TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
సిల్లీఫెలో - 67
- మల్లిక్
మధ్యాహ్నం....
సమయం ఒంటిగంట. అది లంచ్ టైమ్.
బుచ్చిబాబు ఆఫీసులోంచి బయటకి వచ్చి దగ్గర్లోని ఎస్.టి.డి. టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళాడు.
"ఫోన్ చేస్కోవచ్చా?"
అక్కడ టేబుల్ ముందు కూర్చుని వున్న వ్యక్తిని అడిగాడు బుచ్చిబాబు.
"లేద్సార్... కుదరదు" అన్నాడు వ్యక్తి.
"అదేంటి.. పబ్లిక్ టెలిఫోన్ బూత్ పెట్టుకుని ఫోన్ చేస్తానంటే కుదరదు. అంటావు? ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు బుచ్చిబాబు.
"లేకపోతే ఏంటి సార్... ఇక్కడ టెలిఫోన్ బూత్ పెట్టిందే మీలాంటి వారికోసం. మళ్ళీ ఫోన్ చేసుకోవచ్చా అని అడుగుతారేం? చేసుకోండి" అన్నాడు.
ఆఖరికి ఈ సిల్లీ వెధవకి కూడా నేనంటే జోకా అనుకుంటూ గ్లాసు క్యాబిన్ లోకి వెళ్ళాడు. బుచ్చిబాబు మనసు భగభగ మండిపోతోంది. లంచాలు కొట్టడం కాకుండా స్టాఫ్ మీద లేనిపోని పెత్తనం చెలాయించే మంగారావు పని పట్టాలని అతను అనుకున్నాడు.
రిసీవర్ ఎత్తి హైదరాబాద్ లోని ఓ నెంబర్ ని డయల్ చేయసాగాడు బుచ్చిబాబు.
ఆ నెంబర్ హెడ్డాఫీసులోని సీనియర్ ఎగ్జిక్యూటివ్ నటరాజన్ ది!
ఫోన్ చేసింది మధ్యాహ్నం సమయం కాబట్టి లైన్స్ వెంటనే దొరికాయి.
అవతల ఫోన్ రింగవుతుంది.
నాలుగు సెకన్ల తరువాత ఫోన్ రింగవడం ఆగింది.
"హలో! నటరాజన్ హియర్ అంది అవతల గొంతు.
"హలో... నమస్కారం సార్" అన్నాడు బుచ్చిబాబు.
"ఎవళు మాట్లాడ్తూరు?" నటరాజన్ అడిగాడు.
"నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నా సార్... నాపేరు వీర వెంకట చిన్న సత్యనారాయణ సార్"
"రొంబ పెద్ద పేరు. నాతో ఏమిపని?"
"నేను ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ మంగారావు కస్టమర్ ని సార్."
"కస్టమర్?" ఏమప్పా?"
"మీ మేనేజర్ మంగారావు బాగా లంచాలు తింటాడు సార్."
"లంచాలు ఎవరయినా తింటారా? లంచాలు మీద పడుకుని నిద్దరపోదురు కదప్పా?" నటరాజన్ గొంతులో ఆశ్చర్యం.
బుచ్చిబాబు నెత్తిమీద కొట్టుకున్నాడు.
"అవి లంచాలు కాద్సార్ మంచాలు! మంచాలు!, మంచాల మీద పడుకుంటారు.
"ఓ.... మంచాలు... కన్ ఫ్యూజ్ అయిపూడిస్తిని.
"మీ మేనేజర్ మంగారావు బాగా లంచాలు తింటున్నాడు సార్! అంటే బ్రైబ్ తీసుకుంటున్నాడు. అతనికి లంచాలు యిచ్చేవారిని కస్టమర్స్ అంటాడు సార్. నేను కూడా అతని కస్టమరే సార్. నా దగ్గర చాలా సార్లు లంచాలు తిన్నాడు సార్. అయినా అతనికి తృప్తి లేదు సార్. ఇంకా కావాలి అంటూ అడుగుతున్నాడు సార్. అందుకే మీకు కంప్లయింట్ యివ్వడానికి ఫోన్ చేశాను సార్" గుక్కతిప్పుకోకుండా చెప్పాడు బుచ్చిబాబు.
"ఓ.. అట్టనా? వాడి గురించి వేరే కంప్లయింట్స్ నాన్ దా రిసీవ్ సేస్కుంటిని.. వాడి సంగతి నేను సూస్తును." అన్నాడు నటరాజన్ అవతలి నుండి.
"థాంక్యూ సార్!" అని రిసీవర్ పెట్టేసి కసిగా నవ్వాడు బుచ్చిబాబు.
* * *
|