Shivatandavam - Comedy Serial 33

Listen Audio File :

33వ భాగం

ఆ ఉదయం పంకజమింట్లో గోడగడియారం ఎనిమిదిన్నర చూపెడుతోంది. టైమైపోతున్నందుకు వసుంధర చాలా హడావిడిగా తయారౌతోంది. తొమ్మిదైతే కిష్టుడు రోడ్డు మీది కొచ్చేస్తాడు. చేతికి అందిన పుస్తకాలు తీసి సర్దుకుంటోంది. ఎదురింట్లో కిష్టుడు ముస్తాబయ్యాడు. పుస్తకాలు తీసుకుని చెప్పులు తొడుక్కుంటుండగా శివుడు వచ్చాడు.

అతని చేతిలో బేండేజీ వగైరాలున్నాయి. వాటిని చూసి ఖంగారుగా అన్నాడు కిష్టుడు "ఇప్పుడివన్నీ ఎందుకన్నయ్యా అవతల కాలేజీకి టైమై పోతూంటేనూ"

"ఇనుప గేటు దగ్గిర కొట్టేను గదరా...ఇనుము తగిల్తే ప్రమాదం. ఎంతసేపూ క్షణంలో కడతాను." అంటూ తమ్ముడ్ని కూచోబెట్టాడు.

"వెళ్ళొస్తాను ఆంటీ !" అంటూ వసుంధర పంకజం మాట కోసం ఎదురుచూడకుండానే బయటికొచ్చి సైకిలెక్కింది.

ఎదురింటివైపు చూసుకుంటూ, సైకిలు నడిపించుకుంటూ వెడుతోంది. కట్టు కట్టడం పూర్తయిందిగానీ శివుడు మరో పేచీ పెట్టాడు.

"వళ్ళు వెచ్చగా ఉందిరా బుజ్జులూ ! బాగా దెబ్బలు తగిలాయి కదా. జ్వరం వచ్చి వుంటుంది. ఇవాళ కాలేజీ మానేయ్!" కిష్టుడు ఆ మాటకి అదిరిపడ్డాడు.

"అమ్మో! పరీక్షల ముందు క్లాసు లెగగొట్టటమే!"

"ఒక్క రోజు మానితో కొంపలేం మునిగిపోవుగా!"

"ఎందుకు మునగావూ, బ్రహ్మాండంగా మునుగుతాయి. జ్వరం లేదు. గిరం లేదు. ఎండాకాలం కదా ! అందరి వళ్లూ వెచ్చగానే ఉంటుంది. తొమ్మిదవుతోంది. వెళ్ళొస్తా!" అంటూ లేచాడు కిష్టుడు.

"కాస్తాగు ! టెంపరేచరు చూస్తాను" అంటూ ధర్మామీటరు తీశాడు.

కిష్టుడు గోడ గడియారం చూశాడు. తొమ్మిదవతోంది. వసుంధర చర్చి దగ్గర కాపు కాసింది. చేతికున్న వాచీని అసహనంగా చూసుకుంది. తొమ్మిది కావస్తోంది. గంట స్తంభం వైపు చూసింది. ముసలి డేవిడ్ మెల్లిగా గంట స్థంభం ఎక్కుతున్నాడు దగ్గుకుంటూ.

వసుంధర కిష్టుడు కోసం ఆత్రంగా రోడ్డు చివరివరకూ దృష్టి సారిస్తోంది. కిష్టుడు నోట్లోంచి ధర్మామీటరు తీసి చూశాడు శివుడు.

"నూటొకటి జ్వరం లేదన్నావుగా...చూడు ...నూటొకటుంది! కాలేజీ మానేయ్!" అన్నాడు శివుడు.

కిష్టుడు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.

"ఆఫ్టరాల్ నూటొకటికి వర్రీ అవుతావే? దారిలో మాత్రకొని నోట్లో వేసుకుంటే అరగంట చాలు! నార్మల్ కొచ్చేస్తుంది. ఈ బోడి జ్వరానికి భయపడి కాలేజీ మానేస్తే పరీక్షల్లో తప్పుతాను" అన్నాడు.

"నామాట వినరా బుజ్జులూ...ఇవాల్టికి రెస్టు తీసుకో!" అంటున్నాడు శివుడు.

గోడగడియారం ఠంగ్ ఠంగ్ మని తొమ్మిదిగంటలు కొట్టడం ప్రారంభించింది. కొంచెం తేడాతో చర్చి గంటలు కూడా వినిపిస్తున్నాయి. ఒకటక్కడం ఒకటక్కడం వంతులు వారగా గంట్లు వినిపిస్తుంటే కిష్టుడు తట్టుకోలేక పోయాడు.

"జ్వరం ఎక్కువైతే రేపు రెస్టు తీసుకుంటాను. ఆరునూరైనా నూరు ఆరైనా ఇప్పుడు కాలేజీ వెళ్ళాల్సిందే " అంటూ కిష్టుడు గది దాటాడు.

"బుజ్జులూ బుజ్జులూ" అంటూ శివుడు వెంటపడినా అతను ఆగలేదు.

కిష్టుడు గుమ్మం దాటేసరికి తొమ్మిది గంటలూ పూర్తి అయ్యాయి. వసుంధర దిగులుగా వుంది. మళ్ళీ ఒకసారి రోడ్డుమీదికి చూసింది. కిష్టుడు రావడంలేదు. గంట స్థంభంవైపు చూసింది. డేవిడ్ దగ్గుకుంటూ మెట్లు దిగేసి వచ్చాడు.

వరండాలో కూచుని గోడకానుకుని పైపు ముట్టించుకుంటున్నాడు. కిష్టుడుకి తొమ్మిది గంటలు వినిపించాయో లేదోనని వసుంధరకి డవుటు కలిగింది. తన సైకిలుకి స్టాండు వేసి డేవిడ్ కి కనిపించకుండా గంట స్థంభం ఎక్కింది. తాడు తీసుకుంది. మళ్ళీ తొమ్మిది గంటలు కొట్టే ప్రయత్నంలో తాడు లాగింది. ఠంగ్ మంది గంట. డేవిడ్ ఉలిక్కిపడ్డాడు.

రెండోసారి మోగింది. డేవిడ్ పైపు పారేసి లేచాడు. మూడోసారి వినిపించింది....