Shivatandavam - Comedy Serial 29

Listen Audio File :

 

29వ భాగం

అంతలో... ఎక్కడ్నుంచో వచ్చిందో మూడు మూరల పాము వేదిక మీదికి వచ్చేసింది. పంకజం నృత్యానికి అనుగుణంగా పడగ విప్పి ఆడుతోంది. ప్రేక్షకులు ఊపిరి బిగపట్టుకుని చూస్తున్నారు. అదేసమయంలో... రవీంద్రభారతిలోకి అడుగు పెట్టాడు శివుడు. అతనివెంట సీజరుంది. ఎందుకో తల తిప్పిన కిష్టుడు మొట్టమొదట సీజర్ని చూశాడు.

ఆ తర్వాత అన్నయ్యను చూశాడు. నెత్తిమీద పిడుగు పడినట్టయింది. కిష్టుడు మెల్లిగా కుర్చీ దిగాడు. నెలకి చేతులు ఆన్చి పసిపాపలాగా పాక్కుంటూ అవతలి గేటు దగ్గరకి వెళ్ళాడు. అక్కడ్నుంచి కాలికి బుద్ధి చెప్పి పరుగెత్తాడు.

హాల్లో పంకజం నాట్యం సాగుతూనే ఉంది. పాము పడగవిప్పి ఆడుతూనే ఉంది. ప్రేక్షకులు మైమరిచి చూస్తూనే ఉన్నారు. శివుడు కళ్ళు మాత్రం హాలంతా వెతుకుతున్నాయి. కిష్టుడు ఎక్కడా కనిపించలేదు. అందర్నీ గుచ్చి గుచ్చి చూస్తూనే వున్నాడు. అట్లా చూస్తూ చూస్తూ తన పక్కనే వున్న సీజర్నీ చూశాడు.

పంకజం నాట్యం సీజరుక్కూడా బాగ నచ్చింది కాబోలు తన రెండు కాళ్ళూ ఎత్తి లయ బద్ధంగా డాన్స్ చేస్తోంది. శివుడికి వళ్ళు మండిపోయింది. సీజర్ అని మెల్లిగా హెచ్చరించాడు. సీజరు వినిపించుకునే స్థితిలో లేదు. శివుడు లేహ్యం డబ్బీ తీశాడు. కొంత లేహ్యంతీసి సీజరు నాలుకకు అంటించాడు.

గాలితీసిన బుడగలాగా సీజరు కాళ్లు దించేసింది. ఉత్సాహం నీరు కారిపోగా బల్లిలాగా నేలమీద పడుకుంది. శివుడు కిష్టుడు కోసం యింకా గాలిస్తూనే ఉన్నాడు. పంకజం డాన్స్ తారాస్థాయి నందుకుంది. తదనుగుణంగా పాము ఆడుతోంది ఆ స్థితిలో పంకజం గేటు దగ్గరున్న శివుడ్ని చూసింది. ఆమె కళ్లు మెరిసాయి ఆనందం ఉప్పొంగింది.

దాంతో ఆమె పరవశిస్తూ డాన్స్ స్థాయిని పెంచి ప్రదర్శన యిస్తోంది. పంకజానికి ఆ వేదిక కైలాసగిరి అయింది. తాను గిరిజా కుమారిగా మారింది. ఎదుట శివుడు ముగ్ధురాలవుతోంది. తన పక్కన కిష్టుడున్నాడోలేడో కూడా పట్టించుకోని స్థితిలో పడిపోయింది. ఆ నాట్య వైభవం అట్లా సాగుతూనే శివుడు హాలంతా వెతకడం పూర్తి చేశాడు.

కిష్టుడు కనిపించలేదు. విసుగ్గా గేటునుంచి కదిలాడు. సీజరు యజమానిని అనుసరించింది. రవీంద్రభారతి బయట శివుడు కారెక్కాడు. సీజరు ముందు సీట్లో కూర్చుంది. రవీంద్రభారతిలో కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. బహుశా పంకజం డాన్స్ పూర్తయి వుండొచ్చు.

"పోనివ్వు!" అన్నాడు శివుడు.

కారు కదిలింది. కిష్టుడు స్థిమితంగా తన గదిలో కూచుని వున్నాడు. రవీంద్రభారతిలో అన్నయ్య తనని చూడనందుకు ఎంతో సంతోషించాడు. పెద్ద గండం తప్పినట్టు ఫీలయ్యాడు. అయినా, అన్నయ్య రవీంద్రభారతికి వెడుతున్నట్టు వసుంధరకి తప్ప రెండో మనిషికి తెలీదు. మీ తమ్ముడు నాతోపాటు రవీంద్రభారతికి వస్తున్నాడని వసుంధర ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నయ్యకి కబురు పెట్టదు. మరి, అన్నయ్య అక్కడికి ఎందుకు వచ్చినట్టు? వెధవ సంత! లేనిపోని ఆలోచనలతో బుర్ర వేడెక్కించుకోవడం మంచిది కాదనుకున్నాడు కిష్టుడు.

నాగిని నృత్యం సగంలో వచ్చేసినందుకు కొంత బాధపడినా పాముని చూసినందుకు తృప్తిపడ్డాడు. పంకజం నిజంగా గొప్ప నర్తకి. కిష్టుడు చూపు పంకజం గారి ఆల్బమ్ మీద పడింది. ఆ ఆల్బమ్ ని వసుంధర తన కిచ్చింది దాన్నింతవరకూ అతను చూడనేలేదు. అందుచేత ఆల్బమ్ ని తీసుకుని పేజీలు తిప్పుతున్నాడు ఎ పేజీ చూసినా ఒక అద్భుత కళావైభవమే.

వివిధ నృత్యరీతుల్లో పంకజం మహత్తరంగా కనిపిస్తోంది. అతను పేజీలు తిప్పుతూనే ఉన్నాడు. ఒక పేజీ దగ్గర కిష్టుడు గొప్ప షాక్ తిన్నాడు. వరూధినీ ప్రవరాఖ్య నృత్యనాటిక సన్నివేశమే ! ప్రవరాఖ్యుడు అన్నయ్యే ! వరూధిని పంకజమే ! అయితే మునుపు చూసిన ఫోటో మాదిరి ఆ ఫోటోలో కౌగిలింత లేదు. పంకజం అన్నయ్యకు చెంపను ఛెళ్ళుమనిపిస్తున్న భయంకర దృశ్యముంది.

పంకజం రుద్రకాళిలాగానూ, భీతహరిణిలాగనూ, రెండు విధాలుగానూ కనిపిస్తోంది అన్నయ్య పాపం బిత్తరపోతున్నాడు పిచ్చి మొహం ! ఆ ఫోటో చూడగానే కిష్టుడికి అన్నయ్యమీద జాలికలిగింది. ఇప్పుడు విషయం కొంచెం అర్థమవుతోంది. వరూధినిని ప్రవరాఖ్యుడు కౌగలించుకున్న ఫలితమే - చెంపదెబ్బ.

వీధిలో కారు ఆగిన శబ్ధమైంది. అన్నయ్య వచ్చాడని అర్థం చేసుకున్నాడు. ఆల్బమ్ ని మంచంమీద పెట్టేసి క్లాసు పుస్తకం తీసుకున్నాడు. చెడామడా చదివేస్తున్నాడు. శివుడు వస్తూ కిష్టుడు గదిలోకి తొంగి చూశాడు ! తమ్ముడు శ్రద్ధగా చదువు కోవడం చూసి ముచ్చట పడ్డాడు. "కైలాసం నా తమ్ముడిమీద నిందలు వేస్తావా?" అని గొణుక్కున్నాడు.