Shivatandavam - Comedy Serial 31

Listen Audio File :

31వ భాగం

శివుడు ఆల్బమ్ వైపు నడిచాడు. కిష్టుడు నీళ్ళు నములున్నాడు. శివుడు ఆల్బమ్ ని తెరిచాడు. కిష్టుడు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. చెంప దెబ్బ ఫోటో శివుడి కళ్ళ ముందుంది. ఆ ఫోటో చూస్తూనే శివుడు షాక్ తిన్నాడు. సాక్షాత్తు పంకజమే వచ్చి తన చెంపలు వాయిస్తున్నట్లు భ్రమ కలిగింది. రెండు మూడు క్షణాలు ఆ భ్రమలోపడి అవస్థ పడ్డాడు.

‘పంకజం’ అని పొలికేక పెట్టాడు. చెంప దెబ్బలు ఆగిపోయాయి. ఆల్బమ్ మూసేశాడు. ఇప్పుడు శివుడు అపర రుద్రుడిలా ఒక్కో అడుగు గంభీరంగా వేస్తూ ఆల్బమ్ ని కిష్టుడు మొహమ్మీద పెడుతూ అడుగుతున్నాడు “చెప్పరా...చెప్పు. ఇది మనింట్లోకి ఎట్లా వచ్చింది?” ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు?”

“భగవద్గీతలాగా దీనింత భద్రంగా మనింట్లో ఎందుకుంచావ్?”

“అన్నయ్యా !”

“నోర్మూయ్!” అంటూ చెడామడా కొట్టాడు.

“ఇప్పుడు జలాలుద్దీనెవడో అర్థమైందిరా! బాగా అర్థమైంది !” అంటూ ఆల్బమ్ తో కదలబోయాడు.

“అన్నయ్యా! ఆల్బమ్ నిచ్చి వెళ్ళు!” అన్నాడు కిష్టుడు.

“ఇవ్వనా! ఇవ్వను. చచ్చినా ఇవ్వను. దీన్ని కాల్చి బూడిద చేసి దాన్ని మొహమ్మీద కొడ్తాను” అంటూ శివుడు గది దాటుతున్నాడు. కిష్టుడు ఇంకా ప్రాథేయపడుతూనే ఉన్నాడు.

“ఆగన్నాయ్యా! ఆగు ! దాన్ని కాల్చి బూడిద చేస్తే వసుంధర బాధపడుతుంది. ఆ అమ్మాయ్ దాన్ని నాకు ఇచ్చిందన్నయ్యా! వాళ్ళవస్తువు వాళ్ళ కిచ్చేద్దాం ! ఇవ్వన్నయ్యా ! ఇవ్వు !” అంటూ కాళ్ళావేళ్ళా పడుతున్నాడు.

కాల్తోనూ చేత్తోనూ కొడుతూ ఉన్నాడు. శివుడు చితకబాదుతున్నా కిష్టుడు లెక్కచేయడం లేదు. శివుడి చేతిలోంచి ఆల్బమ్ ని లాక్కునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. అతని ధ్యేయమల్లా ఆల్బమ్ ని వసుంధరకు క్షేమంగా అందజేయడ మొక్కటే ! అందుకతను శివుడి చేతిలో చిత్రవధే అనుభవిస్తున్నాడు. చివరికెట్లాగో శివుడు చేతుల్లోంచి ఆల్బమ్ ని లాక్కుని వీధిలోకి పరిగెత్తాడు. ఎదురింట్లో లైట్లు వెలిగాయి.

రవీంద్రభారతి నుంచి పంకజం వసుంధర అప్పుడే వచ్చినట్టున్నారు. శివుడింట్లో రభసని చూస్తూ గేటు దగ్గరే ఆగిపోయారు. శివుడి చేత వళ్ళు హునం చేసుకుని, చొక్కా చిరిగిపోయి, నానా భీభత్సంగా వున్న కిష్టుడు ఆల్బమ్ తో పరుగెత్తుకుంటూ వచ్చి దాన్ని వసుంధర కిచ్చేస్తూ గాభరాగా అన్నాడు.

