TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
(1)(1)(1)(1)(1).jpg)
28వ భాగం
పార్కులో రెండు సైకిళ్ళు కౌగలించుకుని పడుకున్నాయి. వాటి సొంతదారులు మాత్రం ఇంకా ఆ స్టేజీకి ఎదగలేదు. ఆ పార్కు కిష్టుడు కి వసుంధరకి సాక్షాత్తు నందనవనమే అయ్యింది. వసుంధరకి కిష్టుడు డాన్స్ పాఠాలు నేర్పుతోంది. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నాడో గాని కిష్టుడు ఆ పాఠాలు బాగానే వంటబడ్డాయి.
వసుంధరకి ఏ మాత్రం తీసిపోకుండా నాట్యం చేయగలుగుతున్నాడు. వాళ్ళ నాట్యం చూసే అదృష్టం అందరకీ వుండొద్దూ? అలుపులేదు. విసుగులేదు. ఎంతసేపట్నుంచి నాట్యం చేస్తున్నారోగాని గొప్ప ముచ్చటగా వుంది. సాక్షాత్తు రాధాకృష్ణుల వల్లే వున్నారిద్దరూ. చివరికి ఆ డాన్స్ పూర్తయింది.
"ఏమిటో అనుకున్నాను. డ్యాన్స్ లో ఇంత సుఖముందని ముందే తెలిస్తే ఇన్నాళ్ళూ కసరత్తులతో టైం వేస్టు చేసే వాడినే కాదు." అన్నాడు కిష్టుడు.
"అన్నట్టివ్వాళ ఆంటీ డాన్సుంది తెలుసా?"
"ఎక్కడ?"
"రవీంద్ర భారతిలో" "మరి పామొస్తుందా?" కుతూహలంగా అడిగాడు.
"తప్పకుండా వస్తుంది."
"అయితే తప్పకుండా చూడాలి."
"ఇప్పట్నుంచి ఇటే పోదామా?"
"అదే చెయ్యాలి. ఇంటికెడితే మళ్ళీ బయటకు రానివ్వడు అన్నయ్య."
"ఇంటికి ఆలస్యంగా వెడితే ఊరుకుంటాడా మరి?"
"ఏదో ఒకటి కోస్తానుగా. ఆ మాటకొస్తే ఈ మధ్య చాలా కోస్తున్నాను. అన్నయ్య అమాయకుడు. పాపం. అన్నీ నమ్మేస్తాడు. ఊ...పద పోదాం, ముందు హోటల్ కి, ఆ తర్వాత రవీంద్రభారతికి" అంటూ కిష్టుడు వసుంధరకు చెయ్యి అందించాడు. ఆమె అతని చేతిని ఆసరాగా తీసుకుని అతన్ని లతలాగా అల్లుకుపోయింది. ఎంతో ఓపిగ్గా పొదల మాటున కూచిని ఆ భాగోతం యావత్తూ చూస్తున్న కైలాసం కళ్ళు మూసుకున్నాడు. కౌగలించుకున్న సైకిళ్ళ దాగ్గారికి కిష్టుడూ, వసుంధరా నడుస్తున్నారు. కైలాసం చెంప చెళ్ళుమనిపించాడు శివుడు. కైలాసానికి నషాళం అంటినట్టయింది. చెంప సవరించుకుంటూ బాధగా 'సార్' అన్నాడు.
"బుజ్జులి చెంప ఇట్లా వాయించవలసిందే. అర్థమైందా?" అన్నాడు శివుడు.
కైలాసం తల ఊపాడు.
"వాళ్లిద్దరూ కులాసాగా డాన్స్ చేస్తుంటే చూస్తూ ఊరుకున్నావా? ఒకర్నొకరు అతుక్కుపోయి ముచ్చట్లు చెప్పుకుంటుంటే వింటూ కూర్చున్నావా? ఇందుకేనా నీకింత జీతమిచ్చి పెట్టుకున్నది. వాడు చెడిపోతూంటే చూస్తూ ఊరుకోవడమేనా నీ ఉద్యోగం?"
"లేదు సార్. బుద్ధి చెప్పాలి."
"మరి చెప్పావా?"
"లేదు సార్."
"ఎంచేత?"
"చెబితే వినేట్టు లేడండి, కోడదామంటే నా శక్తి చాలదండి"
"ఏడవలేకపోయావ్. హు..ఉద్దరించావు. నాకు తెలుసు కైలాసం! ఇదంతా ఆ పంకజం నడిపిస్తున్న నాటకం! ఆ దుర్మార్గాలు కావాలనే నా ఇంటి ముందు కాపురం పెట్టింది. ఆ పిల్లని కావాలనే బుజ్జులు మీదికి ప్రయోగించింది. నన్ను దెబ్బతీయాలని చూస్తోంది. కైలాసం! అయ్ నో ఇట్! ఇప్పుడు వాడు ఎక్కడుంటాడు."
"రవీంద్రభారతిలో పంకజం గారి డాన్స్ ప్రోగ్రామ్ కి వెళ్ళి వుంటారండీ."
"హు! రవీంద్ర భారతి" అని గొణుక్కున్నాడు శివుడు కోపంగా.
రవీంద్రభారతి ప్రక్షకుల్తో కిటకిట లాడిపోతుంది. ముందు నుంచి మూడో వరసలో కిష్టుడూ, వసుంధరా పక్కపక్కన కూచుని వున్నారు. అంతమంది జనంతో హాలు కిటకిట లాడుతున్నా రవ్వంత శబ్దం లేదు. పంకజం నాగిని నృత్యం చేస్తోంది. నిమిషాలు గడుస్తున్నాయి. ఇంకా పాము రాలేదు.
కిష్టుడు వసుంధరని కంటె సైగతో అడిగాడు పాము ఏదని? వసుంధర కూడా కళ్ళతోనే చెప్పింది చూస్తుండమని. హెచ్చరించిన మరుక్షణంలో పంకజం నృత్యం తారాస్థాయి నందుకుంది. పంకజం శరీరం పాములాగా మెలికలు తిరిగుతోంది. ఆ అద్భుత విన్యాసాన్ని ప్రేక్షకులు మైమరచి చూస్తున్నారు.
|
|