TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1).jpg)
32వ భాగం
కిష్టుడు దవడ బాగా వాచింది. నుదురు చిట్లింది పెదవి పగిలింది. నెత్తురు - ఎక్కడ చూసినా నెత్తురే! చొక్కా పీలికలైపోయింది. జుత్తు బాగా రేగిపోయింది. ఇంత జరిగినా అతని కళ్ళల్లో నీళ్ళు లేవు. శివుడు టించరు సీసా, దూదితో గదిలో కొచ్చాడు. అన్న తనని చూడంగానే కిష్టుడు చూపు మార్చుకున్నాడు.
కిష్టుడ్ని నఖశిఖ పర్యంతం చూసిన శివుడు తట్టుకోలేక పోయాడు. తన గుండెల్లో ఎవరో కెలికినట్టు కాగా, వస్తున్న దుఃఖాన్ని పళ్ళ బిగువున ఆపుకుంటున్నాడు. ఆ శబ్దం విని అన్నయ్య వైపు చూశాడు కిష్టుడు. శివుడు ఏడుస్తున్నట్టు పసిగట్టాడు.
"నన్నెవరో కొట్టినట్టు ఎందుకూ ఏడుస్తావ్? నువ్వేగా కొట్టావ్?" అన్నాడు కిష్టుడు.
"బుజ్జులూ!" అన్నాడు శివుడు గద్దదికంగా.
కిష్టుడు చూపు మార్చుకున్నాడు. "ఫూల్ని, బాస్టర్ని, స్కౌండ్రల్, ఇడియట్ని, ఊచలు వంచే చేతుల్తో నిన్ను చితక బాదేనురా. వెన్నముద్దలు తినిపించిన ఈ చేతులే నిన్ను చిత్రవధ చేశాయిరా. ఏం చేయను చెప్పు. నాక్కోపమొస్తే అంతే. మరి ! అయినా ఆ దరిద్రగొట్టు ఆల్బమ్స్ ఎందుకు తీసుకురావాలి?" అంటూనే శివుడు కిష్టుడు చొక్కా విప్పాడు. వీపుమీద వాతలు చూసి తట్టుకోలేక వాటిమీద తన పెదవులు ఆన్చి కుళ్ళి కుళ్ళు ఏడుస్తున్నాడు.
"అంత ఏడ్చేవాడివి అసలు నన్నెందుకు కొట్టాలి?" అన్నాడు కిష్టుడు.
"బుద్దొచ్చిందిరా! బాగా బుద్దొచ్చింది ఇంకెప్పుడూ కొట్టను" అన్నాడు శివుడు.
కళ్ళు తుడుచుకున్నాడు. పెదాలు బిగపట్టి, దుఃఖాన్ని దాచుకున్న తమ్ముడి గాయాలకు మందు రాస్తున్నాడు. రాస్తూనే అన్నాడు "ఒరే బుజ్జులూ..ఈ లోకంలో నాకు నువ్వు, నీకు నేను...అంతేరా..అంతే! మనిద్దరి మధ్యలో మూడో వ్యక్తి చోటు చేసుకోకూడదు. బుద్ధిగా వుండు. బుద్దిగా చదువుకో!" కట్టు కట్టడం పూర్తయ్యాక శివుడు ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు. కిష్టుడు, నడుం వాల్చబోతుండగా ఎవరో కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న శబ్డంయ్యింది. అటూ ఇటూ చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. మళ్ళీ వినిపించింది కిటికీ అవతలనుంచి. కిష్టుడు కిటికీవైపు చూశాడు.
అవతల వసుంధర! "నువ్వా! ఎందుకొచ్చావ్?"
"వెళ్ళు, మా అన్నయ్య మళ్ళీ వస్తాడు."
"రానీ! నాకేం భయం లేదు. హు చంపేశాడు నిన్ను!"
"భలే దానివి అవన్నీ నిజం దెబ్బలనుకున్నావా? ఉత్తుత్తి దెబ్బలే! అన్నయ్యే గనుక నిజంగా కొడితే నేను నిజంగానే ఛస్తాను"
"ఎందుకూ అబద్దాలు చెబుతావ్ ? మేము చూళ్ళేదనుకున్నావా? గొడ్డును బాదినట్టు బాదేడు. ఆయన బలవంతుడని ఇష్టమొచ్చినట్లు కొట్టేశాడు. అద్దంలో చూసుకో ఎన్ని దెబ్బలో!" అంటూ వస్తున్న దుఃఖాన్ని చెంగున నోటికి అడ్డం పెట్టుకుని ఆపుకుంది.
