TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Comedy Audio Serial
.png)
5 వ భాగం
హెడ్డు నిప్పు అప్పల్సామిని చూడగానే దుర్గమ్మ మొహం చాటంత అయ్యింది.
అప్పల్సామికీ హారతిపడుతుంటే "ఏమిటి కతా" అని అడిగాడు అప్పల్సామి - కొంచెం ధాటిగానే. “శ్రావణశుక్రవారం! అయిదోతనం పెరగాలని మొక్కుకున్నాను" అన్నది దుర్గమ్మ.
తనపట్ల భార్యకున్న అనురాగాభిమానాలకు అప్పల్సామి గుండె పరవశించింది. నా పెళ్ళాం ఎంత మంచిదో... ఎంత పిచ్చిదోనని గుండెల్లో కొన్ని మాటలు టైపు కొట్టినట్టయ్యింది.
అంతలోనే శివుడి పాఠం జ్ఞాపకం వచ్చింది. పడిపోతున్నాననుకున్నాడు - జేబులో డబ్బీని తడుంచునిపట్టుకున్నాడు. ఎదటే భార్య వుండటం వల్ల లేహ్య ప్రయోగానికి వాయిదా వేసేడు.
“నీళ్ళు మరక్కాగేయి నీళ్ళోసుకో ముందు" అన్నది దుర్గమ్మ. అంటూనే అప్పల్సామి వంటిమీద నుంచి యూనిఫామ్ తీసింది. ఆ బట్టల్ని చిలక్కొయ్యికి తగిలించింది. తన వంటిమీద బనీను కూడా దుర్గమ్మ తీసింది. ఆ ప్రయత్నంలోనే ఆమె కళ్ళు అప్పల్సామి శరీరాన్ని కితకితలు పెట్టేయి. మళ్ళా అతనికి టైపు మిషన్ జ్ఞాపకానికి వచ్చింది.
నిన్ను ప్రేమిస్తున్నాను అనే అక్షరాలూ దుర్గమ్మ తన వంటిమీద తిప్ చేస్తున్నట్లు భావించాదు. అప్పుడు కూడా అనుకున్నాడు పడిపోతున్నానని! స్నాన ఘట్టం కూడా బహుపసందుగా నడిచింది. స్వయంగా దుర్గమ్మే వీపు రుద్దింది. ఛాతీ రుద్దింది. ఈ రుద్దుడు కార్యక్రమంలో కూడా అప్పల్సామి పడిపోతున్నానని పాతికసార్లనుకున్నాడు. పడిపోతున్నానని అనుకోవటం తప్పించి నిలబడే ప్రయత్నం అతనేమీ చేయలేకపోతున్నాడు.
శ్రావణ శుక్రవారం గనుక ముక్కాకక్కలతో వంట చేయలేదు. పప్పు పులుసైనా మహాత్పరంగా వండింది దుర్గమ్మ. భర్త పక్కనే కూచుని వడ్డన చేసింది అయ్యయ్యో, ఇదేం తిండి, పిట్టతిండని హెచ్చరిస్తూ కొంచెం ఎక్కువగానే తినిపించింది. ఆకు వక్కా సున్నమే గాకుండా - జాజికాయ జాపత్రి కూడా తగిలించి భర్తకి తాంబూలం అందించింది. అప్పుడు అప్పల్సామికి ఎంతో హాయిగ, ఆనందంగా వుంది. ప్రతిరోజూ దుర్గమ్మ ఈ స్థాయిలో సేవలు చేస్తే జీవితానికి ఇంకేం కావాలని కూడా అతను అనుకున్నాడు.
రాత్రి తొమ్మిదయ్యేసరికి దుర్గమ్మ అపరరంభలాగా ముస్తాభయ్యింది. పడగ్గదిలో అగరొత్తులు వెలిగించింది. మంచంమీద మల్లెపూలు వేయకపోయినా మల్లెపూవు లాటి దుప్పటి పరిచింది. మంచం పక్కనే వున్న రేడియోలో ఇంగ్లీషు స్టేషను ట్యూన్ చేసింది. కాన్ బీస్ మని మగో ఆడో తెలీని గొంతొకటి రెచ్చిపోతూ పాడుతోంది! అప్పల్సామి బాగా పట్టుతప్పి పోయేడు. దుర్గమ్మని గట్టిగా వాటేసుకుని మంచంమ్మీద పడిపోతూ 'పూర్తిగా పడిపోయెను' అని ఆ రోజుకి చివరిసారి అనుకున్నాడు.
