TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
“ఈ ఇల్లే.. ఇదిగో ఈ ప్రక్కన ట్రాన్స్ ఫార్మర్.. ఎదురుగా ఆ చెత్త కుండీ నాకు బాగా గుర్తు!” అన్నాడు రాంబాబు.
ఇద్దరూ ఆ యింటిని సమీపించారు. డోర్ బెల్ నొక్కారు. కొన్ని క్షణాల తర్వాత తలుపులు తెరుచుకున్నాయ్. ఎదురుగా... బాకా! రాకా స్నేహితుడు బాకా! బాకా అంటే బాదరబందీ కామారెడ్డి. అతడ్ని చూడగానే రాంబాబు, చిన్నారావ్ లు చాలా సంతోషించారు. రాకా దొరికినట్టుగానే భావించారు. “హలో.. బాగున్నారా?” అన్నాడు రాంబాబు బాకాతో.
'బాగానే వున్నానుగానీ..... మీరెవరు?” వాళ్ళిద్దర్నీ గుర్తుపట్టన్నట్టు చూశాడు బాకా.
“మేమండీ... మీ ఫ్రెండ్ రాకాతోపాటు మొన్న మీ ఇంటికి వచ్చాం" అన్నాడు రాంబాబు.
"రాకానా? వాడెవడు? అయినా మీర మా ఇంటికి ఎప్పుడొచ్చారు" అన్నాడు బాకా.
రాంబాబు, చిన్నారావ్ లు అయోమయంగా మొహమొహాలు చూస్కున్నారు. “మీరు బాకానే కదా?” ఆశ చావక అడిగాడు రాంబాబు.
“నేను బాకానే... కానీ మీరెవరో, ఆ రాకా ఎవరో నాకు తెలీదు" అన్నాడు బాకా కఠినంగా.
“కాదండీ.... ఆరోజు ఉదయం మీరు మాకు కాఫీ పెట్టి ఇచ్చారు. మధ్యాహ్నం భోజనం కూడా మీరే వడ్డించారు" అన్నాడు రాంబాబు.
“మీకేదో మతి భ్రమించినట్టు వుంది.. మీకేంటీ నేను భోజనం వడ్డించడం ఏంటీ?” విసుగ్గా అన్నాడు బాకా.
“పోనీ అవన్నీ ఎందుకుగానీ.... రాకా ఎక్కడున్నాడో చెప్పండి చాలు" అన్నాడు చిన్నారావ్,
“అసలు రాకానే ఎవడో తెలీదంటుంటే, వాడు ఎక్కడున్నాడో ఎలా తెలుస్తుంది? నా టైం వేస్టు చెయ్యకండిక" అంటూ తలుపులు ధనేల్ మని వాళ్ళిద్దరి మొహాలమీదే వేసేశాడు బాకా.
రాంబాబు, చిన్నారావ్ కి అర్ధం అయ్యింది.... బాకా తమని గుర్తు పట్టనట్టు నటిస్తున్నాడనీ... అతను తమకు నిజం చెప్పడనీ.
ట్రింగ్... ట్రింగ్... ట్రింగ్... ట్రింగ్... ట్రింగ్... ట్రింగ్... హాల్లోని ఫోన్ మోగుతూ వుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కమీషనర్ లింగారావ్ విసుగ్గా ఫోన్ ఎత్తాడు. “హలో!” అన్నాడు.
“హలో... ఇది పోలీస్ కమీషనర్ లింగారావ్ గారి ఇల్లేనా?” అవతలి నుండి రాకా ప్రశ్నించాడు.
“నువ్వు ఎవరింటికి ఫోన్ చేశావ్" చికాకుగా అడిగాడు లింగారావ్.
“కమీషనర్ లింగారావ్ ఇంటికి చేశా.”
“మరి లింగారావ్ గారి ఇల్లేనా అని అడుగుతావేం?”
“కమీషనర్ లింగారావ్ తో మాట్లాడాలి" అన్నాడు రాకా.
“నేనే.. లింగారావ్ ని మాట్లాడ్తున్నా.”
“నేను రాకాని మాట్లాడ్తున్నా.”
“నేను వాజపేయిని మాట్లాడ్తున్నా అన్నంత లెవెల్ లో చెప్పావే? రాకా అంటే?” అడిగాడు లింగారావ్.
“అంటే ది గ్రేట్ క్రిమినల్ అన్నమాట!”
“అయితే నీ అడ్రస్ చెప్పు... వచ్చి అరెస్ట్ చేస్తా" విసుగ్గా అన్నాడు కమీషనర్ లింగారావ్,
“అంత విసుగొద్దు కమీషనర్? మీ దీప నా కబ్జాలో వుంది...” అన్నాడు రాకా.
“ఆ... మా దీప నీ దగ్గరుందా?!” ఆశ్చర్యంగా అడిగాడు లింగారావ్.
“అవును... ఆ మంగులు గాడిని చితక్కొట్టి దీపని నేను తీస్కెళ్ళా. మీ దీపని క్షేమంగా అప్పగించాలంటే నాకు ఇరవై లక్షలివ్వాలి! ఆలోచించుకో.. మళ్ళీ ఫోన్ చేస్తా.” రాకా ఫోన్ పెట్టేశాడు.
“అసలు పదిలక్షలే ఇవ్వలేనని మంగులుతో బేరం అడ్తుంటే వీడు ఇరవై లక్షలంటాడేంటి నాయనో!” కమీషనర్ లింగారావ్ బుర్రకాయ్ మీద బాధగా మొట్టేస్కోసాగాడు.
అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీలక్ష్మి కంగారుగా అడిగింది. “ఏమైందండీ?”
కమీషనర్ లింగారావ్ జరిగింది చెప్పాడు. శ్రీలక్ష్మి వెంటనే కళ్ళు మూస్కుని దణ్ణం పెట్టింది.
“స్వామీ... మా పాప మాకు క్షేమంగా దక్కితే ఆయన కిడ్నీ ఒకటి సమర్పించుకుంటా స్వామీ!!”
“ఓసినీ... పూర్వజన్మలో నీకు మాంసం దుకాణం గానీ వుందా ఏంటే నీ మొహం మండా... నన్ను ఒకేసారి నీ స్వామికి బలి ఇచ్చేయ్యవే..... పీడా వదిలిపోతుంది.” శ్రీలక్ష్మి మీద మండిపడ్తూ అన్నాడు కమీషనర్ లింగారావ్.
|
|