"వేరే అద్దమెందుకు ? నువ్వే నాకు అద్దం !" "మాటల్లో పెట్టి బాధ ఓర్చుకుంటున్నావ్ గదూ ! అసలీ దెబ్బలన్నీ నా మూలానే తగిలాయి. పాపిష్టిదాన్ని. ఆల్బమ్ ఇవ్వక పోయినా బాగుండేది. అసలు మనం స్నేహం చెయ్యక పోయినా బాగుండేది!" అంటూ వసుంధర తన తలని కిటికీ ఊచలకు కొట్టుకుంటోంది.
కిష్టుడు ఆమెను వారించాడు. "నాకు దెబ్బలు తగుల్తే నీ తలెందుకు కొట్టుకుంటావ్?"
"మరేం చేయాలి ? నీకిన్ని దెబ్బలు తగుల్తే చూస్తూ కూచోమంటావా ? రేపట్నుంచి నేనసలు కనిపించన్లే !"
"వసూ!"
"అవును మరి ! నేను కనిపిస్తే నువ్వు నాతో స్నేహం చేస్తావ్! నాతో స్నేహం చేస్తే మీ అన్నయ్య నిన్ను చంపేస్తాడట."
"అని ఎవరు చెప్పారు?"
"మా ఆంటీ!"
"మీ ఆంటీ నిజమే చెప్పింది!"
"అందుకే ఇంక నీతో స్నేహం చేయను. ఇవాల్టి నుంచి మన స్నేహానికి కటాఫ్.!"
"నేనూ అదే చెబుదామనుకుంటున్నాను!" "బుజ్జులూ!"
"అవును ! మనం స్నేహం చేయడం మానేసి ప్రేమించుకుందాం !"
"ప్రేమా?"
"అవును. ఇంగ్లీష్ లో 'లవ్' అంటారు. హిందీలో 'ప్యార్' అంటారు. హమ్ ప్యార్ కరేగా ! ఉయ్ లవ్ ఈచ్ అదర్ గ్రామర్ తప్పిందో ఏమిటో ! తెలుగులో చెప్పుకుంటేనే సుఖం. మనం ప్రేమించుకుందాం వసూ !"
"మనం ప్రేమించుకుంటే మీ అన్నయ్య ఊరుకుంటాడా?"
"ఊరుకోక ఏం చేస్తాడు? స్నేహం చేస్తే కొడతాడు. ఇది స్నేహం కాదన్నయ్యా ! ప్రేమ అంటాను. అప్పుడేం చేయాలో తోచక బుర్ర గోక్కుంటాడు. అదుగో... వస్తున్నట్టున్నాడు నువ్వెళ్ళింక !" అన్నాడు ఖంగారుగా.
"నిన్నీ స్థితిలో విడిచి ఎట్లా వెళ్లేది ?"
"నువ్వెళ్ళకపోతే మరో కోటా తగిలిస్తాడు. ఈసారి కాలో చెయ్యో విరిచేస్తాడు."
"అమ్మో!"
"అందుకే వెళ్ళమంటున్నాను. వెళ్ళు!" వసుంధర అయిష్టంగానే అక్కడ్నుంచి కదిలింది.
ఆమె వెళ్ళి పోయిన తర్వాత శివుడు పాలగ్లాసుతో గదిలోకి అడుగు పెట్టాడు. కిష్టుడు నిరసనగా మొహం తిప్పుక్కూచున్నాడు.
"ఇంద పాలు తాగు!"
"అఖ్ఖర్లేదు !"
"ఒరే బుజ్జులూ... నీ కంటే పెద్దవాడ్ని ! నన్ను బాధపెడితే పాపం ! తాగు !"
"తాగనని చెప్పానుగా?"
"తాగవూ ?"
"తాగను !" శివుడు ఒక క్షణం ఆలోచించాడు. తమ్ముడి పక్కన కూచున్నాడు. గంభీరంగా అన్నాడు.
"నువ్వు తాక్కపోతో నన్ను చంపుకు తిన్నంత ఒట్టు !"
"అన్నయ్యా !"
"తర్వాత నీ యిష్టం."
"అక్కడ పెట్టి వెళ్ళు తర్వాత తాగుతాను"
"ఉహు! ఇప్పుడే నా ఎదటే తాగాలి. మూడు లెక్క పెడతాను. లెక్క పూర్తయ్యేలోగా తాగేసేయాలి. లేదా నేను చచ్చినట్టే ఒకటి...రెండు..." శివుడు మూడన కుండానే కిష్టుడు గ్లాసు లాక్కుని గబగబా తాగేశాడు.
శివుడు ఆనందించాడు.
కిష్టుడు తలమీద ముద్దు పెట్టుకుని ప్రేమగా అన్నాడు "స్వీట్ చైల్డ్ !"
|
|