సిల్లీ ఫెలో - 53

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 53

- మల్లిక్

 

ఆటో రివ్వుమంటూ రైల్వేస్టేషన్ వైపు దూసుకువెళ్తుంది. దాంట్లో బుచ్చిబాబు, అతనికి అటూ ఇటూ పర్వతాలరావు, పార్వతమ్మ కూర్చుని వున్నారు.

"అసలు మీరు కూడా ఇలా సిల్లీగా రైల్వేస్టేషన్ కి రావడం ఏంటి నాన్నా! నాకేం నచ్చలేదు" అన్నాడు బుచ్చిబాబు.
"అదేంట్రా బాబూ... నువ్వు ఊరిగాని ఊరుకి ట్రాన్స్ ఫర్ అయి వెళ్ళిపోతుంటే స్టేషన్ కి కూడా రావొద్దని అంటావ్" అంది పార్వతమ్మ.


"మనం స్టేషన్ కి వస్తే యెం అడ్డో వెధవన్నర వెధవకి!" ధుమ ధుమలాడుతూ అన్నాడు పర్వతాలరావు.

బుచ్చిబాబు గత్తుకుమన్నాడు.

"నాకేం అడ్డు హి హి హి సిల్లీగా? మీరు భలే మాట్లాడతారు నాన్నా! ఏదో మీకు శ్రమనీ... హి!" బలవంతంగా నవ్వుతూ అన్నాడు.

"చూసారా... చూశారా.... మనబ్బాయికి మనమంటే ఎంత ప్రేమో! పాపం మనకి శ్రమ అని స్టేషనుకెందుకులే వద్దని అంటున్నాడు" సంబరంగా అంది పార్వతమ్మ.


"ఏడవలేకపోయాడు పింజారీ వెధవ! వీడిదంతా
దొంగభక్తి" అన్నాడు పర్వతాలరావు ఆటోలోంచి బయటకు చూస్తూ.

బుచ్చిబాబుకి మాత్రం యమా టెన్షన్ గా వుంది. తనతో కూడా స్టేషన్ కి తల్లితండ్రులు వస్తారని అతను ఊహించలేదు. అక్కడ రైల్వేస్టేషన్ లో ప్లాట్ ఫారం మీద నిలబడి సీత తనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది.

సీతను పర్వతాలరావు పార్వతమ్మ చూస్తే?"

కొంపలు మునిగిపోతాయ్.

ఇప్పుడెలా? ఎలా?? ఎలా?

బుచ్చిబాబు బాధగా జుట్టు పీక్కున్నాడు.

"అదేంట్రా బాబూ జట్టు అలా పీకేస్కుంటున్నావ్?" బుగ్గలు నొక్కుకుంటూ అడిగింది పార్వతమ్మ.

"అంటే దురదన్నమాట! ఆఫీసులో నా పక్కసీట్లో వాడు దొంగ బాబాలా దుబ్బు జుట్టు పెంచాడు. వాడితలలో పేలన్నీ నాకు ఎక్కాయన్న మాట. హిహి" అన్నాడు బుచ్చిబాబు.

"అయినా ఆ అడ్డగాడిదెవడో దుబ్బుజుట్టు పెంచడం ఏంటీ... వాడి తలలోని పేలను ఈ నిలువు గాడిద తలలో ఎక్కించుకోవడం ఏంటీ... హు! అన్నాడు పర్వతాలరావు.

తండ్రి చూడకుండా మరోసారి జుట్టుని కసిగా పీకున్నాడు బుచ్చిబాబు.

ఆటో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ని సమీపించింది.

"ఆటో!"

గుండెలు బద్దలయ్యేలా అరిచాడు బుచ్చిబాబు.

ఆటోవాడు సడెన్ బ్రేక్ తో ఆటోని ఆపాడు.

"గేంది సార్... ఆ అర్సుడెంది? గుండెల్ ఆగిపోయేద్దికదా ఇస్కీ! గిట్లరిస్తే మీటర్ మీద పదీ రూపాయలు ఎక్స్ ట్రా ఇవ్వాళ...ఆ!" అన్నాడు వెనక్కి తిరిగి గీరగా చూస్తూ.

వాడి మాటను ఆ ముగ్గురూ పట్టించుకోలేదు.

ఎందుకురా వెధవాయ్ ఈ వెధవాటోని ఇక్కడే ఆపెయ్య మన్నావ్?" అడిగాడు పర్వతాలరావు.

'అదే నాన్నా... పాపం మీరు స్టేషన్ దాకా వచ్చారు కదా..... మళ్ళీ లోపలికెందుకు మీకు శ్ర్రమ... నేను సూట్ కేసు తీస్కుని ఇక్కడ దిగిపోయి లోపలికెళ్ళిపోతాను. మీరు ఇదే ఆటోలో ఇంటి కెళ్ళిపోండి" అన్నాడు బుచ్చిబాబు.

"అదేంట్రా అలా అంటావ్... పాపం మీ నాన్నాగారు రైలు కదిలాక నీకు టాటా చెప్పి ఇంటికెళ్ళాలని అనుకుంటుంటే!" అంది పార్వతమ్మ.

"ఆ వెధవలానే అంటాడుగానీ నువ్వు ఆటోని లోపలికి పోనియ్యవోయ్" అన్నాడు పర్వతాలరావు.  

ఆటో ఒక్క కుదుపుతో ముందుకు దూకింది.

"దేవా! ఈ గండం నుండి నేవ్వే గట్టెక్కించాలి!" టెన్షన్ గా ఫీలవుతూ అనుకున్నాడు బుచ్చిబాబు.

ఆటో స్టేషన్ కాంపౌండ్ లోకి వెళ్ళి ఆగింది. ఆటోవాడికి డబ్బులిచ్చి స్టేషన్ లోపలికి అడుగుపెట్టారు ఆ ముగ్గురూ. బుచ్చిబాబు సూట్ కేసు చేత పట్టుకుని పర్వతాలరావు, పార్వతమ్మలకు అడ్డుగా నడుస్తూ ప్లాట్ ఫాం మీద సీత కనిపిస్తుందేమోనని వేయి కళ్ళతో పరిశీలిస్తున్నాడు.

"నువ్వు పక్కనైనా నడువ్ లేకపోతే వెనకాలైనా నడువ్. అలా కాళ్ళకి అడ్డుగా నడుస్తావేంరా వెధవాయ్?" విసుక్కున్నాడు పర్వతాలరావు.

బుచ్చిబాబు త్రండి మాటల్ని పట్టించుకోలేదు. అతని చూపులు సీతని వెతుకుతున్నాయి.

అంతలో దూరంగా సీత సూట్ కేస్ ప్రక్కన నిలబడి ఉండడం కనిపించింది.

సీతకూడా బుచ్చిబాబుని చూసింది. నవ్వుతూ చెయ్యెత్తి ఊపింది.

బుచ్చిబాబు కంగారుగా మొహం తిప్పేసి వెనక్కి తిరిగి పర్వతాలరావు వంక చూసి "హిహిహి" అని నవ్వాడు.