• Next
 • Aahanagar Colony - 27

  ఆహా నగర్ కాలనీ

  సూరేపల్లి విజయ

  27 వ భాగం

  'ఒరే పాతాళభైరవి....'

  'చెప్పరా దుక్కవెధవా....వారం రోజుల్నుంచి రిక్షా నాన్ స్టాప్ గా తోక్కలేక చచ్చిపోతున్నాన్రా....' ఏడుపు గొంతుకతో కసిగా అన్నాడు.

  "ఏంటీ...టంగ్ లో నుంచి సౌండొస్తుంది. నన్ను "అమ్మనా బూతులు తిడుతున్నావా? రివాల్వర్ రాంబో అడిగాడు పాతాళభైరవిని. 'హూ...నా మొహానికి అదొక్కటే తక్కువ....; అని మనసులో అనకుని "ఏమీ లేద్సార్...మీరు చెప్పుకోండి....వినిపెడతా' అన్నాడు.

  'అదేంటో గాని, పాతాళ భైరవి....నాకు మహాచెడ్డ ఆనందంగా వుంది. వారం రోజుల్నుంచి, నీ రిక్షాలో కూచుని వుంటే. నువ్వు తొక్కుతూ వుంటే హైజాక్ అయినా విమానంలో వున్నంత సమ్మగా వుంది.' అన్నాడు కళ్ళు మూసుకుని.

  'సార్...ఇదేమైనా బావుందా? రిక్షా డబ్బులు ఇప్పించండి అన్న పాపానికి నాచేత వారం రోజులు నుంచి రిక్షా తొక్కిస్తున్నారు. మా ఆవిడ మొహం చూసి ఎన్రోజులైందో...అసలు నా పేరేంటో నా వూరేంటో కూడా మరిచిపోయాను. ఏమైనా అంటే వెధవ రివాల్వర్ ఒకటి....' ఏడుపు గొంతుతో అన్నాడు.

  'ఏయ్ మ్యాన్....నన్నేమైనా అను...పోనిలే...అని క్షమించేస్తా....నా రివాల్వర్ ని అన్నావనుకో...బుల్లెట్ దూసుకుపోతుంది...." అన్నాడు రివాల్వర్ ని అటు ఇటూ ఊపుతూ.

  వారం రోజుల నుంచి రివాల్వర్ రాంబోని రిక్షాలో ఎక్కించుకొని తొక్కుతూనే వున్నాడు. నచ్చిన హోటల్ కు వెళ్ళడం...పీకల్దాక తినడం, డబ్బులు అడిగితే, రివాల్వర్ చూపించి, బెదిరించడం.....రాత్రి రిక్షాలోనే నిద్ర....తెల్లవారగానే సరదాగా విచిత్రనగర్ కాలనీ అంతా షికారు.... ఇదీ రివాల్వర్ రాంబో వారం రోజులుగా నిర్వహిస్తున్న దినచర్య.

  'పాతాళభైరవి...'

  'ఆయ్...'

  'ఎందుకో నిన్ను చూస్తోంటే యమజాలిగా వుంది. నీకు నా మీద పీకల్దాక కోపముందని నాకు తెలుసు. పోనీలే....నీ కోరికేందుకు కాదనాలి....నీకో పదినిమిషాలు టైం ఇస్తున్నాను. నీ కరువుతీరా నన్ను తిట్టుకో....బట్.....వన్ కండిషన్. నన్ను టచ్ చేయొద్దు. కరెక్ట్ గా పదినిమిషాలు....ఊ రిక్షా ఆ పక్కన ఆపి మొదలెట్టు....' ఉదారంగా ఓ అవకాశం ఇచ్చాడు రాంబో. అంతే...తెగ ఉత్సాహం వచ్చేసింది.

  పాతాళభైరవికి. రోడ్డు పక్కన ఓ చెట్టు కింద రిక్షా ఆపాడు. గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. తిట్ల దేవతల్ని తలచుకున్నాడు. పనిలో పనిగా ఆవేశం ఎక్కువ రావడానికి, వాళ్ళవిడ్ని తలచుకున్నాడు.

