కుంభమేళాకు వెళుతున్నారా? గంగా స్నానం చేసేటప్పుడు ఈ నియమాలు పాటించండి..!
భారతదేశంలో పవిత్రమైన నదులలో గంగానది ప్రధానమైనది. గంగానదిలో స్నానం చేసిన మాత్రానే పాపాలు అన్నీ నశిస్తాయని చెబుతారు. గంగా నది స్నానం చేసినవారు మరణం తరువాత జనన మరణ బంధాల నుండి విముక్తుడై మోక్షం పొందుతారని కూడా చెబుతారు. అమావాస్య, పూర్ణిమతో పాటు ప్రత్యేక సందర్భాలలో గంగాస్నానం చేయడాన్ని చాలా ప్రాముఖ్యత కలిగినదిగా చెబుతారు. ఇప్పుడు కుంభమేళా జరుగుతున్న సందర్భంగా గంగానది స్నానం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే కుంభమేళా లో గంగాస్నానం చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
గంగా నదిలోకి దిగేముందు గంగామాతను ముకుళిత హస్తాలతో నమస్కారం చేయాలి. గంగామాత పూజనీయంగా పరిగణించబడుతుంది. అందుకే నది దగ్గరకు వెళ్ళగానే నమస్కరించకుండా నదిలో మొదట కాళ్ళు పెట్టకూడదు. నదిలోకి ప్రవేశించే ముందు గంగాజలాన్ని చేతిలోకి తీసుకుని నుదుటిపై రాసుకుని ఆ తరువాతే స్నానం చేయడం మొదలుపెట్టాలి.
గంగాస్నానం సమయంలో కనీసం 3, 5 లేదా 7 సార్లు స్నానం చేయాలి. ఇలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీనితో పాటు స్నానం చేసేటప్పుడు..
గంగా పాపం శశీ తాపం దైన్యా కల్పతరుస్తథా ॥
పాపం తపం చ దైన్యం చ హన్తి సజ్జనసంగమ్ ।
ఈ మంత్రాన్ని పఠించాలి. దీని వల్ల గంగామాత అపారమైన అనుగ్రహాన్ని పొందవచ్చు.
ఈ తప్పు చేయకండి..
గంగాస్నానం చేసేటప్పుడు పొరపాటున సబ్బులు, షాంపూలు వాడకూడదు. గంగలో ఎలాంటి మురికిని వేయకూడదు. ఇలా చేయడం వల్ల గంగామాత ఆగ్రహం చెందుతుంది. పైగా నది కూడా కలుషితం అవుతుంది. గంగలో స్నానం చేసిన తరువాత శరీరాన్ని గుడ్డతో తుడవకూడదు. బదులుగా ఎండలో ఆరనివ్వండి.
బహిష్టు సమయంలో గంగాస్నానం చేయకూడదని మహిళలు గుర్తుంచుకోవాలి. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకోకుండా గంగాస్నానం చేస్తే పాపం కలగడమే కాకుండా నదిని కలుషితం చేసిన వారు అవుతారు. బహిష్టు సమయంలో గంగాస్నానం చేసినా దానికి పుణ్య ఫలం అంటూ ఏమీ ఉండదు.
*రూపశ్రీ.
