మనుషులలో జరిగే నిత్యా విశ్వరూప కార్యం!!

భగవద్గీతలో కృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తే అర్జునుడు దాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అదంతా ఇప్పుడు కాదని, ఆ విశ్వరూపం మనకు అసంభవం అని అందరూ అనుకుంటారు. కానీ సాధారణ మనుషులు కూడా నిత్యజీవితంలో విశ్వరూపాన్ని దర్శించగలరు. అయితే అందరికీ ఈ కాలంలో జన్న లోపం ఒకటే అడిగి పరిశీలనగా చూడలేకపోవడం. చూసేదాన్ని అర్థం చేసుకోకపోవడం. ఎవరైనా కనీసం పది నిమిషాల సేపు ఏమీ లేకుండా నిశ్శబ్దంగా ఉండగలరా లేదే!! 

కానీ మనం 70,80 ఏళ్లు జీవిస్తున్నాము. ఇంత కాలం పాటు మనలో రక్తాన్ని పంపింగ్ చేసే వ్యవస్థ, గుండె లయబద్ధంగా కొట్టుకునే వ్యవస్థ, ఆహారం జీర్ణం అయ్యే వ్యవస్థ, ఎల్లప్పుడూ శరీరంలో 98.4 ఉష్ణోగ్రత నిలకడగా ఉండే వ్యవస్థ ఎవరు కల్పించారు. మనలో ఏదైనా కరెంటు ఉత్పత్తిచేసే వ్యవస్థ ఉందా! లేకపోతే ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి. ఇదంతా ఆశ్చర్యం కాదా!

మనం ఎప్పుడన్నా పొద్దున్నే నిద్రలేచి సూర్యుడిని చూశామా. సూర్యుడు రాక ముందు జరిగే ఉషోదయంలో ఆకాశంలో మారే రంగులు చూచామా! ఆ ఆనందాన్ని ఆశ్చర్యంతో తిలకించామా! సూర్యుడు అలా అలా నెమ్మది నెమ్మదిగా తన కిరణ కాంతులు విరజిమ్ముతూ పైపైకి రావడం చూచామా! ఇదంతా ఆశ్చర్యం కాదా! ఎండాకాలంలో మహాసముద్రాలలో ఉన్న నీరు ఆవిరి అయి మేఘాల రూపంలో నిలువ వుండి, వర్షాకాలం రాగానే జోరున వాన రూపంలో కురవడం విచిత్రం కాదా! ఇదంతా ఒక నియమం ప్రకారం జరగడం లేదా! 

మానవుడు మరణించగానే, ఆయన దేహములో ఉన్న గాలి గాలిలో, పదార్థం మట్టిలో కలిసిపోయి, ఆ మట్టిలో నుండి మొక్క మొలిచి, అందులో ధాన్యం పండి, ఆ ధాన్యం మనం తిని, తిన్నది రక్తంగా మారి, ఆ రక్తం వీర్యంగా మారి, ఆ వీర్యం స్త్రీ శరీరంలో ప్రవేశించి అండంగా, పిండంగా మారి, మరలా శరీరంగా బయటకు రావడం ఆశ్చర్యం కాదా! ఇదంతా మనం ఎప్పుడన్నా నిశితంగా గమనించామా! 

నేల మీద పాకే గుమ్మడి తీగకు, కాయ పెద్దది గానూ, పెద్దదిగా విశాలంగా విస్తరించి ఉన్న మర్రిచెట్టుకు కాయ చిన్నది గానూ పెట్టడం కంటికి కనిపించని ఆ పరమాత్మ నియతి కాదా! ఎందుకంటే మర్రికాయలు గుమ్మడి కాయంత పెద్దవిగా ఉంటే, ఆ చెట్టు కింద నీడలో విశ్రాంతిగా పడుకున్న వారి మీదపడితే వారు చావరా! ఇది గ్రహించిన ఆ విశ్వచైతన్య శక్తిని గురించి ఎప్పుడన్నా ఆలోచించామా! 

ఇవి అన్నీ మనకు రోజూ కనపడే అంశాలే. కాని మనలో ఉన్న అహంకారము, నేను నాది అనే స్వార్ధము, వీటిని చూడనివ్వదు, వీటిగురించి ఆలోచించనివ్వదు. కాబట్టి ప్రకృతిని ఆస్వాదించండి. ప్రకృతిలోని అద్భుతాలను వీక్షించండి. పరమాత్మయొక్క అద్భుతమైన విభూతులను దర్శించండి. అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అనే భావన కలిగి ఉండండి. అందరినీ సమానంగా ఆదరించండి. కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో మనుషుల మధ్య భేదభావం విడిచిపెట్టండి. అప్పుడు మన పరిధిలో మనం కూడా ఈ విశ్వరూపాన్ని సందర్శించ గలుగుతాము.

◆ వెంకటేష్ పువ్వాడ.


More Aacharalu