సిల్లీ ఫెలో - 55

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 55

- మల్లిక్

 

"హబ్బ"

బుచ్చిబాబు తలని కంపార్టుమెంటుకేసి బాధగా కొట్టుకున్నాడు.

"మళ్ళీ ఏమైందిరా వెధవాయ్" అడిగాడు పర్వతాలరావు.

"మీరు ఎక్కడానికి వీల్లేదంతే"

"అదే ఎందుకు వీల్లేదని? నీకేంటి అభ్యంతరం?"

"హబ్బ..." మళ్ళీ కంపార్టుమెంట్ కేసి తల కొట్టుకున్నాడు బుచ్చిబాబు.

"అబ్బా! వాడినెందుకండీ అలా బాధపెట్టడం... మీరు దిగండి" అంటూ పార్వతమ్మ కిందికి దిగేసింది.

పర్వతాలరావు కిందకి దిగి అడిగాడు.

"అయినా మేం లోపల కూర్చుంటే నీకేంటిరా బాధా?"

"ఏం లేదు నాన్నా. రైలు సడన్ గా కదిలిందంటే దిగడం మీకెంత కష్టం? ఈ మధ్య ఆఫీసులో పనిచేసే అతని తండ్రికూడా ఇలాగే కొడుకు ఊరేళ్తుండగా అతనితోపాటు రైలెక్కి కాస్సేపు కూర్చుని రైలు కదిలే టైంకి కంగారుగా కిందకి తూలి రైలు క్రిందకి పడి రెండు కాళ్ళూ పోగొట్టుకున్నాడు. అందుకే అంతగా బాధపడుతున్నా." 

"చూసారా మన అబ్బాయికి ఎంత జాగ్రత్తో పాపం" మురిసిపోతూ అంది పర్వతాలరావు.

బుచ్చిబాబు రైలెక్కి సీత దగ్గర సూట్ కేస్ పెట్టి "ఎందుకయినా మంచిది రైలు కదిలే దాకా నువ్వు బాత్రూమ్ లో వుండు" అని చెప్పి మళ్ళీ రైలు దిగిపోయాడు. తను రైల్లోనే కూర్చుంటే కిటికీలోంచి చూసే తల్లితండ్రులకు సీత కనిపిసుందేమోనని బుచ్చిబాబు భయం.

"అదేంట్రా వెధవాయ్. మళ్ళీ దిగిపోయావు?" అడిగాడు పర్వతాలరావు.

"నేను రైలులోపల, మీరు బయటా ఏం బావుంటుందని దిగాను. రైలు కదిలే సమయానికి ఎక్కుతాను" అన్నాడు బుచ్చిబాబు.

పార్వతమ్మ బుచ్చిబాబుకి అన్ని రకాల జాగ్రత్తలు చెప్పింది.

సెలవుల్లో వచ్చి వెళుతుండమని పర్వతాలరావు బుచ్చిబాబుకి చెప్పాడు.

ఇంతలో గార్డు విజిల్ వేసి జండా ఊపాడు.

బుచ్చిబాబు కంగారుగా రైలు ఎక్కాడు. కూత పెట్టి రైలు భారంగా ముందుకు కదిలింది. ప్లాట్ ఫాం మీద తల్లితతండ్రులు కనుమరుగు అయ్యేదాకా టాటా చెప్పి తర్వాత తేలిగ్గా ఊపిరి పీల్చుకుని లోపలికి తన సీటు దగ్గరికి వెళ్ళాడు. సీత అప్పుడే బాత్రూమ్ నుండి వచ్చి కూర్చింది. బుచ్చిబాబు ఆమె పక్కన కూర్చుని ఆమె భుజం మీద తల వాల్చేస్తూ "హమ్మయ్యా" అన్నాడు.

రైలు వేగం పుంజుకుంది.