సిల్లీ ఫెలో - 54

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 54

- మల్లిక్

 

"సడెన్ గా నీకేమైందిరా తింగరెధవా?" కళ్ళు పెద్దవి చేసి బుచ్చిబాబు వంక చూస్తూ అడిగాడు పర్వతాలరావు.

"పాపం. వాడు ఊరెళ్ళిపోయే ముందు ఎందుకండీ అలా తిడతారు?" అంది పార్వతమ్మ.

"తిట్టక! అలా వెర్రినవ్వులు నవ్వుతాడేం వెధవ సన్నాసి"

"మరేమో... మీరు స్టేషన్ లోపలిదాకా వస్తామన్నారు, వచ్చారు. ఇంక వెళ్ళిపోండి నాన్నా... అనవసరంగా మీకు శ్రమ!"

"అదేంట్రా... ఇంకా బండి రాలేదు. నువ్వింకా దాంట్లోకి ఎక్కలేదు. మమ్మల్ని వెళ్ళిపొమ్మంటావ్? అంది పార్వతమ్మ.

"ఏంరోయ్... ఏంటి కథ... మాట్లాడితే వెళ్ళిపొమ్మంటున్నావ్? అనుమానంగా చూస్తూ అడిగాడు పర్వతాలరావు.

వెళ్ళిపొమ్మని ఇంక అతిగా ఫోర్స్ చేస్తే వాళ్ళకి లేనిపోని అనుమానాలు కలుగుతాయని బుచ్చిబాబుకి అర్థం అయిపోయింది.

"అంటే... మీకు అనవసరంగా శ్రమని వెళ్ళిపొమ్మన్నా..... నాకేం? హిహి!" అన్నాడు బుచ్చిబాబు చేతిలోని సూట్ కేసుని నేలమీద పెట్టేస్తూ.

"అదేంటి సూట్ కేసుని ఇక్కడే తగలేస్తున్నావ్? నీది ఎస్ - 2 కోచ్ అన్నావుగా. మనం మరికాస్త ముందుకెళ్ళాలేమో.. ఆ కోచ్ ముందుకు వస్తుందనుకుంటా!" అన్నాడు పర్వతాలరావు.

"మనం ఇక్కడే వెయిట్ చేద్దాం నాన్నా... బండి వచ్చాక చూద్దాంలే.." అన్నాడు వాళ్ళిద్దరికీ అడ్డుగా ఇటూ అటూ కదుల్తూ.

బుచ్చిబాబు ప్రవర్తనకి ముందు సీత తెల్లబోయినా తర్వాత అతని తల్లిదండ్రుల్ని చూసిన ఆమెకి పరిస్థితి అర్థం అయిపోయింది. అందుకే సీత క్రిందున్న సూట్ కేస్ అందుకుని మెల్లగా స్తంభం వెనక్కి వెళ్ళి నిల్చుంది.

"ఏంటా ఊగడం? ఏదైనా పింజారీ సినిమా పాటకి స్టెప్పు లేస్తున్నావా?" చిరాగ్గా చూస్తూ బుచ్చిబాబుని ప్రశ్నించాడు పర్వతాలరావు.

"అంటే రైలు కోసం ఎదురుచూస్తూ ఖాళీగా నిల్చుంటే బోరుకోట్టి..." మెలికలు తిరిగాడు బుచ్చిబాబు.

"మరీ అంతిదిగా మెలికలు తిరిగిపోకు. కాళ్ళు మెలిపడి బోర్లా పడిపోగలవు"

అంతలో మైకులో అడ్డదిడ్డంగా ఓ అనౌన్స్ మెంటు వచ్చింది.

"ప్యాసింజర్లకి ఒక్క ముఖ్య గమనిక! కొద్ది క్షణాలలో విశాఖపట్నం వెళ్ళే గోదావరి ఎక్స్ ప్రెస్ వక్టో నెంబర్ ప్లాట్ ఫారము మీదికి చచ్చును.. క్షమించండి వచ్చును."

బుచ్చిబాబు ఊగుతూనే మెల్లగా వెనక్కి తిరిగి చూశాడు.

అతనికి ఇందాక సీత నిల్చుని వున్న చోట కనిపించలేదు.

బుచ్చిబాబుకి కంగారుపుట్టింది.

ఏది సీత?" కొంపదీసి అమ్మా నాన్నలను చూసి వెళ్లిపోయిందా? అతని కళ్ళు ఆందోళనగా వెతికాయి.

ఇప్పుడెలా అని అతను అనుకుంటుండగానే స్థంభం చాటునుండి సీత చీర కనిపించింది.హమ్మయ్యా అని బుచ్చిబాబు తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు.

సరిగ్గా అప్పుడే గోదావరి ఎక్స్ ప్రెస్ ప్లాట్ ఫాం మీదికి ధడాధడా శబ్దం చేస్తూ వచ్చి ఆగింది.

"ఒర్రేయ్ వెధవాయ్.... నీ యస్ - 2 భోగి మనల్ని దాటి ముందు కెళ్ళిపోయింది. పద పద..." అంటూ కంగారు పెట్టేశాడు పర్వతాలరావు.

"అబ్బ... ఉండునాన్నా! రైలు రాగానే పరుగులు తీసి తోసుకుని ఎక్కితే నన్నందరూ పల్లెటూరి గబ్బిలాయ్ అనుకుంటారు. రైలు ఓ పావుగంట వుంటుందిలే" అన్నాడు బుచ్చిబాబు ఓరకంట సీత ఏం చేస్తుందో గమనిస్తూ.

సీత స్థంభం చాటునుండి చటుక్కున బయటికి వచ్చి ఎస్ - 2 భోగిలోకి ఎక్కడం చూశాడు బుచ్చిబాబు.

రెండు నిమిషాలు గడిచాయ్...

"ఏరా ఎబ్రాసెదవా.... రైలు కదిలి వెళ్ళిపోయేదాకా ఇలానే గెడకర్రలా నిలబడి పోతావా ఏం? పద పద..." అంటూ కంగారు పెట్టేశాడు పర్వతాలరావు.

బుచ్చిబాబు సూట్ కేస్ అందుకుని బరువెక్కిన గుండెతో అడుగులు ముందుకు వేసాడు.

ఎస్ - 2 బోగి దగ్గరకు వచ్చాక సూట్ కేస్ మళ్ళీ కిందపెట్టేసి నిలబడిపోయాడు బుచ్చిబాబు.

"అదేంటి మళ్ళీ ఇక్కడ ఆగిపోయావు.... నీదంతా బుర్ర తిరుగుడు వ్యవహారంలా వుందే? లోపలికి పద" అంటూ పర్వతాలరావు రైలెక్కబోయాడు.

బుచ్చిబాబు కెవ్వుమని అరిచాడు.

"ఏంటినాన్నా... నువ్వెందుకు ఎక్కుతున్నావు? ఊరువెళుతున్నది నేను" కంగారుగా అన్నాడు.

"నువ్వేలేవోయ్... ఓ అయిదు నిముషాలు లోపల కూర్చుని దిగి పోతాం... నువ్వు రావే" అన్నాడు పర్వతాలరావు.

పార్వతమ్మ కూడా రైలు ఎక్కబోయింది.