం అయింది. కృష్ణుని అసలు స్వరూపం తెలుసుకున్నాడు. అనంత విశ్వాన్ని మనోనేత్రంతో దర్శించగలిగాడు. కృష్ణుని ముందు సాష్టాంగ పడ్డాడు. అర్జునుడికి జ్ఞానోదయం అయిందని తెలుసుకున్నాడు కృష్ణుడు. 

ముందు భక్తి యోగం గురించి చెప్పాడు. పరమాత్మను సాకారంగా, నిరాకారంగా ఎలా పూజించాలి. ఎలా సాధన చెయ్యాలి. భక్తి అంటే ఏమిటి. భక్తుల లక్షణాలు ఏమిటి అనే విషయాలు చెప్పాడు. తరువాత శరీరము (క్షేత్రము) శరీరంలో ఉండే ఆత్మ (క్షేత్రజ్ఞుడు) వీరిరువురి గురించి చెప్పాడు. అంటే ఏమీ లేదు ప్రకృతి, పురుషుడు వీళ్ల గురించి చెప్పాడు. మూడవ అధ్యాయంలో ఆత్మ, శరీరము, వీరిరువురి మధ్య అడ్డుగోడగా ఉన్న మూడు గుణములతో కూడిన ప్రకృతి. దాని లక్షణాలు చెప్పాడు. నాలుగవ అధ్యాయంలో ఈ మూడు గుణములు దాటి పరమాత్మను ఎలా చేరుకోవాలి అంటే పురుషోత్తమ ప్రాప్తి గురించి చెప్పి గీతను ముగించాడు. తరువాతి మూడు అధ్యాయాలు గీతకు అనుబంధాలు వివరణలు. గీతలో చెప్పబడిన వాటికి వివరణలు అంతే. ఇదే భగవద్గీత సారం.

కానీ మనుషులు దీన్ని అర్థం చేసుకోవడానికి సతమతం అవుతుంటారు. ఎందుకు అలా అంటే శ్రద్ధతో తెలుసుకోకపోవడం వల్ల. ఏ మనసును నిగ్రహించుకోమని దాన్ని ఆత్మలో లీనం చేయమని భగవంతుడు చెబుతాడో,  అటు ఇటు పరిగెడుతున్న అదే మనసును నిలబెట్టలేక చతికిలబడతారు. కానీ ఒక్కసారి ఆలోచించడం మొదలుపెడితే, ఒకసారి ఆధ్యాత్మిక చింతనలో మునిగితే పలితాన్ని స్వయంగా చవిచూస్తారు.

◆వెంకటేష్ పువ్వాడ.


More Aacharalu