Shivatandavam - Comedy Serial 27

Listen Audio File :

27వ భాగం

తెలతెలవారుతోంది! రోడ్డు పక్క టీ కొట్లోంచి సుప్రభాతం వినిపిస్తోంది. ఆ వేళప్పుడు జనసంచారం వుండదు గనక రోడ్డు నిర్మానుష్యంగా వున్నది. తెల్ల నిక్కరు, తెల్లబనీను, తెల్ల కేన్వాస్ షూష్ తో శివుడు ఆ రోడ్డు మీద మార్నింగ్ వాక్ చేస్తున్నాడు. అతను అట్లా నడుస్తుంటే మిలట్రీ ఆసామి ఠీవిగా నడుస్తున్నట్టుంది.

ఒక కంచు విగ్రహం కదులుతున్నట్టుంది. ఆ నడక్, చేతులూపే తీరు, ఉబ్బిన ఆ ఛాతీ, మెలి తిరిగిన కండలూ ఒక వస్తాదులా ఉన్నాడు. అప్పటికే ఒక మైలు దూరం నడిచి ఉంటాడు. ఇంకా నడుస్తూనే వున్నాడు. అట్లా నడుస్తూనే శివుడు గోడమీద ఒక వాల్ పోస్టర్ని చూసి అకాస్మాత్తుగా ఆగిపోయాడు. అందులో పంకజం వుంది. ఆ కింద ఈ విధంగా రాసి వుంది. చూడండి తప్పక చూడండి. ఆలసించిన ఆశాభంగం. నాట్యమయూరి పంకజం నృత్యం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ప్రేక్షకలోకానికి కన్విందు.

నాగిని నృత్యంలో పాము రాక ప్రత్యేకత! తప్పక చూడండి. అంతా చదివిన తర్వాత శివుడిక్కోపం వచ్చింది. ఆ వాల్ పోస్టర్ను సర్రున చింపేసి మళ్ళా నడక సాగించాడు. శివుడూ అని పిలుపు వినిపించింది. ఆ దిక్కు చూసాడు. పంకజం. శివుడు నడక వేగం పెంచాడు చిరాగ్గా. పంకజం శివుడ్తోపాటు శివుడులాగానే నడుస్తూ మాట్లాడుతోంది.

"నామీద నీ కెందుకింత కసీ, కోపం శివుడూ! (అతను నడక జోరు చేశాడు. పంకజం అతన్ని ఓపిగ్గా అనుసరిస్తోంది) నీ ఇంటికొచ్చాను తలుపు తీయలేదు. ఫోన్ చేశాను వినిపించుకోలేదు. ఉత్తరం రాశాను చదవలేదు. (శివుడు మరింత వేగంగా నడుస్తున్నాడు. అతని నడకతోపాటు నడవడం పంకజానికి చేతకాలేదు. అంచేత పరుగెత్తుతోంది అతని నడకతో పాటు) ఆ ఉత్తరంలో అన్ని వివరాలూ రాశాను శివుడూ! కొంచెం ఆగు! ఇక్కడ నిలబడు. అంతా చెబుతాను.

శివుడూ నాకు ఆయాసంగా ఉంది. ఇంకా పరుగెత్త లేను. నిలబడు శివుడూ ఆ రోజు నువ్వు నది దాటి వచ్చిన్నాడు " శివుడు పరిగెత్తాడు. పంకజం అతన్ని అనుసరించలేక పోయింది. చూస్తుండగానే శివుడు కనుమరుగయ్యాడు. డ్యూటీ దిగిన అప్పల్సామి సైకిలెక్కే ముందు లేహ్యం పుచ్చుకున్నాడు. అంచేత అతను చాలా స్టడీగా ఉన్నాడు. మామూలుగా చిలకమ్మ కొట్టు దగ్గర బ్రేకు పడాల్సిన సైకిలు బెల్లు కొట్టుకుంటూ వెళ్ళిపోవడం చూసి చిలకమ్మ గొప్ప వర్రీ అయిపోయింది.

మావకెవరో మందుట్టేరని గొణుక్కుంది. అప్పల్సామి గుర్రమెక్కిన రాజకుమారుడిలాగా వస్తూనే వున్నాడు. రోడ్డుమీద ఎంతకీ తన కింది జాతే కనిపించటం వల్ల కళ్లతో విష్ చేసేస్తూ వస్తున్నాడు. అయితే గురూగారిల్లు చేరుకుంటుండగా సైకిలుకి బ్రేకు పడిపోయింది. ఆ బ్రేకు అప్రయత్నంగానే పడింది. వెంటనే సైకిలు దిగాడు. తన సైకిలుకి బ్రేకు కొట్టిన ఆ దృశ్యాన్ని ఇంకా చూస్తూనే ఉన్నాడు విడ్డూరంగా. సీజరు గేటవతల వుంది. గేటివితల ఆడకుక్క ఉంది. అవి రెండూ అట్లా నిలబడి పోయివుంటే బాధలేదు. ఏవో ముచ్చట్లాడుకుంటున్నాయి కాబోలు. ముద్దులెట్టుకుంటున్నట్టు మూతలు రెండూ దగ్గరగా చేర్చేశాయి.

అప్పల్సామి ముక్కుమీద వేలేసుకున్నాడు. 'రామ రామ' అనుకున్నాడు. 'సీజరూ' అని పేల్చాడు మందలింపుగా. సీజరు తోకాడిస్తూ అప్పల్సామిని చేరుకుంది. అప్పల్సామి వెంటనే జేబులోంచి డబ్బీ తీశాడు. కొంచెం లేహ్యాన్ని చూపుడు వేలితో తీసి సీజరు నాలుక మీద రాశాడు. దాంతో సీజరు తోక ముడిచేసి శివుడింట్లోకి వెళ్ళిపోయింది.

ఆడకుక్క అప్పల్సామి వైపు గుర్రుగా చూస్తూ భౌ....భౌ ....మణి తిడుతోంది. అప్పల్సామి దాని వైపు చూసి అన్నాడు. "సీజరంటే ఏమిటనుకున్నావే ? నిప్పే! నిప్పు! పాడు చేద్దామనుకుంటున్నావేమో పుట్టగతులుండవు జాగ్రత్త!" ఆడకుక్క మళ్ళీ భౌ భౌ మంది. 'ఇంకోసారి మొరిగావంటే నీ క్కూడా పెట్టేస్తా లేహ్యం? అవునూ ఇంతకీ ఈ లేహ్యం మగజాతికేనా? ఆడజాతి క్కూడా పనిచేస్తుందా?" అనుకుని బుర్ర గోక్కున్నాడు.

"ఇదేదో గురూగారినే అడిగి తెల్సుకుంటే పోలా? అని కూడా అనుకుని హనుమాన్ భవన్లోకి అడుగు పెట్టబోతుండగా" చూస్తున్నా! అంతా చూస్తున్నా!" అనే మాట వినిపించింది. మాట వినిపించిన వైపు చూశాడు. అక్కడ దుర్గమ్మ నడ్డిన చేతులుంచుకుని నిలబడి వుంది. ఆమెను చూడగానే అప్పల్సామి గుండెలు జారిపోయాయి.

గబగబా సైకిలెక్కి స్పీడుగా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు.