సిల్లీ ఫెలో - 68

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 68

- మల్లిక్

 

ఏకాంబరం తనచేతిలోని కాగితాన్ని మినిస్టర్ మిన్నారావుకి ఇచ్చాడు.

"ఏమిటిది?" అడిగాడు మిన్నారావు.

"రిప్రజెంటేషన్ సార్!" వినయనంగా అన్నాడు ఏకాంబరం.

"ఇట్టా కాగితాలిస్తే నాకేంటి తెలుస్తుంది? నాకు సడవడం రాదు. అదేదో వివరంగా నువ్వే సెప్పు"

"నేను గుంటూరుకి ట్రాన్స్ ఫర్ కావాలి సార్!"

మినిస్టర్ మిన్నారావు సర్ర్రున లేచాడు.

"ఏందమ్మా ఇదీ? నేను పనీపాటా లేనోడిననుకున్నావా? నీ ట్రాన్స్ ఫర్ విషయాలు సూడ్డానికే నేను మంత్ర్హినయ్యాననుకున్నావా? దేశంలో ఎన్ని సమస్యలున్నాయ్! ఏటి కత? ఎల్లెల్లు."

"అది కాదు సార్.. నేను ఎన్నో సంవత్సరాలుగా నా సొంతవూరికి దూరంగా ఇక్కడ పడివున్నా సార్. ఎంతోమంది కిల్లారికిత్తిగాళ్ళకి సహాయం చేస్తుంటారు. నాకు కూడా సహాయం చెయ్యండి సార్!" బ్రతిమలాడుతూ అన్నాడు.

"ఈల్లేదని సెప్పాకదా? ఇప్పుడు నేను అర్జంటుగా పందుల పెంపకం కేంద్రానికి ప్రారంభోత్సవం సెయ్యడానికి వెళ్ళాలి. నన్ను డిస్టర్బింగ్ సెయ్యకుండా వెళ్ళిపో."

"సోఫాలోంచి గబుక్కున లేచాడు మినిస్టరు మిన్నారావు.

ఏకాంబరానికి అర్థం అయిపోయింది. ఆ కిల్లారి కిత్తిగాడు ఒక తన మాట వినడని. ఇక బుచ్చిబాబు చెప్పిన పని చెయ్యడం ఒక్కటే మార్గం!

ఏకాంబరం తన చంకలో చుట్టచుట్టి పెట్టుకున్న న్యూస్ పేపరుని తీసి మినిస్టర్ మిన్నారావు వైపు చూపుతూ" ఇది చూడండి సార్" అన్నాడు.

"ఏముంది అందులో?" అడిగాడు మినిస్టర్ మిన్నారావు ఏకాంబరాన్ని అయోమయంగా చూస్తూ.

"ఏమో.. సార్.. మీరే చూసి చెప్పాలి! నాకేం తెలీదు" అన్నాడు ఏకాంబరం.

నిజానికి ఏకాంబరానికి ఆ న్యూస్ పేపరు ప్రత్యేకత ఏమిటో తెలీదు. ఆ తేదీ న్యూస్ పేపరుని మినిస్టరు మిన్నారావుకి చూపిస్తే పనవుతుందని బుచ్చిబాబు చెప్పాడు. ఎందుకవుతుంది? ఎలా అవుతుంది? అన్న విషయం ఏకాంబరానికి తెలీదు.

మినిస్టర్ మిన్నారావుకి ఏకాంబరం చేతిలోంచి న్యూస్ పేపర్ అందుకుని చూసి వెంటనే కెవ్వుమని కేకవేశాడు. అతని మొహం పాలిపోయింది.

అది రాజేంద్ర హత్యకి సంబంధించిన న్యూస్ పేపర్.

అంటే బుచ్చిబాబు ఆ హత్యారహస్యం వీడికి చెప్పేశాడా?

వీదిప్పుడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా?"

"సార్!" గావుకేక పెట్టాడు మినిస్టర్ మిన్నారావు.

ఏకాంబరం కంగారుగా వెనక్కి తిరిగి చూశాడు. తన వెనకగానీ ఎవరయినా ఉన్నారేమోనని!

"మిమ్మల్నే సార్... కూర్చోండి సార్" జుట్టు పీక్కుంటూ బాధగా అన్నాడు మినిస్టర్ మిన్నారావ్.

"సార్! మీరలా టింగాలటిస్కులా జుట్టుపీక్కోకండి సార్. నాకు బాధగా వుంటుంది. నేనలా కూర్చుంటా సార్" కంగారుపడుతూ అన్నాడు ఏకాంబరం సోఫాలో కూర్చుంటూ.

మినిస్టర్ మిన్నారావు కూర్చోలేదు.