TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Shivatandavam - Comedy Serial 4
.png)
4 వ భాగం
ఓక వ్యక్తి పుణ్యమాని ఆ నిశ్శబ్ద వాతావరణానికి భంగం కలిగింది.
ఆ వ్యక్తి అంతకు మునుపు అక్కడికి రాలేదు. అదే తొలిసారి రావడం. పైగా ఆటను పోలీసుమనిషి. హెడ్ కానిస్టేబుల్ హోదా. లేచి నించుని పోలీసుకు సెల్యూట్ కొట్టి ఎంతో వినయంగా ప్రశ్నించాడు.
“సార్! నిజం చెప్పాలంటే నాకు మీటింగులు అర్థం కావండి. ఎన్నెన్నో మీటింగులకి పోలీసు ఫోర్స్ తో ఎల్లేనుగానీ - ఆ మీటింగుల్లో ఒక్క ముక్క కూడా నాబుర్రకెక్కలేదు. అట్టాంటిది తమరు అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు ఎంతో వివరంగా సెలవిచ్చేరండయా! సుబ్బరంగా అర్థమైంది. కాబట్టే నాకో డవుటోచ్చిందండయా!”
“అడుగు నాయనా!”
“నాకు పెళ్ళిగాకమునుపు తమ లెక్చరింటే చచ్చినా పెళ్ళాడేవాడ్ని కాదు. కాని మరి బుద్ధి తక్కువైపోయి పెళ్ళాడేసి ఊబిలో యిరుక్కున్నాను గదా నా గతేంటి?” (తెగించి అడిగింది హెడ్ కానిస్టేబులే కావచ్చు. ఆ ప్రశ్న పెళ్ళయిన ప్రతి ఆసామీ అడగదలుచుకున్నదే?) .
“నీ పేరేమిట్నాయనా!” శివుడు అడిగాడు.
“అప్పల్సామండి! నిప్పు అప్పల్సామి. ఇంటిపేరు నిప్పండి ఇంటి పేరు నా కోసమే పెట్టినట్టు పెట్టేరండయ! డూటీలో నిప్పండి. ఎప్పుడైనా అంటుకుంటే కాలిపోవాల్సిందే? ఆడు యములోడైనా సరే నన్ను జూసి గడగడ లాడిపోవాల్సిందే! ఏమండయా - అట్టాంటి ఫవర్ఫుల్ మడిసిని, మా ఆవిడ్ని చూస్తె డవునైపోతానండి! అవుతరానికి సీపురుపుల్లైనా కోపమొస్తే సీమటపాకాయలాగా చిందులు తొక్కేస్తదండి. అది చెప్పిన మాట వినకపోతే అన్నం పెట్టదండి. ఇట్టాంటి పొజిషన్లో నేనేంచెయాల? అదీ నా ప్రశ్న!”
“ఒక పన్చెయ్!”
“చెప్పి పుణ్యం కట్టుకోండి?”
“నీకసలు పెళ్ళే కాలేదనుకో!” శివుడి సలహాకి అప్పల్సామి ఖంగారుపడుతూ అన్నాడు.
“అయ్ బాబోయ్ అదేట్టా కుడుర్తుందండీ? పెళ్ళాం పక్కన వుండగా నాకింకా పెళ్ళి కాలేదని బోర్డుపెడితే వూరుకుంటారా? రెండో పెళ్ళికి తొందర పడ్తున్నానని డవుటుపడద్ది! చెప్పిచ్చుకొడద్ది. దెబ్బలకి లొంగకపోతే నైట్ టైమ్ లో మంచమెక్కి గిలిగింతలు పెడద్ది! దాంతో అవుటే! పెళ్ళయినోడ్ని. ఆ ఇబ్బందులేంటో నాకు బాగా తెలుసు బాబూ!”
“అప్పల్సామీ!”
“ఆయ!”
“నీలాంటి వాళ్ళకోసమే నేను జాంబియా వెళ్ళేను. అక్కడ తీవ్ర పరిశోధనలు చేసి లేహ్యాన్ని కనుక్కున్నాను.”
“ఏంటండీ? లేహ్యమా?” విడ్డురంగా అడిగాడు అప్పల్సామి.
“అవున్నాయనా! లేహ్యమే!” అన్నాడు శివుడు గంభీరంగా.
కైలాసం శివుడికి ఒక లేహ్యం డబ్బీ అందించాడు.
చూపులకది కుంకుమ భరిణిలాగా వుంది అంతే సైజు.
అది చేతిలో పెట్టుకుని చెబుతున్నాడు శివుడు.
“ఇది నీలాటి వాళ్ళకి దివ్యౌషధం. నీ మనసుతో మీ ఆవిడ చెడుగుడు ఆడుతున్నప్పుడు ఆమె చమత్కారానికి నువ్వు పడిపోతున్నప్పుడు ఈ లేహ్యాన్ని చూపుడు వేలితో తీసి నాలుకమీద వేసుకో! చలించవు. ట్వంటీ టూ అవర్సు పనిచేస్తుంది. ఇరవై రెండు గంటలపాటు స్త్రీ చమత్కారాలు నిన్నేమీ చేయలేవు నాయనా!”
“అయ్బాబో - ట్వంటీ టూ అవర్సే! చాలండి బాబూ! డూటీ దిగగానే సైకిలెక్కేముందు నాలికమీద లేహ్యం పెట్టుకున్నానంటే మళ్ళా టేషను కెళ్ళేంతవరకు దిగులుండదు. అంతేగదండి! ఈ దెబ్బతో మా దుర్గ అవుటే! లేహ్యం రేటెంతో చెప్పండి. కొనుక్కుంటాను.” అన్నాడు అప్పల్సామి.
శివుడు మందహాసం చేసేడు. దానికి అర్థం చెప్పాడు కైలాసం.
“ఈ డబ్బాలు అమ్మబడవు గురువుగారిని త్రికరణ శుద్ధిగా నమ్మినవారికి ఉచితంగా ఇవ్వబడతాయి!” ఆ మాట వినగానే అప్పల్సామికి అమితానందం కలిగింది.
“చూడండయ్యా! మేము నమ్మిన నమ్మకపోయినా.. ఇక నుంచి ఈ శివుడుగారికి నేను శిశువులాటోడ్ని" శివుడు లేహ్యం డబ్బాని అప్పల్సామి కిస్తూ అన్నాడు.
“తీసుకో అప్పల్సామీ! ఈ లేహ్యంతో నీ బతుకు దిద్దుకో!” అప్పల్సామి ఆ డబ్బాని అందుకుని కళ్ళ కద్దుకున్నాడు.
ఈ చర్య అక్కడివారందర్నీ ఆకర్షించింది. వారి ముఖకవళికలు గమనించి కైలాసం అందరికి డబ్బాలు పంచుతున్నాడు.
ఆ తరువాత ఏం జరిగిందో NEXT EPISODE లో
|
|