Shivatandavam - Comedy Serial 30

Listen Audio File :

30వ భాగం

ఎవడో చెప్పిన మాటలు నమ్మి తమ్ముదిమీద కోపం తెచ్చుకున్నందుకు శివుడు బాధపడ్డాడు. కిష్టుడు యింకా ఎడా పెడా చదువుతూనే వున్నాడు. శివుడు మెల్లిగా ఆ గదిలోకి అడుగు పెట్టాడు. అన్నయ్యని అప్పుడే చూసినట్టు....కిష్టుడు వినయంగా లేచి నిలబడ్డాడు.

ఎంతో లాలనగా అడిగాడు "ఎక్కడికి వెళ్ళావన్నయ్యా?"

"ఏమీ తోచక...అట్లా అట్లా తిరిగొచ్చాను. అది సరే - నువ్వు ఎప్పుడు వచ్చావ్ ?"

"చాలా సేపయ్యిందన్నయ్యా!"

"అయినా... కాలేజీ నుంచి ఆలస్యంగానే వచ్చావు. అవునా?"

"అవునన్నయ్యా ! పరీక్షలొస్తున్నాయి గదా - ప్రైవేటు క్లాసులు దంచేస్తున్నారు."

"ఆ సమాధానం శివుడ్ని ఓదార్చింది. అయినా మొదట్లో కైలాసం గుచ్చిన మాట యింకా గుర్తు కొస్తూనే ఉంది. బుజ్జుల్ని దగ్గరకు తీసుకుని ప్రేమగా అడిగాడు.

"నువ్వు చెబుతున్నదంతా నిజమేనా?"

"అదేమిటన్నయ్యా? కొత్తగా అడుగుతావే? నేనెప్పుడయినా నీతో అబద్దం చెప్పానా? చెప్పగలనా?" కిష్టుడు వినయానికి శివుడు సంతోషించాడు. ఆ తర్వాత నెమ్మదిగా అడిగాడు.

"కైలాసం నీతో ఏమైనా విరోధం పెట్టుకున్నాడా?"

"విరోధమా? అబ్బే... అలాంటిదేమి లేదన్నయ్యా? మేమిద్దరం ఎంతో స్నేహంగా వుంటాం!."

"అలాంటపుడు నీ గురించి అట్లా ఎందుకు చెప్పాడు!"

"ఏం చెప్పాడు?"

"నువ్వూ, ఆ ఎదురింటి పిల్లా కులాసాగా నాట్యాలు చేస్తున్నారని, ఒకర్నొకరు అతుక్కుపోయిన ముచ్చట్లు చెప్పుకుంటున్నారనీ...."

కిష్టుడు చెవులు రెండూ మూసుకుని "అన్నయ్యా" అని అరిచాడు నాటకీయంగా. శివుడు క్షణంసేపు మాట్లాడలేదు. కిష్టుడు భుజాన్ని లాలనగా తట్టి "టేకిటీజీ" అన్నాడు.

క్షణం తర్వాత కిష్టుడు అన్నాడు "హు ఇప్పుడర్థమవుతోంది ! ఇదంతా ఆ జలాలుద్దీన్ గాడి లీలా విలాసాలని ఇప్పుడే అర్థమవుతోంది."

"జలాలుద్దీన్ ఎవడు ?"

"నా క్లాస్ మేట్. నువ్వు నమ్మవుగానీ అన్నయ్యా, వాడూ నేనూ అచ్చం ఒకేలా ఉంటాం. ఎత్తూ, లావూ, నడక... మాటతీరు... రూపం - అచ్చు గుద్దినట్టు ఒకే పోలిక. మా ఇద్దర్లో ఎవడు జలాలుద్దీనో, ఎవడు బుజ్జులో.... పోల్చుకోవడం చాలా కష్టం."

"అంటే? ఆ పిల్లతో తిరిగింది జలాలుద్దీనా."

"అయ్యే వుండాలి. లేకపోతే కైలాసం ఎందుకు చెబుతాడు. నీతో అబద్ధం చెప్పడానికి అతనికి ఎన్ని గుండెలు ఉండాలి. పాపం జలాలుద్దీన్ని చూసి నన్ననుకుని ఉంటాడు ఫూర్ ఫెలో."

"అయినా, ఆ జలాలుద్దీన్ కి అదేం పని ! పబ్లిగ్గా పార్కుల్లో డాన్స్ లేమిటి? ముచ్చట ఏమిటి? లేహ్యం డబ్బా యిస్తాను తీసుకెళ్ళి అతనికివ్వు."

"వాడికి డబ్బాలు కాదు గదా సీసాలు కూడా పని చేయవన్నయ్యా ! నేను నాటకం వేస్తానంటే నువ్వు వద్దన్నావు గదా! పెద్దల మాట ఎందుక్కాదనాలని మానేశాను. ఆ ఛాన్సు జలాలుద్దీన్ కి వచ్చింది. జలాలుద్దీనేమో ప్రవరాఖ్యుడు, ఎదురింటి పిల్లేమో వరూధిని ! వారం రోజుల్లో నాటకం డాన్స్ ప్రాక్టీసు చేయడానికి పార్కుకి వెళ్ళి వుంటారు. మన కైలాసం వాడ్ని చూసి నన్నుకుని నీతో చెప్పాడు. కైలాసాన్ని క్షమించు అన్నయ్యా ఇందులో అతని తప్పేమీ లేదు. ఆ మాటకొస్తే మొన్నటికి మొన్న మా తెలుగు మాస్టారు "

"ఎవరూ పురాణగాధని తల్లకిందులు చేసినతనేనా?"

"అవును ఆయనే ! క్లాసు వరండాలో పట్టుకుని, "ఏరా అడ్డగాడిదా! సిగరెట్టెపు ట్నుంచి మొదలెట్టేవని పదిమందిలో నా పరువు తీసేశాడు. సినిమాహాల్లో ఆయన పక్కనే కూచుని సిగరెట్టు కాల్చింది జలాలుద్దీను తిట్లూ దీవెనలు నాకు. తెలుగు మాస్టారంతటి వాడే పప్పులో కాలేస్తే, ఆఫ్టరాల్ కైలాసమెంతన్నయ్యా? వదిలెయ్ అతన్ని !" అన్నాడు కిష్టుడు.

"సరే సరె ! అవసరమైన విషయాల్తో నీ చదువు పాడుచేయడం నాకిష్టం లేదు. చదువుకో !" అంటూ శివుడు గది దాటబోతూ మంచం మీదున్న ఆల్బమ్ ని చూశాడు.

శివుడు చూపు ఆల్బమ్ మీద పడిందని కిష్టుడు కూడా గమనించాడు. కలవరం ప్రారంభమైంది.