హనుమాన్ భవన్లో తెల్లవారింది!
అన్నదమ్ములిద్దరు బస్కిల్లో వున్నారు. లంగోటిలు కట్టడం వల్ల వాళ్ళూ వస్తాదుల్లాగా వున్నారు. చెమటతో వాళ్ళ వళ్ళు తడిచి నిగనిగలాడుతోంది. బస్కీలు మాత్రం వీరావేశంతో తీస్తున్నారు. గోడగడియారం టంగ్ మని ఒకే ఒక గంట కొట్టింది.
'ఆరున్నర' అన్నాడు బుజ్జులు.
“కసరత్తు చాలు" అన్నాడు శివుడు. అందుచేత బస్కీలు ఆగిపోయాయి. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ నిక్కర్లు వేసుకున్నారు.
శివుడు తమ్ముడి కండలు కొలిచేడు. సంతృప్తిగా తల విదిలించేడు. “ఇంకో సంవత్సరం చాలు!” అన్నాడు శివుడు.
“ఆ తర్వాత?” అడిగేడు బుజ్జులు.
శివుడు ఆ పక్కనే గోడవార నిలబెట్టిన ఇనుప ఊచను తీసుకుని దాన్ని సునాయాసంగా వంచేస్తూ అన్నాడు.
"ఈ విధంగా ఇనుప ఊచలు, కమ్మీలు ఈజీగా వంచేయగలవు. అయితే సంవత్సరం పాటు నియమం తప్పకుండ కసరత్తు చేయాలి. ఈ లోగా నువ్వు ఎల్లాంటి పరిస్థితుల్లో కూడా ఆడపిల్లల్ని "కన్నెత్తి చూడకూడదు!”
“ఆడ మాట....”
“వినకూడదు"
“ఆడగాలి.....”
“పీల్చకూడదు....”
“ఈ దీక్ష నీకు.....”
“శ్రీరామరక్ష!” (ఈ ప్రతిజ్ఞ ప్రతిరోజూ ఉదయం కసరత్తు కాగానే చేయబడుతుంది!)
శివుడు ఎంతో వాత్సల్యంగా తమ్ముడి భుజాలను తట్టేడు. ఈలోగా కైలాసం బాదం పాలు గ్లాసుతో అక్కడికి వచ్చాడు.
“పాలు తాగు!” అన్నాడు శివుడు. బుజ్జులు గటగటా తాగేశాడు.
“స్నానానికి వెళ్ళు" బుజ్జులు బాత్ రూం వేపు కదిలేడు. కైలాసం శివుడుకి వినయంగా చేతులు జోడించేడు. శివుడు ఠీవిగ, ధీమాగా కైలాసం వేపు చూసేడు.
“తమ దీక్ష అనితర సాధ్యం సార్! మగజాతికే తమరు మణిపూస!” అన్నాడు కైలాసం ఆ తర్వాత మణిపూస స్త్రీ లింగమా, పులింగమా అనే వ్యాకరణం పాయింట్లో పడిపోయేడు. కైలాసం చేసిన కామెంటు శివుడి ఛాతీని పెంచింది! దాంతోపాటు ఠీవి ఉత్సాహం కూడా పెరిగాయి.
అరమోడ్పు కళ్ళతో గంభీరంగా అన్నాడు శివుడు.
“ఈ దీక్ష కేవలం నాకు, నా తమ్ముడికి పరిమితం కాదు. భగవాన్ హనుమాన్ ప్రభువు అనుగ్రహిస్తే మగజాతి మొత్తాన్ని ఈ దీక్షకు అంకితం చేస్తాను. అప్పటిగ్గాని నాకు తృప్తి కలగదు. నేను తలపెట్టినయజ్ఞం విజయవంతం కాదు!” కైలాసం ఇంకా మణిపూస గురించే ఆలోచిస్తూ వుండిపోయాడు.
|
|