TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
3 వ భాగం
ఆడవాళ్ళ దృష్టిలో హనుమాన్ భవన్ కి అంత పేరుంది! శ్రావణ శుక్రవారాలు, గుమ్మాలకు ఆకు తోరణాలు, వ్రతాలు, శనగలు పంచడాలూ ఇల్లాంటి అల్లరికి ఆ ఇంట్లో చోటు లేదు. ఏక దీక్ష! ఆడదనే అప్రశక్తి మగాడనే అమాయకుడ్ని ఎట్లా రక్షించాలి. రండి.... దయ చేయండి.... అదుగో హాలు. చూడండి. యాభయి మందికి పైగా మగాళ్ళున్నారు.
అంతా తీరుబడిగా కూర్చున్నారు. శివుడి సెక్రటరీ - పేరు కైలాసం - కూర్చున్న వాళ్ళకి కరపత్రాలు పంచుతున్నాడు. కరపత్రం నెంబరు నూట ఎనిమిది! ఇంద్రుడు చెడెను ఆడదానిచే..... చంద్రుడు చెడెను ఆడదానిచే..... ఈ రెండు ముక్కలూ ఆ కరపత్రానికి హెడ్ లైన్సు! మిగతా గొడవ చదివే ఓపిక లేని వాళ్ళకి శివుడే చెపుతాడు.
శివుడు నిలువెత్తు మనిషి. ఎత్తుకి తగ్గ శరీరం పుష్టితో గంభీరంగా వున్నాడు. అతని మోహంలో తేజస్సు తలతలా మెరుస్తోంది. వయస్సు ధర్టీ దాటివుంటుంది. అతని పక్కనే లేగదూడలాగా అతని తమ్ముడు నిలబడ్డాడు. లేగదూడ కాకపొతే లేడి పిల్ల అనుకుందాం. తెల్లగ, లేతగా, చక్కగ, నేవళంగ... నూనూగు మీసాల ప్రాయంలో మిసమిసలాడుతున్నాడు. శివుడి గంభీర కంఠం బహు పసందుగా వుంది.
“వీడు నా తమ్ముడు, చిరంజీవి బుజ్జులు. మగపిల్లల కాలేజీలో బి.ఏ. చదువుతున్నాడు. ఇవాళ వీడి పుట్టినరోజు. ఆహ్వానం అందుకుని వచ్చిన మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. నన్ను అనుసరించే అభిమానుల సంఖ్య రోజురోజుకి పెరగాలని నా ఆకాంక్ష.
నా ఆశకు తగ్గ ఫలితం కనిపించకపోయినా నేను దిగులు చెందను. నా మట్టుకు నేను ద్వేశంతోనే ఈ జీవితం గడపాలని తీవ్ర నిర్ణయం ఎప్పుడో చేసుకున్నాను. నా తమ్ముడ్ని కూడా అదే లైనులో పెంచుకుంటున్నాను. మా ఇంట్లో మేము మగాళ్ళం. పని మనుషులు మగాళ్ళు, వంటమనిషి మగాడు. సెక్రటరీ మగాడు, గోడమీద దేవుళ్ళు మగవాళ్ళు, చివరికి మా సీజరు అంటే మా కుక్క మా కుక్క కూడా మగదే" ఆ సభలోనే ఒకమూల కూచున్న పులిలాటి కుక్క తన పేరు వినగానే వళ్ళు విరుచుకుని భౌ భౌ భౌమని రేస్పాన్నిచ్చింది.
“సైలెన్స్ సీజర్ - ఈ సీజర్ సైతం అడకుక్కని చూస్తె ఆమడ దూరంలో వుంటుందని చెబితే మీరు ఆశ్చర్యపడనక్కర్లేదు.. మా వరకు వస్తే స్త్రీని మేము ఎంత దూరంలో వుంచుతామో మేము చెప్పనక్కర్లేదు. చివరికి మేము తినే తిండిలో కూడా మాకు స్త్రీజాతి కూరలు సహించవు.
శాఖాహారంలో ఆడా, మగా తేడాల్లేవు గనుక మేము కాయకూరలూ, ఆకుకూరలూ పరీక్షించం. మాంసాహారమైతే మాకు పట్టింపు ఎక్కువ. చికెన్ కావచ్చు మటన్ కావచ్చు. ఆడది అని తెలిస్తే మేము ఆ కూరలు వడ్డించుకోం. అసలు ఆడది అనే శబ్దానికి అర్థమేమిటి? మగాడ్ని సర్వ నాశనం చేసే ఆయుధం. మోస్ట్ పవర్ ఫుల్ వెపన్"
“హియర్...... హియర్" సెక్రటరీ కైలాసం గొంతు.
అతనికి జీతం అయిదొందలు!
