TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
సిల్లీఫెలో - 69
- మల్లిక్
"నన్ను సార్ అనకండి సార్! ఏవోయ్ అనో, ఒరేయ్ అనో అనండి సార్ తృప్తిగా వుంటుంది. ఇంతకీ మీరు ఏ ఆఫీసులో పనిచేస్తున్నారు? ఎక్కడికి ట్రాన్స్ ఫర్ కావాలి? ఆ ఇషయాలన్నీ వివరంగా సెప్పండి సార్" వినయంగా అన్నాడు మినిస్టర్ మిన్నారావు.
అయోమయంగానే అయినా వివరాలు చెప్పడం మొదలు పెట్టాడు ఏకాంబరం.
* * *
బుచ్చిబాబుకి ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే సీత అతని ప్రక్కన పడుకుని వుంది. అతనికి సంతోషంగా మాత్రమే కాదు... హాయిగా.. ఇంకా అదేదో ఇదిగా కూడా ఉంది.
అవును మరి... ఇన్నాళ్ళూ అతనూ, సీతా కలిసి తిరిగారు. కబుర్లు చెప్పుకున్నారు గానీ ఎప్పుడూ ఇలా ప్రక్కప్రక్కన పడుకోలేదు.
క్రితంరోజు రాత్రి సీత అతన్ని క్రిందికి తోసేసి తను వెళ్ళి చాపమీద పడుకుంది.
అలా జరిగినందుకు సీత కూడా ఎంతో బాధపడింది. అయినా ఆమె సర్దుకోలేకపోయింది. పెళ్ళికాకుండా అతని ప్రక్కన ఎలా పడుకోవడం?
బుచ్చిబాబు మోసం చేస్తాడని కాదు.
అదోరకమైన ఇబ్బంది!
బుచ్చిబాబు మనసులో మాత్రం ఏవేవో మధురమైన భావనలు!
క్రితం రాత్రి జరిగింది అతనా సమయంలో మర్చిపోయాడు.
కిటికీలోంచి కళ్ళు మూస్కుని పడుకుని వున్న సీత మొహం మీద వెన్నెలపడి ఆమె అందానికి మెరుగులు దిద్దుతూ అతన్ని పిచ్చివాడిని చేస్తోంది.
బుచ్చిబాబు కంట్రోల్ తప్పాడు.
చటుక్కున సీత నడుం చుట్టూ చెయ్యివేసి దగ్గరకు లాక్కుని ఆమె పెదాలమీద ముద్దు పెట్టుకున్నాడు.
సీత కళ్ళు తెరిచి అతి మొహంలోకి సూటిగా చూసింది. అంతేగానీ క్రితం రోజులా అతన్ని దూరంగా తోసెయ్యలేదు.
బుచ్చిబాబుకి మరికాస్త ధైర్యం వచ్చింది.
ఆమెని మరోసారి ముద్దు పెట్టుకునాడు.
మరోసారి... మరోసారి.....
ఇంకోసారి...
ఆమె మొహమంతా ముద్దులతో నింపాడు.
"చాలా?" సీరియస్ గా అడిగింది సీత.
"ఊహూ.. చాలదూ! ఆమె సీరియస్ నెస్ ని గమనించలేని మత్తులో వున్నా బుచ్చిబాబు అన్నాడు.
"నాకు ఇష్టంలేదని చెపుతుంటే నీక్కాదు? నీకు బుద్ధుందా అసలు?"
బుచ్చిబాబు పట్టు సడిలింది.
"నువ్వు మనిషివేనా?" ఉక్రోషంగా అంది సీత.
బుచ్చిబాబు సీతని వదిలేసాడు.
|