“దీన్ని తగలబెడతానంటున్నాడు అన్నయ్య ! ఇదిగో తీసుకో ! వస్తా” అంటూ వెనక్కి తిరిగాడు.

“అమ్మో నిన్ను చంపేస్తాడేమో!” అన్నది వసుంధర ఆందోళనగా.

“చంపనీ ! ఫర్లేదు. నీ ఆల్బమ్ నీకిచ్చేశానుగా. ఇంక నేను ఏమైపోయినా పర్లేదు!” అని అతను వెళ్ళిపోతున్నాడు.

అంతా చూస్తున్న పంకజానికి కిష్టుడి మీద జాలి కలిగింది. శివుడిమీద పెనుకోపం కలిగింది. చిన్నపిల్లవాడ్ని చేసి చితగ్గొడతాడా? ఎవరి మీదో కోపాన్ని పసివాడి మీద తీర్చుకుంటాడా? కిష్టుడు ఇంట్లోకి వెళ్ళబోతుండగా....గేటు దగ్గిరే అతన్ని పట్టుకున్నాడు శివుడు. కిష్టుడు మెడవంచి పిడిగుద్దులు గుద్దుతున్నాడు. అతన్ని బంతిలాగా గోడకేసి కొడుతున్నాడు. కిష్టుడు చాలా ఓపిగ్గా ఆ దెబ్బలన్నీ తింటున్నాడు. వసుంధర ఏడుస్తోంది. పంకజం ఓర్చుకోలేక పోయింది. గబగబా శివుడింటి ముందుకు వచ్చి గట్టిగా కేకలు పెట్టింది.

“బుద్ధుందా లేదా ? నీ కండబలం ఆ కుర్రాడిమీద ప్రయోగించడానికి సిగ్గు లేదూ ? మనిషన్న వాడెవడూ ఇన్ని దెబ్బలు కొట్టడు. నీకే చెప్తూంట, అతన్ని కొట్టకు.” శివుడు కొట్టడం ఆపినా తమ్ముడి కాలర్ని చేతుల్లోనే వుంచుకున్నాడు.

పంకజం వైపు చూడకుండానే పంకజం మీద ఆరిచాడు. “నా తమ్ముడు ! నాయిష్టం. నాకిష్టం లేని పనులు చేస్తే కొడతాను. గొయ్యితీసి పాతరేస్తాను. నువ్వెవతివి చెప్పడానికి ? మగరాయుడిలా దూసుకు వచ్చింది చాలక బుద్దులు చెబుతోంది బుద్దులు ! అసలిదంతా నువ్వాడిన నాటకం కాదూ ! ఇప్పటికైనా కసి తీరిందా ? తృప్తిగా వుందా ? పోవే రాక్షసీ ! పో అవతలికి” అనేసి తమ్ముడ్ని తోసుకుంటూ లోపలకి వెళ్ళిపోయి తలుపుల్ని భళ్ళును మూశాడు.

పంకజం నీరసంగా అక్కడ్నుంచి కదిలింది. ఆమె మనసంతా వికలమై పోయింది. కన్నీరూ బాధా రెండూ పోటీలు పడుతున్నాయి. గేటు దగ్గర వసుంధర వలవలా ఏడుస్తోంది !

ఆమెను దగ్గిరకి తీసుకుంటూ అన్నది పంకజం. “దుర్మార్గం అనేక రకాలు బేబీ ! అందులో ఇదో రకం. బుజ్జుల్తో స్నేహం మానుకో !”

“అంటీ!”

“నీ స్నేహమే అతని ప్రాణాలు తీస్తుంది గుర్తుంచుకో !” అంటూ వసుంధర ఇంట్లోకి తీసుకెళ్తోంది పంకజం.