“ఆడదంటే ఆడించేదని ఇంకో అర్థముంది. మగాడ్తో ఆడుకుంటూ - మగావాడి మెదడ్ని పాడుచేసే పవరు ఒక స్త్రీకే వుంది. సమస్తమైన ఆడవాళ్ళంతా ఒకటే జాతి. క్షణంలో ఏడుస్తుంది. మరుక్షణంలో నవ్వుతుంది! ఏడ్చి నవ్వి మగాడి మనసుతో చెడుగుడు ఆడుతుంది. ఒక్కటి చెబుతాను... అర్థం చేసుకోండి. మగాడి బ్రతుకు అరిటాకు లాటిది.
ముల్లు ఆడది. అరిటాకు మీద ముల్లు పడినా, ముల్లు మీద అరిటాకు పడినా అన్యాయం జరిగేది అరిటాకుకే! అంటే మగాడికే!” వేదవాక్కు సెలవిచ్చెరు!” కైలాసం కేక పెట్టాడు.
“గత జన్మలో మనం చేసుకున్న పాపానికి శిక్షగా స్త్రీ అనే వస్తువును రూపొందించబడుతుంది. ఎక్కడో మావగారింట్లో మనకోసమే పుట్టి పెరుగుతుంది.. అసలు మావంటే ఎవడు? కిందటి జన్మలో నీకు బద్ధ విరోధి. మీ ఇద్దరిమధ్యా పచ్చగడ్డి వేస్తె, పెట్రోల్లా మండిపోతుంది. ఆ జన్మలో ఆటను నిన్నేమీ చేయలేక – ఈ జన్మలో నీకు మావగా వెలిసేడు.
నీకోసం ఒక కూతుర్ని కన్నాడు. ఆ పిల్లని నీకు అంటగట్టి నిన్ను దెబ్బ తీయాలని కుంటున్నాడు.”
“అంతే! అంతే! ఆడపిల్లలున్న మావలకి మగాడు దూరంగా వుండాలి!” అన్నాడు కైలాసం.
"అయ్యిందా? పిల్ల పెళ్ళికి సిద్ధపడుతుంది. ముహూర్తాలు పెట్టుకుంటారు. శుభలేఖలు అచ్చు వేస్తారు. శుభలేఖంటే అర్థం ఏమిటి? వారెంటన్నమాట. ఆజన్మ కారాగారవాసానికి ఇన్విటేషన్ ని కూడా మనం చెప్పుకోవాలి!” చప్పుట్లు ముందు కైలాసం కొట్టాడు. ఆనక హాలంతా కరతాళధ్వనులతో మారుమోగిపోయింది.
“పెళ్ళి చేసుకుని సుఖపడ్డ మనిషి మచ్చుకైనా మహిలోలేడు సోదరులారా! లేదంటే లేడు అసలే పెళ్ళంటే అర్థమేమిటి? అదొక పెద్ద బురద గుంట, ఊబి. కాలుపెడితే మనిషి మొత్తం కూరుకుపోతాడు. పెళ్ళంటే ఒక జైలని కూడా అర్థంవుంది. పిల్లలు పుడతారు. వాళ్ళు పోలీసులు రక్షక భటులన్నమాట.
ఆ జైలునుంచి నువ్వు తప్పించుకు పారిపోవడానికి వీల్లేకుండ గట్టి బందోబస్తు చేస్తారు. చిరునవ్వుల్తో..... ముద్దు ముద్దు మాటల్తో నీ కాళ్లకీ చేతులకీ సంకెళ్ళు వేస్తారు. ఏతావాతా పెళ్ళయితే పవరు పోతుందని మనమంతా అర్థం చేసుకోవాలి. పీటలమీద మూడు ముళ్ళు వేయడం వరకే మగాడివంతు. ఆ తర్వాత రోజుకో ముడివేసి రోజుక్కొంచెం చొప్పున ప్రాణాలు తీస్తుంది ఆడది. ఈ జీవిత సత్యాలన్నీ వంటబట్టించుకోండి. గుండె దిటవు చేసుకోండి. గుప్పిట బిగించండి. పెళ్లొద్దని ఎలుగెత్తి చాటండి!” శివుడు ఆవేశంతో చెప్పినా హాల్లో భయంకరమైన నిశ్శబ్దం తాండవం చేస్తోంది.
చెప్పిన వేదవాక్కులకు మూర్చపోయారో, చెప్పింది అర్థంకాక కళ్ళప్పగించారో శివుడికి తెలీడం లేదు. కైలాసం వైపు తిరిగి ఈ నిశ్శబ్దానికి సరైన కారణమేమిటని కళ్ళతో ప్రశ్నించాడు శివుడు.
కైలాసం తెలీదన్నట్టు భుజాలెగురేశాడు.....
ఆ తరువాత ఏమయిందో NEXT EPISODE లో చూద్దాం
|
|