  "ఒరే అప్రాచ్యపు వెధవా, అంట్ల కత్తెర వెధవ, అడ్డమైన నానాగడ్డి తినే తందూరీ శుంఠ, నిన్ను కాకులు, గద్దెలు, కుక్కులు పందులు అన్నీ కలిపి ఎత్తుకెళ్ళ నీ పిండం రిక్షా సంఘం వాళ్లకు పెట్టా. దరిద్రపు వెధవ. నాకు ఎక్కడ దాపురించావురా పింజారీ వెదవ...." అని ఒక్కక్షణం వూపిరి పీల్చుకొని మళ్ళీ మొదలుపెట్టాడు.

  రివాల్వర్ రాంబో బిత్తరపోయాడు.

  " ఏదో మొక్కుబడిగా నాలుగైదు తిట్లు తిడతాడు కాబోలు అనుకున్నాడు. ఇలా నాన్ స్టాప్ గా తిడతాడని వూహించలేదు. వెంటనే కోపంగా చూసాడు. 'అలా కోపంగా చూస్తావెంట్రా అడ్డగాడిద నువ్వెక్కడ దాపురించావురా శనిమొహం వాడా...నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా.... ఆ చూపేమిట్రా చిత్తకార్తె వెధవ....అని ఓసారి ...ఆగి...ఇంకా టైమెంతుంది సార్....' అని అడిగాడు రాంబోని.

  "రెండు నిమిషాలు' నీరసంగా చెప్పాడు రాంబో.

  "అంత తక్కువ టైం వుండి చచ్చిందా చవట పీనుగా...ఇంకో అయిదు నిమిషాల టైం ఇస్తే నీ సొమ్మేం పోయిందిరా పీచుమిఠాయిలా దొంగతనం చేసే, నీచు వెదవ....'

  'ఆపు...నేనిక భరించలేను. నీ జీవితంలో వినని తిట్లు...నా గూబ అదిరిపోతుంది. అన్నాడు చెవులు మూసుకుంటూ రాంబో.

  'ఇంకా ముఫ్ఫయి సెకన్లు వుంది కదరా ముచ్చవెదవ...' అని మళ్లీ మొదలెట్టాడు.

  సరిగ్గా పదినిమిషాలయ్యాక, ఒక్క క్షణం ఆగి వూపిరి పీల్చుకుని, మొహానికి పట్టిన చెమట తుడుచుకొని,....అమాంతం రివాల్వర్ రాంబో కాళ్లమీద పడి....'

  'ఏదో తిట్టమన్నారుగా...అని తిట్టేసాను...నన్ను క్షమించండి.' అన్నాడు.

  'తిట్టి మరి కాళ్లు మొక్కుతున్నావా? నా గుండెకాయ గట్టిది కాబట్టి బ్రతికివున్నాను, లేకపోతే ఈ పాటికి నీ తిట్లకు నా ప్రాణాలు "హుష్ కాకి" అయ్యేవి.

  అయినా నీకెంత టాలెంటు వుందిరా.... తిట్లపోటి పెడితే. అంతర్జాతీయ స్థాయిలోనైనా సరే, నీకే గ్యారంటీ. ఇన్ని తిట్లు ఎక్కడ నేర్చుకున్నావురా. హమ్మో....హమ్మో...ఇంకానయం....'అరగంట' ఛాన్సిచ్చానుకాను" అంటూ వెక్కి వెక్కి ఏడవసాగాడు.

  'ఏదే మీ దయ' అన్నాడు సిగ్గుపడుతూ పాతాళభైరవి. "దయమిట్రా....నన్ను బూతులతో చెడుగుడు ఆడుకున్నావు కదరా....ఛస్తే.....పడుకున్న గాడిదను లేపి తన్నించుకున్నట్టుగా, నన్ను తిట్టే ఛాన్స్ నికివ్వను....' అన్నాడు బుంగమూతి పెట్టి రివాల్వర్ రాంబో.

 • Next