TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Audio Comedy Serial
(1).png)
6 వ భాగం.
డ్యూటీకి టైమయిపోవడంతో పోవటం మూలంగా నిప్పు అప్పల్సామి గబగబా యూనిఫారం తొడుక్కున్నాడు. షర్టుజేబు బరువుగా లేకపోవడంతో డవుటు కలిగింది. కంగారు కంగారుగా వెతుక్కున్నాడు. ఎంత వెతికినా పర్సు కనిపించలేదు. పిచ్చెక్కిపోయింది అప్పల్సామికి.
"ఇదుగో నిన్నే" అని పిలిచేడు.
దుర్గమ్మ వయ్యారంగా తిప్పుకుంటూ వచ్చి "ఏంటి" అని కులుకుతూ అడిగింది.
“జేబులో పర్సుండాలి! తీసేవా?” అని గట్టిగానే అడిగాడు.
దుర్గమ్మ అతని దగ్గరగా వచ్చి, అతని కళ్ళల్లోకి కొంటెగా చూస్తూ 'తీస్తే తప్పా' అంటూ చిత్రమైన చూపు విసిరింది.
ఆ చూపు అప్పల్సామి గుండెల్లో కితకితలు పెట్టింది! తట్టుకోలేకపోయేడు. అయినాచెప్పదలుచుకున్న పాయింటుని నీళ్ళు నముల్తూ చెప్పనే చెప్పాడు "అడక్కుండా తీస్తే తప్పే మరి"
“నిన్న జీతాలిచ్చే రోజుగందా. జీతాలిచ్చేరో లేదోనని జేబులు ఎతికేను. పర్సు కనపడింది. తీసి జాగ్రత్త చేసెను.” అప్పటిగ్గాని రాత్రి జరిగిన మాయ యొక్క మూలకారణం అప్పల్సామికి బోధపళ్ళేదు. అంచేత బాధపడిపోతూ అన్నాడు .
"అంటే ఏంటి. ఏంటి నీ ఉద్దేశం. జీతాలిచ్చే రోజని తెలిసే రాత్రి నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేవన్నమాట అంతేగా!”
“ఇదేం విడ్డూరం? నీ జేబెవడో కొట్టేసినట్టు మాటాడతావే?”
“నా జేబు కొట్టే దమ్ము ఈ భూలోకంలో ఎవడికిలేదే? జేబు మీద చెయ్యేస్తే అవుటే! ఆ దమ్ము దైర్యం వుంటే గింటే నీకే వుండాలి!”
“నీ ఇష్టమొచ్చినట్లు అనుకో! మొగుడి పర్సు పెళ్ళాం కాజేసినా తప్పేనా? దా... కాఫి తాగుదువుగాని!”
“దుర్గా!”
“చాల్లే! అరవమాకు! ఎవరన్నా వింటే నవ్విపోతారు. కర్సుక్కావలిస్తే అడుగు అయిదో పదో ఇస్తాను. అంతేగాని రంకెలెడతావెందుకు?” అంటూనే అతని షర్టుకి గుండీలు పెడుతోంది దుర్గమ్మ.
అప్పల్సామి వెంటనే వీధి అరుగుమీదికి వచ్చేసేడు. జేబులోంచి లేహ్యం తీసేడు. చూపుడు వేలితో కొంచెం తీసి నాలుకమీద రాసుకున్నాడు. ఆ పైన సైకిలెక్కిఫైరింజన్లాగా వెళ్ళిపోయాడు. గుండీలు పెట్టినా కాఫీ తాగకుండా వెళ్ళిపోయిన భర్త వింత చేష్టలకి దుర్గమ్మ ఆశ్చర్యపోయింది. ఆమె లెక్క ప్రకారం గుండీలు పెడితే గుంజీలు తీయాలి! అట్లాంటిది కథ అడ్డం తిరిగిందేమిటి?
సైకిలు జోరుగా తొక్కుకుంటూ వచ్చిన అప్పల్సామి హనుమాన్ భవన్' ముందు బ్రేకు వేశాడు. సైకిలుకి తాళం వేసి హాల్లోకి అడుగు పెడుతూ "గురుగారూ" అని పిలిచేడు.
గురువుగారు పూజగదిలో ఉన్నట్టు కైలాసం చెప్పాడు. ఇల్లాంటప్పుడు ఆ గదిలోకి తాను వెళ్ళొచ్చో వెళ్ళ కూడదోనని అప్పల్సామి దిక్కులు చూస్తుండగా పూజగదిలోంచి శివుడు కంఠం వినిపించింది.
“వచ్చిందెవరు?”
“హెడ్ కానిస్టేబులండి...అప్పల్సామిని సార్! నిప్పు అప్పల్సామిని! తమతో అర్జంటుగా మాట్లాడదామని వచ్చెను.”
“రా నాయనా!” అన్నాడు శివుడు.
అప్పల్సామి చెప్పులు విడిచేడు. టోపీ చంకలో పెట్టుకుని ఎంతో భక్తితో పూజ గదివేపు నడిచేడు. ఆ గది తలుపు వేసివుంది. ఆ తలుపుమీద భగవాన్ హనుమాన్ వారి బొమ్మ తైలవర్ణంలో చిత్రించబడి వుంది. హనుమాన్ తన ఛాతీని చీల్చుకుని వున్నాడు. ఆ చాతీలో మామూలుగా శ్రీరామ పట్టాభిషేకం సీనేవుంది. అయితే శ్రీరాములవారి ప్రక్కన సీతమ్మ లేదు. అపచారం జరిగిపోయినట్టు అప్పల్సామి వాయించుకున్నాడు.
కైలాసం ఆ చర్యకు ఆశ్చర్యపోతూ అడిగాడు. “ఎందుకు చెంపలేసుకుంటున్నావ్!” కైలాసాన్ని చిరాగ్గా చూస్తూ చెప్పాడు అప్పల్సామి "ఎందుకేంటండీ! ఏంటీ బొమ్మ"
“అదంతే! గురువుగారు ప్రత్యేకంగా చేయించేరు!”
“గురువుగారు చేయిస్తే మాత్రం? ఏసినోడికి బుద్ధుండదా? సీరాముడి పక్కన సీతమ్మ లేకుండా పట్టాభిషేకం ఏంటండీ?”
“సీతమ్మఆడది! ఆవిడ బొమ్మలో వుండకూడదు!”
“అదేం మాటండీ? ఆడదైతే మాత్రం - అమ్మవారు గందా!”
“అమ్మవారైనా, అపరకాలైన గురువుగారి దృష్టిలో ఆడది ఆడదే. ఊ.. వెళ్ళింక!” అప్పల్సామి ఆ సమాధానంతో తృప్తిపడలేదు. అయినా ఆ పాయింట్ని వదిలేసి తలుపు తీసుకుని పూజగదిలోకి అడుగుపెట్టేడు.
|
|