పగడాలు ధరిస్తున్నారా.. ఈ తప్పులు చేయకండి!


జ్యోతిష్యంలో రత్నాలను ధరించడం చాలా ముఖ్యమైనది.  వివిధ రకాల రంగు రాళ్ళను రత్నాలు అని పిలుస్తారు.  తొమ్మిది ప్రముఖమైన రత్నాలు ఉన్నాయి.  వీటిని నవరత్నాలు అని అంటారు.  జాతకంలో దోషాలను దూరం చేయడానికి అయినా, జాతక రీత్యా మంచి జరగడం కోసం అయినా,  ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఆరోగ్యం.. ఇలా రకాల ప్రయోజనాల కోసం నవరత్నాలు ధరిస్తూ ఉంటారు.  నవరత్నాలలో పగడం కూడా ఒకటి.  

ముదురు కాషాయం రంగు లేదా ముదురు ఎరుపు రంగులో  ఉండే పగడాన్ని  ధరిస్తే శక్తి, ధైర్యం,  శౌర్యం చేకూరతాయని అంటారు. అలాగే.. పగడాన్ని ధరించడం కుజ గ్రహాన్ని అనుకూలం చేస్తుందని చెబుతారు. కానీ చాలా మంది పగడాలు ధరించేటప్పుడు చాలా తప్పులు చేస్తుంటారు. జ్యోతిష్యంలో రత్నాల గురించి వివరించే నిపుణులు.. పగడాలు ధరించేటప్పుడు చేయకూడని తప్పులేంటో చెబుతున్నారు. అలాగే ఏ రాశుల వారు పగడాలు ధరించాలి? ఏ రాశుల వారు ధరించకూడదు అని కూడా తెలియజేస్తున్నారు.  ఆ విషయాలేంటో తెలుసుకుంటే..

కుజుడు..

జ్యోతిషశాస్త్రంలో కుజుడు ఆత్మవిశ్వాసం, శారీరక శక్తి, రక్తం, భూమి, సోదరులు మధ్య సంబంధం,  నాయకత్వ సామర్థ్యాలకు సంబంధం కలిగి ఉంటాడు. పగడం ధరించడం వల్ల భయాన్ని తొలగుతుంది,  సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని పెంచుతుంది. ఇది ముఖ్యంగా ఆర్మీ, పోలీసు లేదా రియల్ ఎస్టేస్ సంబంధిత ఉద్యోగాలలో ఉన్నవారికి బాగా ప్రయోజనకరంగా ఉంటుంది.

పగడం ఎవరు ధరించాలి?

పగడాలను ధరించే ముందు,  రాశిచక్రాన్ని,  లగ్నాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ రత్నం మేషం,  వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా, సింహ, ధనుస్సు,  మీన రాశి వారికి ఇది అదృష్టంగా పరిగణించబడుతుంది. అయితే, జాతకంలో కుజ దోషాన్ని తగ్గించడానికి లేదా కుజుడిని బలోపేతం చేయడానికి  కూడా పగడాన్ని ధరించవచ్చని నిపుణులు సిఫారసు చేస్తారు.

పగడం ఎవరు ధరించకూడదు..?

రత్నశాస్త్రం ప్రకారం మకరం,  కన్య రాశిచక్రాలలో లేదా లగ్నాలలో  జన్మించిన వారు పండితులను,  నిపుణులను సంప్రదించకుండా పగడాలను ధరించకూడదు. అంతేకాకుండా పగడాలతో వజ్రం, పచ్చ లేదా నల్ల సులేమాని రత్నంలో కలిపి  ఎప్పుడూ ధరించకూడదట. ఎందుకంటే ఇది గ్రహాల పోటీ కారణంగా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని చెబుతారు.

పగడాలను ధరించే సరైన పద్దతి..

రత్నాల శాస్త్రం ప్రకారం 7 నుండి 8 రట్టి(క్యారెట్) పగడాన్ని ధరించడం  శుభప్రదంగా భావిస్తారు. కుజ గ్రహ రత్నం అయిన పగడాలను బంగారం, రాగి లేదా వెండి ఉంగరంలో అమర్చాలి. మంగళవారం ఉదయం సూర్యోదయం తర్వాత ఈ రత్నాన్ని ధరించడం ఉత్తమం. పగడాలను ధరించే ముందు, ఉంగరాన్ని పచ్చి పాలు,  గంగా జలంతో అభిషేకం చేయాలి. తరువాత, కుజుడి మంత్రాలను జపిస్తూ కుడి చేతి ఉంగరపు వేలుకు ధరించాలి.

                                *రూపశ్రీ.


More Enduku-Emiti